బిజెపియే సరైన ప్రత్యామ్నామని నిరూపించిన మునుగోడు

పేరాల చంద్రశేఖర్ రావు,

బీజేపీ సీనియర్ నాయకులు

బిజెపి నాయకత్వం, పార్టీ విధానాల పట్ల అత్యంత విశ్వాసంతో పార్టీలో చేరి మునుగోడు ఉపఎన్నికలో చివరి క్షణం వరకు రాజీలేని పోరాటం సాగించి కొద్ది ఓట్లతో ఓడినా, నైతిక విజయం సాధించిన కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి పోరాట పటిమను అభినందిస్తున్నాను. ఏది ఏమైనా మునుగోడు ఉప ఎన్నిక ఫలితం తెలంగాణాలో టిఆర్ఎస్ కు బీజేపీనే సరైన ప్రత్యామ్నాయo అని నిరూపించింది.

మునుగోడులో గెలిచింది ప్రజాస్వామ్యం కానే కాదు.  గెలిచింది ధనస్వామ్యం – అధికార దుర్వినియోగం, అధికార పార్టీకి తలవంచిన పోలీస్ వ్యవస్థ, మద్యం సిసాలు మాత్రమే. ఓటరుకు 5 వేల  నుండి 10 వేల రూపాయలు పంచడం, గ్రామ, మండల స్థాయి కీలక నాయకులకు లక్షలాది నోట్ల కట్టలతో ప్రలోభ పరచడం, హైదరాబాద్ లో పోలీస్ టాస్క్ పోర్స్ అక్రమ ఫోన్ టాపింగ్ లతో బిజెపి నాయకులను వేటాడడం, ప్రతి బూత్ లో అధికార పార్టీ మంత్రులు, ఎమ్యెల్యేలు ఇతర నాయకులు ఓటర్లను భయభ్రాంతులకు గురి చేయడం మాత్రమే. 

వందల కోట్ల రూపాయల నోట్ల కట్టలు చేతులు మారినా, కోట్లాది రూపాయల మద్యం ఏరులై పారినా, అధికార దుర్వినియోగం పరాకాష్టకు చేరినా, ఎన్నికల కమీషన్ నిస్సహయంగా చూసి చూడనట్లు వ్యవహరించడం ఆశ్చర్యకరం. ఇటువంటి సంధర్బాల్లో ఆదాయపన్ను శాఖ, కేంద్ర ప్రభుత్వాలు కూడా తమ పాత్ర గురించి పూనరాలోచించాల్సిన అవసరం వుంది. 

టిఆర్ఎస్ – కేసీఆర్ తమ “గోబెల్స్“ ప్రచారంలో కొంత వరకు విజయం సాధించారు. రాజ గోపాల్ రెడ్డి కొడుకు కంపనీకి కేంద్ర ప్రభుత్వం రూ. 18 వేల కోట్లు దానం చేసినట్లుగా, అయన వ్యక్తిగత  ఖాతాలో  వేసినట్లుగా దుష్ప్రచారం చేశారు. పెట్రోలు, గ్యాస్ సిలిండర్ ధరల విషయంలో కూడా ప్రజలను తప్పుదోవ పట్టించారు.

ఈ ఎన్నిక సమయంలో కేసీఆర్ ద్వారా చాలా పకడ్బoదిగా సాగిన ఎమ్యెల్యేల కొనుగోలు డ్రామా విషయంలో కేంద్ర ఇంటలిజెన్స్ వర్గాలు, కేంద్ర పార్టీ వేగంగా ప్రతిస్పందించి అయన నాటకాలకు వేగంగా అడ్డుకట్ట వేస్తే బాగుండేది. 

టిఆర్ఎస్ పార్టీ సోషల్ మీడియా విభాగం కోట్ల రూపాయల ఖర్చుతో, చాలా  ప్రోపేష్.నల్ గా బిజెపిపై “గోబెల్స్” స్థాయిలో దుష్ప్రచారాలు సాగించింది. బీజేపీ ఈ విషయంలో చాలా పాఠాలు నేర్చుకోవాల్సి ఉంది. మంత్రులు, ఎమ్యెల్యేలు నెలల తరబడి తమ ప్రాంతాలు వదిలి, తమ బాధ్యతలు ప్రక్కన పెట్టి, సచివాలయానికి వెళ్ళకుండా పరిపాలనాను గాలికి వదిలేయడం, సమస్యలు వున్న ప్రజలకు అందుబాటులో లేకపోవడం చాలా అన్యాయం, బాధాకరం. 

కేసీఆర్ మునుగోడు ఎన్నికను చాల సీరియస్ గా, పకడ్బoది యోజనతో, తమ అన్ని స్థాయిల నాయకులను మొహరించి, చాలా వేగంగా – వ్యూహాత్మక నిర్ణయాలతో తన పార్టీని విజయ పథం వైపు తీసుకెళ్ళాడు. బీజేపీలో  ఆ నేర్పరితనం, టీం స్పిరిట్ చాలా అభివృద్ది కావాల్సివుంది.  బీజేపీలో  పాత – కొత్త నాయకత్వాన్ని కలిపి పనిచేయించడంలో ఇంకా శ్రద్ధ వహించాల్సి ఉంది

సరిగ్గా ఎన్నిక సమయంలో ముఖ్యనాయకులు స్వామి గౌడ్, రాపోలు ఆనంద భాస్కర్, దాసోజు శ్రవణ్ ,బిక్షమయ్య గౌడ్ లాంటి వారు టిఆర్ఎస్ లో చేరి వాతావరణం చెడగొట్టారు. గతంలో కూడ నాగం జనార్ధన్ రెడ్డి, పెద్దిరెడ్డి, మోత్కుపల్లి నర్సింహులు కూడా ఇలాగే చేశారు. ఈ విషయంలో సరైన దిశలో ఆలోచించి నిర్ణయాలు తీసుకోవాలి. బీజేపీపై, రాజ గోపాల్ రెడ్డిపై ఆత్మీయతతో, విశ్వాసంతో ఓట్లు వేసిన మునుగోడు ఓటర్లకు హృదయపూర్వక ధన్యవాదాలు.