
తల్లిదండ్రుల్లేని 551 మంది అనాథ యువతులకు ఆదివారం రాత్రి గుజరాత్ రాష్ట్రంలోని భావ్‌నగర్ లో సామూహిక వివాహ వేడుక జరిగింది. భావ్‌నగర్ జవహర్ మైదానంలో ఫౌండేషన్ ఆధ్వర్యంలో జరిగిన ఈ సామూహిక వివాహ వేడుక కన్నుల పండువగా సాగింది. ఈ సామూహిక వివాహ వేడుకకు ప్రధానమంత్రి నరేంద్రమోదీ ముఖ్యఅతిథిగా వచ్చేసి నూతన వధూవరులను ఆశీర్వదించారు.
వివాహా వేడుకలకు అనవసరమైన ఖర్చులు చేసుకోవద్దని ప్రధాని ఈ సందర్భంగా సలహా ఇచ్చారు. ఆహార వ్యర్థాలను తగ్గించడంతోపాటు బయోడిగ్రేడబుల్ కిచెన్ వ్యర్థాల నుంచి పొడి వ్యర్థాలను వేరు చేయడం వంటి వాటి ద్వారా సమాజానికి సహాయం చేయాలని ఈ సందర్భంగా ప్రధాని నూతన వధూవరులను కోరారు.
బంధువుల ఒత్తిడితో విడిగా వివాహ వేడుకలను నిర్వహించవద్దని, దీనికి బదులుగా ఆ డబ్బును పిల్లల కోసం పొదుపు చేయాలని ప్రధాని మోదీ నూతన వధూవరులను కోరారు.
‘‘గుజరాత్ క్రమంగా ఈ సామూహిక వివాహాల ఆచారాన్ని అవలంబించాలి. ఇంతకుముందు ప్రజలు గొప్ప ప్రదర్శన కోసం డబ్బును అప్పుగా తీసుకొని ఆడంబరంగా వివాహాలు చేసేవారు. కానీ ఇప్పుడు ప్రజలు తెలుసుకున్నారు. వారు ఇప్పుడు సామూహిక వివాహాల కార్యక్రమాలకు మారారు’’ అని మోదీ చెప్పారు.
ఇలాంటి ఉదాత్తమైన ప్రయత్నానికి మద్దతు ఇవ్వడానికి, ఇతరులను ప్రేరేపించడానికి గుజరాత్ ముఖ్యమంత్రిగా తాను ఇటువంటి సామూహిక వివాహ కార్యక్రమాలకు హాజరయ్యానని ప్రధాని చెప్పారు.‘‘అప్పట్లో నేను జంటలకు ఇచ్చే సలహానే మళ్లీ మళ్లీ చెప్పాలనుకుంటున్నా.. చాలాసార్లు బంధువుల ఒత్తిడితో సామూహిక వివాహ కార్యక్రమంలో పెళ్లిపీటలు ఎక్కి విడివిడిగా వేడుకలు నిర్వహిస్తుంటారు.. దయచేసి అలా చేయకండి. మీ దగ్గర అదనపు డబ్బు ఉంటే, మీ పిల్లల భవిష్యత్తు కోసం దాన్ని ఆదా చేయండి’’ అని మోదీ సూచించారు.
ఆ గుజరాత్, మాయ్ బన్వాయూ చే
‘ఆ గుజరాత్, మాయ్ బన్వాయూ చే’ (ఈ గుజరాత్‌ను నేను తయారు చేశాను) అని ప్రధాని నరేంద్ర మోదీ ప్రకటించారు. అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్ ప్రకటన వెలువడిన అనంతరం తొలిసారిగా వల్సాద్ జిల్లా కప్రదాలో ఆదివారం జరిగిన ప్రచార సభలో ఆయన ప్రసంగించారు.
ఈ సందర్భంగా ఆయన ప్రసంగిస్తూ ‘‘ప్రస్తుతం ప్రతి గుజరాతీ ఆత్మ విశ్వాసంతో ఉన్నారు. ప్రతి మాటా గుజరాత్ హృదయం నుంచి వస్తోంది. ఈ గుజరాత్‌ను నేను తయారు చేశాను’’ అని పేర్కొన్నారు. రాష్ట్ర పరువు తీయడమే లక్ష్యంగా కాంగ్రెస్ పనిచేస్తోందని ఆయన మండిపడ్డారు. ‘‘గత 20 ఏళ్లుగా రాష్ట్రానికి అపఖ్యాతి తీసుకురావడంలోనే సమయాన్ని వెచ్చిస్తున్న విభజన శక్తులను గుజరాత్ ఊడ్చి పారేస్తుంది’’ అని భరోసా వ్యక్తం చేశారు.
ఈ ఎన్నికలలో గతంలో తాను సృష్టించిన రికార్డులను అధిగమించి బిజెపికి విజయం చేకూర్చాలని ఆయన ప్రజలకు విజ్ఞప్తి చేశారు. 2002లో మొదటిసారిగా తన నాయకత్వంలో బిజెపి గుజరాత్ లో అత్యధికంగా 127 సీట్లలో విజయం సాధించడాన్ని ఈ సందర్భంగా గుర్తు చేశారు.
గిరిజనులను ఉద్దేశిస్తూ 20 ఏళ్ళ క్రితం గుజరాత్ లో అభివృద్ధి వారి దారికి చేరలేదని ప్రధాని గుర్తు చేశారు. తన ప్రభుత్వంలోనే గిరిజనుల అభివృద్ధి ప్రారంభమైనది, వారికి చదువు అందుబాటులోకి వచ్చినదని ఆయన చెప్పారు. అదే విధంగా అనేక ఫిషింగ్ హార్బర్ లను ఏర్పాటు చేయడం ద్వారా మత్స్యకారులకు చేపలు పెట్టడాన్ని సులభతరం చేశామని తెలిపారు.
పదేళ్ల క్రితం రాష్ట్రంలో అందరికి విద్యుత్ సరఫరా ఉండెడిది కాదని, రోజంతా సరఫరా జరిగెడిది కాదని అంటూ రాత్రి వేళ భోజనం కోసం కూర్చుంటే విద్యుత్ ఆగిపోయేదిదని మోదీ గుర్తు చేశారు. కానీ, నేడు మారుమూల ప్రదేశాలలో సహితం అందరికి, అన్ని వేళలా విద్యుత్ సరఫరా జరుగుతున్నదని చెప్పారు. నిరంతరం ప్రతి ఇంటికి కుళాయి ద్వారా తాగునీరు కూడా అందుబాటులోకి వచ్చినదని పేర్కొన్నారు.
More Stories
పహల్గాం ఉగ్రదాడిలో హమాస్ హస్తం?
కర్రెగుట్టల్లో భారీ ఎన్కౌంటర్.. 38 మంది మావోలు మృతి
కాశ్మీర్ లోయలో ఐదుగురు ఉగ్రవాదుల ఇళ్ల పేల్చివేత