పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల తొలి దశలోనే అధికార పార్టీ తృణమూల్ కాంగ్రెస్ (టీఎంసీ)కి గట్టి ఎదురుదెబ్బ తగిలిందని పేర్కొంటూ, ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఆదివారం ఉత్తర 24 పరగణాల జిల్లాలో జరిగిన భారీ ర్యాలీలో ప్రసంగిస్తూ, “ఎన్నికల మొదటి దశలో టీఎంసీ అహం దెబ్బతింది. ఇప్పుడు, రెండో దశ బీజేపీకి చారిత్రాత్మక విజయాన్ని అందిస్తుంది” అని భరోసా వ్యక్తం చేశారు.
రెండు దశల ఎన్నికలలో చివరి అంకానికి రాష్ట్రం సిద్ధమవుతున్న తరుణంలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. మిగిలిన 142 స్థానాలకు ఏప్రిల్ 29న పోలింగ్ జరగనుంది. పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల రెండో, చివరి దశకు ముందు బీజేపీ తన ఎన్నికల ప్రచారాన్ని ముమ్మరం చేస్తున్న నేపథ్యంలో, మోదీ ఆదివారం ఉత్తర కోల్‌కతాలో 2 కిలోమీటర్ల మేర భారీ రోడ్‌షో నిర్వహించారు. ఈ రోడ్‌షోకు పెద్ద సంఖ్యలో ప్రజలు తరలివచ్చారు.
‘భారత్ మాతా కీ జై’, ‘జై శ్రీ రామ్’ నినాదాలు, బీజేపీ పశ్చిమ బెంగాల్ ఎన్నికల నినాదం ‘పల్తానో దర్కార్, తాయి బీజేపీ సర్కార్’ (మార్పు తీసుకురావడానికి బీజేపీ ప్రభుత్వం కావాలి) మధ్య, బీకే పాల్ అవెన్యూ నుండి ప్రారంభమైన రోడ్‌షో, సోవాబజార్ మీదుగా ఖన్నా క్రాసింగ్ వద్ద రెండు కిలోమీటర్ల దూరం సాగి ముగిసింది. ముఖ్యమంత్రి మమతా బెనర్జీ పాలనలో శాంతిభద్రతలు పూర్తిగా కుప్పకూలాయని ఆరోపిస్తూ ప్రధాని తీవ్ర విమర్శలు చేశారు.
“వారి మహా జంగల్ రాజ్‌లో, చిన్న చిన్న గూండాలు, స్థానిక నాయకులు కూడా తామే ప్రభుత్వమన్నట్టు ప్రవర్తిస్తున్నారు,” అని ఆయన ఆరోపించారు. రాష్ట్ర పరిపాలనలో జవాబుదారీతనం కొరవడిందని ధ్వజమెత్తారు. టీఎంసీ వ్యవస్థాపక నినాదమైన “మా, మాటీ, మానుస్” (తల్లి, భూమి, ప్రజలు)ను ఆయన ప్రశ్నిస్తూ, ఆ పార్టీ తన సొంత ఆదర్శాలను విడిచిపెట్టిందని ఆరోపించారు.
“వారి చర్యలు దానికి విరుద్ధంగా ఉన్నందున వారు ఇకపై ఆ నినాదాన్ని ఉపయోగించడం లేదు. వారు తల్లులను ఏడ్పించారు, మట్టిని సిండికేట్‌లకు, చొరబాటుదారులకు అప్పగించారు, బెంగాల్‌లోని మానులను పని వెతుక్కుంటూ వలస వెళ్ళేలా బలవంతం చేశారు,” అని మోదీ విమర్శించాలు గుప్పించారు. తల్లులు అఘాయిత్యాలకు గురయ్యారని, భూములు దుర్వినియోగ మయ్యాయని, ప్రజలు వలస వెళ్ళవలసి వచ్చిందని ఆయన పేర్కొన్నారు.
పౌరసత్వ (సవరణ) చట్టం (సీఏఏ) విషయంలో ఆయన శరణార్థి కుటుంబాలకు హామీ ఇచ్చారు. “ప్రతి మతువా, నమసూద్ర కుటుంబానికి నేను చెప్పేది ఏంటంటే: మీకు పౌరసత్వం, శాశ్వత చిరునామా, ఒక భారత పౌరుడికి ఉండే ప్రతి హక్కు లభిస్తాయి” అని స్పష్టం చేశారు. అదే సమయంలో పత్రాలు లేని వలసదారులకు ఆయన తుది హెచ్చరిక జారీ చేశారు.
“చొరబాటుదారులను నేను గట్టిగా హెచ్చరిస్తున్నాను. నకిలీ పత్రాలతో బెంగాల్‌లోకి అక్రమంగా ప్రవేశించిన వారు ఏప్రిల్ 29 లోగా వెళ్లిపోవాలి. మే 4న ఫలితాలు వెలువడిన తర్వాత, ప్రతి చొరబాటుదారుడిని తరిమివేస్తాం. ఇకపై టీఎంసీ మిమ్మల్ని కాపాడలేదు,” అని ప్రధాని హెచ్చరించారు. బెంగాల్ లో టిఎంసి ప్రభుత్వంపై ప్రజల ఆగ్రహం తారాస్థాయికి చేరిందని ప్రధాని చెబుతూ పశ్చిమ బెంగాల్ అంతటా అవినీతి, అధ్వాన్న పాలన, నెరవేర్చని వాగ్దానాలపై అసహనం తారాస్థాయిలో ఉందని స్పష్టం చేశారు.
“నేను సింగూర్ లో పర్యటించినప్పుడు టిఎంసిపై ఉన్న ప్రజల ఆగ్రహాన్ని గ్రహించాను. అదిప్పుడు తారాస్థాయికి చేరింది. ఏప్రిల్ 23న జరిగిన ఓటింగ్ శాతం చూసి టిఎంసి కలవరపడింది. రెండో దశ పోలింగ్‌లో ఆ రికార్డును బద్దలు కొట్టాలి” అని ప్రధాని ప్రజలను కోరారు. “టిఎంసీ ప్రభుత్వానికి విశ్వసనీయత లేదు. కేవలం బీజేపీ ప్రభుత్వమే ప్రజలకు న్యాయం, భద్రత కల్పించగలదు” అని ప్రధాని హామీ ఇచ్చారు.
వ్యవసాయ ప్రధాన కేంద్రమైన హుగ్లీ ప్రాంతానికి జీవనాధారమైన జనపనార రంగానికి బీజేపీ కట్టుబడి ఉందని ప్రధాని మోదీ నొక్కి చెప్పారు. గత 11 ఏళ్లలో కేంద్రం జనపనారకు కనీస మద్దతు ధరను రెట్టింపు చేసిందని, ప్రభుత్వ కొనుగోళ్లను మూడింతలు చేసిందని ఆయన తెలిపారు. ఆహార ధాన్యాలకు 100 శాతం జనపనార ప్యాకేజింగ్ తప్పనిసరి చేయడం, సింగిల్-యూజ్ ప్లాస్టిక్‌లపై నిషేధం విధించడం వంటివి బెంగాల్ మిల్లులకు డిమాండ్‌ను పెంచే ప్రయత్నాలని ఆయన గుర్తు చేశారు.

More Stories
ఆప్ ఎంపీల ఫిరాయింపు ఆ పార్టీ విచ్ఛిన్నంకు నాంది?
అముద్రిత పుస్తకంపై అనవసరంగా వివాదంలోకి లాగారు!
తెలంగాణలో స్వీయగణన నమోదుకు అవకాశం