శ్రీవారికి రూ.15,938 కోట్ల నగదు, బంగారం డిపాజిట్లు

తిరుమల శ్రీవెంకటేశ్వర స్వామి వారికి చెందిన రూ 15,938 కోట్ల నగదు, బంగారములను 24 బ్యాంకులలో డిపాజిట్ చేసిన్నట్లు టిటిడి ప్రకటించింది. వారి ఆలయ మొత్తం బంగారం 10,258 కేజీలు ఉందని తెలిపారు. 2019 జూన్ నాటికి రూ. 13,025 కోట్లు ఉండగా, ప్రస్తుతం రూ. 15,938 కోట్లుకు చేరినట్టుగా టీటీడీ పేర్కొంది. 
 
2019 జూన్ నాటికి 7,339.74 కేజీల బంగారం నిల్వలు ఉండగా, ఇప్పుడు 10,258. 37కి చేరిందని టీటీడీ ప్రకటించింది. ఎన్నో కష్టనష్టాలకోర్చి ఏడుకొండలు ఎక్కి, తిరుమలలో శ్రీవారి దర్శనంతో అలౌకికమైన ఆనందానుభూతిని మూటకట్టుకునే భక్తులు ఆ స్వామికి కానుకల సమర్పణలో కూడా అమితమైన ఆత్మతృప్తిని పొందుతారు.
 
అదేం మహిమోగానీ వడ్డీకాసులవాడి ‘హుండీ’ అనునిత్యం కానుకలతో కళకళలాడుతూ ఉంటుంది. శ్రీమంతుల నుంచి సామాన్యుడిదాకా ఆ కోనేటి రాయుడికి రకరకాల కానుకలు సమర్పిస్తుంటారు. తిరుమల వెంకన్నకు నాటి ఆకాశరాజు నుంచి నేటి భక్తుల దాకా తమ స్థాయిని బట్టి నగదు, ఆభరణాలు సమర్పించుకుంటున్నారు. 
 
పెరుగుతున్న రద్దీకి అనుగుణంగా శ్రీవారి ఖజానాకు హుండీ ద్వారా నగదు, బంగారం, వెండి కానుకలు కుప్పలుతెప్పలుగా వస్తున్నాయి. శ్రీ వేంకటేశ్వరస్వామి దర్శనానికి వచ్చిన భక్తులు కానుకలు సమర్పించే వస్త్రంతో కూడిన గంగాళాన్ని ‘హుండీ’ అంటారు. పూర్వకాలంలో ఆలయ కైంకర్యాలు, నిర్వహణ కోసం హుండీ ఏర్పాటు చేశారు.
17వ శతాబ్దానికి ముందు నుంచే శ్రీవారి ఆలయంలో హుండీ ఉన్నట్టు దేవస్థానం రికార్డుల ద్వారా తెలుస్తోంది. ఆర్థికంగా బలపడేందుకు ఎన్నో మార్గాలు ఏర్పడినప్పటికీ టీటీడీ మాత్రం హుండీ సంప్రదాయాన్ని కొనసాగిస్తోంది. హుండీలో భక్తులు తమ స్తోమతకు తగిన విధంగా నగదు, బంగారు, వెండి, బియ్యం, వస్ర్తాలు, విలువైన పత్రాలు వంటి వాటిని కానుకలుగా వేస్తారు.
 
సీనియర్‌ సిటిజన్లకు సులభంగా దర్శనం 

ఇలా ఉండగా, తిరుమలలోని శ్రీ వేంకటేశ్వరుడుని ఉచితంగా దర్శించుకునేందుకుతిరుమల, తిరుపతి దేవస్థానం సీనియర్‌ సిటిజన్లకు రెండు స్లాట్లు ఏర్పాటు చేసింది. ఉదయం 10 గంటలకు, మధ్యాహ్నం 3 గంటలకు వీరికి దర్శనభాగ్యం కల్పించనున్నది.

అయితే సీనియర్‌ సిటిజన్లు ఫొటో ఐడీతో వయస్సు రుజువును తెలియజేస్తు తిరుమలలో ఎస్‌ 1 కౌంటర్‌లో దరఖాస్తు సమర్పించాలని వెల్లడించింది. ఏ మెట్లు ఎక్కాల్సిన అవసరం లేకుండా మంచి సీటింగ్ తో కంపార్టుమెంట్‌ ను, ఆహారం అవసరమైన సీనియర్‌ సిటిజన్స్‌కు లోపల వేడి సాంబార్ అన్నం, పెరుగు అన్నం , వేడి పాలు ఉచితంగా అందిస్తామని టీటీడీ వెల్లడించింది.

రూ.20 చెల్లించి రెండు లడ్డూలను పొందవచ్చని, ఎక్కువ లడ్డూల కోసం ఒక్కో లడ్డుకు రూ. 25 చెల్లిస్తే సరిపోతుందని స్పష్టం చేసింది. ఎగ్జిట్ గేట్ వద్ద ఉన్న కార్ పార్కింగ్ ప్రాంతం నుంచి కౌంటర్ వద్ద డ్రాప్ చేయడానికి బ్యాటరీ కారును కూడా అందుబాటులో ఉంచామని తెలియజేసింది.

సీనియర్‌ సిజిజన్‌లు దర్శనం సమయంలో అన్ని ఇతర క్యూలను నిలిపివేయనున్నట్లు ప్రకటించింది. స్లాట్‌ విధానం వల్ల భక్తులు 30 నిమిషాల్లోపు దర్శనం నుంచి బయటకు రావచ్చని స్పష్టం చేసింది. మరిన్ని వివరాలకు హెల్ప్‌డెస్క్ తిరుమల 08772277777 అనే ఫొన్‌ నంబర్‌ను సంప్రదించాలని సూచించింది.