గత నవంబర్‌లో ఢిల్లీలోని ఎర్రకోటపై జరిగిన బాంబు దాడికి అల్-ఖైదా అనుబంధ సంస్థ ఏక్యూఐఎస్ కారణమని భద్రతా మండలి నివేదిక స్పష్టం చేసింది. అల్-ఖైదా, ఇస్లామిక్ స్టేట్‌పై ఆంక్షల కోసం భద్రతా మండలి పర్యవేక్షణ బృందం ప్రతి ఆరు నెలలకు ఒకసారి విడుదల చేసిన నివేదిక ప్రకారం, ఈ రెండు ఉగ్రవాద సంస్థలు “అనేక సంవత్సరాలుగా రసాయన, జీవ ఆయుధాలను అభివృద్ధి చేయడంలో నిరంతర ఆసక్తిని కనబరిచాయి”.
2025 చివరి నాటికి, విదేశాల్లోని ఒక ఇస్లామిక్ స్టేట్ సెల్ ఆదేశాల మేరకు రైసిన్ అనే ఒక రకమైన విషాన్ని అభివృద్ధి చేయడానికి నియమించిన ఒక వైద్యుడితో సహా ముగ్గురిని భారత అధికారులు అరెస్టు చేశారని ఆ నివేదిక పేర్కొంది. 2025 నవంబర్ 10న ఎర్రకోట సమీపంలో జరిగిన కారు బాంబు పేలుడుకు సంబంధించి జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్ఐఏ) 10 మందిపై ఛార్జిషీట్ దాఖలు చేసిందని తెలిపింది.
ఈ ఛార్జిషీట్‌లో అల్-ఖైదా అనుబంధ సంస్థ అయిన అన్సార్ ఘజ్వత్-ఉల్-హింద్ ( ఏక్యూఐఎస్)తో సంబంధం ఉన్న 10 మంది నిందితుల పేర్లను పేర్కొన్నారు. వాహనంలో అమర్చిన పేలుడు పదార్థంతో జరిగిన ఈ పేలుడులో 11 మంది మరణించగా, పలువురు గాయపడ్డారు. ఆస్తికి గణనీయమైన నష్టం వాటిల్లింది. ఫరీదాబాద్‌లోని అల్-ఫలాహ్ విశ్వవిద్యాలయంలో వైద్యశాస్త్ర మాజీ సహాయ ఆచార్యుడు, ఆ పేలుడులో మరణించిన ఉమర్ ఉన్-నబీని ప్రధాన సూత్రధారిగా ఎన్ఐఏ దర్యాప్తు గుర్తించింది.
ఐక్యరాజ్యసమితి ఆంక్షల పర్యవేక్షణ బృందం నివేదిక ఇలా పేర్కొంది, “2025 నవంబర్‌లో ఢిల్లీలోని ఎర్రకోటపై జరిగిన దాడిని అధికారికంగా ఏక్యూఐఎస్‌కు ఆపాదించారు. బంగ్లాదేశ్‌లో తమ సెల్స్‌ను ఏర్పాటు చేయడానికి ఏక్యూఐఎస్ ఆసరాగా చేసుకుంటుందనే ఆందోళన వ్యక్తమైంది.” ఏక్యూఐఎస్ “ఒక విచ్ఛిన్నమైన సమూహం నుండి ప్రాంతీయ ఉగ్రవాద సంస్థగా పరిణామం చెందుతూనే ఉంది. అది పెద్ద యూనిట్లకు బదులుగా వికేంద్రీకృత చిన్న, చెల్లాచెదురుగా ఉన్న సెల్స్‌లో పనిచేస్తూ లాజిస్టిక్స్ మరియు ఆర్థిక నెట్‌వర్క్‌లను స్థాపించింది” అని ఆ నివేదిక పేర్కొంది.
“ఏక్యూఐఎస్ నాయకత్వానికి తజ్కిరాలు (జాతీయ గుర్తింపు కార్డులు) జారీ చేయడంతో వారు కాబూల్‌లోనే ఉండిపోయారని, ఇది తాలిబన్ మరియు ఏక్యూఐఎస్ మధ్య సన్నిహిత సహకారాన్ని సూచిస్తోందని” ఆ నివేదిక తెలిపింది. నివేదిక ప్రకారం, ఇత్తిహాద్-ఉల్-ముజాహిదీన్ పాకిస్తాన్ (ఐఎంపి)కు అల్-ఖైదా వెన్నెముకగా ఉంది.
మే 9న ఖైబర్-పఖ్తూన్‌ఖ్వా ప్రావిన్స్‌లోని ఒక భద్రతా పోస్టు సమీపంలో జరిగిన ఆత్మాహుతి దాడి, వాహనంలో అమర్చిన పేలుడు పదార్థాన్ని పేల్చడం వంటి పలు దాడులకు ఈ సంస్థే బాధ్యత వహించినట్లు సమాచారం.
ఈ దాడుల్లో 21 మంది మరణించారు. అల్-ఖైదా, ఇస్లామిక్ స్టేట్ రెండూ రసాయన, జీవాయుధాలను అభివృద్ధి చేసేందుకు తమ ప్రయత్నాలను కొనసాగిస్తున్నాయని, అయితే ఇప్పటివరకు వాటికి సంబంధించిన “సాంకేతిక సవాళ్లను” అధిగమించడంలో విఫలమయ్యాయని నివేదిక పేర్కొంది. ఇలాంటి ఆయుధాలను అభివృద్ధి చేయడానికి సంబంధించిన సూచనలు ఆన్‌లైన్ ఉగ్రవాద వర్గాలలో విస్తృతంగా పంచుకున్నారు.
ఈ ఏడాది ఫిబ్రవరిలో, ఇస్లామిక్ స్టేట్ ఆంగ్ల పత్రిక “ఇన్వేడ్”, బోటులినమ్ టాక్సిన్, సైనైడ్‌లను అభివృద్ధి చేయడానికి సంబంధించిన సూచనలను ప్రచురించింది. దక్షిణ, మధ్య ఆసియాపై దృష్టి సారించిన ఇస్లామిక్ స్టేట్-ఖొరాసన్ ప్రావిన్స్ లేదా ఆ సంస్థ యొక్క అనుబంధ సంస్థ అయిన “ఐఎస్ఐఎల్-కె, రిసిన్ అనే విషాన్ని అభివృద్ధి చేయడంపై ప్రత్యేక ఆసక్తిని కనబరిచి, గత 12 నెలలుగా సూచనలను ప్రచారం చేసింది” అని ఆ నివేదిక పేర్కొంది.
ఆఫ్ఘనిస్తాన్‌లో అల్-ఖైదా హోదా మరియు బలం “యథాతథంగా ఉన్నాయి” అని ఆ నివేదిక పేర్కొంది. ఏప్రిల్ 28న, అల్-ఖైదా అధికారిక మీడియా సంస్థ అయిన అస్-సహాబ్ మీడియా ఫౌండేషన్, తాలిబాన్‌కు మద్దతు ఇస్తూ, మొదటిసారిగా, పాకిస్థాన్‌కు వ్యతిరేకంగా తెహ్రిక్-ఎ-తాలిబాన్ పాకిస్థాన్ (టిటిపి) జరుపుతున్న కార్యకలాపాలకు మద్దతుగా ఒక ప్రకటనను ప్రచురించింది.
“పాకిస్థాన్‌కు వ్యతిరేకంగా టిడిపి జరుపుతున్న తిరుగుబాటులో అల్-ఖైదా సైద్ధాంతిక మార్గదర్శకత్వం, శిక్షణ, మద్దతు అందించినప్పటికీ, ఈ బహిరంగ ప్రకటన మరింత ప్రత్యక్షంగా ఉంది” అని ఆ నివేదిక పేర్కొంది. ఈ నివేదిక “ఉగ్రవాద గ్రూపులచే క్రిప్టోకరెన్సీ వినియోగం పెరగడాన్ని” ప్రముఖంగా ప్రస్తావించింది. ఈ దృగ్విషయాన్ని ఎదుర్కోవడానికి, “సంబంధిత నిపుణుల ప్యానెళ్లతో సంప్రదించి, ఆంక్షల జాబితాలో ‘డిజిటల్ కరెన్సీ చిరునామా’ కోసం ఒక ప్రత్యేక విభాగాన్ని ఏర్పాటు చేసే అంశాన్ని ఐక్యరాజ్యసమితి పరిశీలించాలని” సిఫార్సు చేసింది.
నిధులు సమీకరించడానికి క్రిప్టోకరెన్సీని ఉపయోగించిన గ్రూపులలో ఐఎస్ఐఎల్-కె కూడా ఒకటి. ఉగ్రవాదానికి నిధులు సమకూర్చే కేసులలో “మూడవ పక్షాల దుర్వినియోగం” వల్ల కలిగే ముప్పును కూడా ఈ నివేదిక ప్రముఖంగా ప్రస్తావించింది. ఉగ్రవాద సంబంధిత దర్యాప్తులలో అంతిమ లబ్ధిదారుని గుర్తించడానికి ఫైనాన్షియల్ యాక్షన్ టాస్క్ ఫోర్స్ (ఎఫ్ఏటీఎఫ్) సిఫార్సులను అమలు చేయాలని ప్రోత్సహించింది.

More Stories
ప్రెస్‌క్లబ్‌లో నిరుద్యోగుల నిరసన సెగతో కోదండరాం పరార్!
ప్రజా సేవ పట్ల నిరంతర నిబద్ధతను ప్రదర్శించిన కోవిద్
రాజ్యసభలో కలకలం రేపిన ‘లుంగీవాలా వ్యాఖ్యలు’