కొద్ది నెలలుగా అదేపనిగా పడిపోతున్న విదేశీ మారక నిల్వలు ఎట్టకేలకు అక్టోబర్ 28తో ముగిసిన వారంలో పెరిగాయి. ఏడాది కాలంలో ఎన్నడూ లేనంతంగా ఈ వారంలో 6.56 బిలియన్ డాలర్ల మేర పెరిగి 531.08 బిలియన్ డాలర్లకు చేరాయి. అంతక్రితం వారం ఇవి 3.85 డాలర్ల క్షీణతతో 524.52 బిలియన్ డాలర్లకు తగ్గాయి.
గత ఏడాది కాలంలో ఒక వారంలో ఇంతలా ఫారెక్స్ నిల్వలు పెరగడం ఇదే మొదటిసారి. ఆర్‌బీఐ డేటా ప్రకారం, గోల్డ్, ఫారెన్ కరెన్సీ వంటి అన్ని విభాగాల్లోనూ పెరుగుదల కనిపించింది. అక్టోబర్ 21 తో ముగిసిన వారంలో దేశ ఫారెక్స్ రిజర్వ్‌లు 524.52 బిలియన్ డాలర్లుగా రికార్డయ్యాయి.
డాలర్ మారకంలో రూపాయి పతనాన్ని కంట్రోల్ చేసేందుకు ఈ ఏడాది ఆర్‌బీఐ సుమారు 110 బిలియన్ డాలర్ల కంటే ఎక్కువ రిజర్వ్‌లనే అమ్మింది. ఫలితంగా ఈ ఏడాది దేశ ఫారెక్స్ నిల్వలు 16 శాతం తగ్గాయి. మరోవైపు యూఎస్ డాలర్ వాల్యూ విపరీతంగా పెరగడంతో కూడా దేశ ఫారెక్స్ నిల్వలు తగ్గాయి.
కిందటి నెల 28 తో ముగిసిన వారంలో దేశ ఫారెన్ కరెన్సీ ఆస్తులు (ఎఫ్‌సీఏ) 5.772 బిలియన్ డాలర్లు పెరిగి 470.847 బిలియన్ డాలర్లకు చేరుకున్నాయి. అదే 21 తో ముగిసిన వారంలో వీటి విలువ 465.075 బిలియన్ డాలర్లుగా ఉంది.
మరోవైపు దేశ బంగారం నిల్వలు కూడా పుంజుకున్నాయి. బంగారం రిజర్వ్‌లు తాజా వారంలో 556 మిలియన్ డాలర్లు పెరిగి 37.762 బిలియన్ డాలర్లకు ఎగిశాయి. స్పెషల్ డ్రాయింగ్ రైట్స్ (ఎస్‌డీఆర్ ) విలువ అక్టోబర్ 28 తో ముగిసిన వారంలో 185 మిలియన్ డాలర్లు ఎగిసి 17.625 బిలియన్ డాలర్లకు చేరుకున్నాయి.
ఇంటర్నేషనల్ మానిటరీ ఫండ్ (ఐఎంఎఫ్) దగ్గర ఉన్న దేశ రిజర్వ్ పొజిషన్ 48 మిలియన్ డాలర్లు పెరిగి 4.87 బిలియన్ డాలర్లకు పెరిగింది. కాగా, కిందటేడాది అక్టోబర్‌లో దేశ ఫారెక్స్ నిల్వలు 645 బిలియన్ డాలర్ల దగ్గర గతంలో ఎన్నడూ లేనంత గరిష్ట స్థాయికి చేరుకున్నాయి. అప్పటి నుండి నిల్వలు తగ్గుతూ వస్తున్నాయి.
అంతర్జాతీయంగా చమురు, ఇతర కమోడిటీ ధరలు భగ్గుమనడంతో ఎక్కువ విదేశీ కరెన్సీని ఖర్చుచేయడం, రూపాయి పతనాన్ని నిరోధించడానికి ఆర్బీఐ డాలర్లు విక్రయించడంతో నిల్వలు తగ్గాయి. ఫారెక్స్ నిల్వలు పెరగడంతో డాలర్ మారకంలో రూపాయి విలువ శుక్రవారం 53 పైసలు పెరిగి 82.35 వద్ద ముగిసింది. చైనీస్ యువాన్, యూరో, పౌండ్ కరెన్సీలు శుక్రవారం డాలర్ మారకంలో పెరగడంతో దేశ రూపాయికి సపోర్ట్ లభించింది.
అమెరికా ఫెడ్ వడ్డీ రేట్ల పెంపు, ఇతర గ్లోబల్ అంశాల కారణంగా డాలర్ విలువ విపరీతంగా పెరుగుతోంది. మరోవైపు యూరో మారకంలో రూపాయి విలువ ఈ ఏడాది ప్రారంభంలో 88 గా ఉండగా, ప్రస్తుతం 80 కి మెరుగుపడింది. అదే బ్రిటన్ పౌండ్ మారకంలో 102 గా ఉన్న రూపాయి విలువ ప్రస్తుతం 92.60 కి బలపడింది.
జపనీస్ యెన్ మారకంలో 66 పైసాల నుంచి 55 పైసాలకు మెరుగుపడింది. ‘ఈ నెలలో డాలర్–రూ పాయి ఒక రేంజ్‌లోనే కదులుతుందని అంచనావేస్తున్నాం. చాలా వరకు నెగెటివ్ వార్తలు, ఫెడ్ హాకిష్ (కఠినమైన మానిటరీ పాలసీ) వైఖరికి ఇప్పటికే రూపాయి కదిలింది’ .
డాలర్ మారకంలో రూపాయి విలువ ఆర్‌బీఐ పెట్టుకున్న కంఫర్ట్ జోన్‌ను దాటితే అదనంగా డాలర్లను రిజర్వ్ బ్యాంక్ అమ్మే అవకాశం ఉంది’ అని రిలయన్స్ సెక్యూరిటీస్ ఎనలిస్ట్ శ్రీరామ్ అయ్యర్ తెలిపారు. అంతేకాకుండా కొనడం/అమ్మడాన్ని కొనసాగిస్తూ దేశ కరెన్సీని స్థిరంగా ఆర్‌బీఐ ప్రయత్నిస్తుందని పేర్కొన్నారు. ఈ నెలలో డాలర్ మారకంలో రూపాయి 81.25–83.25 బ్యాండ్‌లోనే కదలాడొచ్చని ఆయన అంచనావేశారు.
More Stories
అక్రమ వలసదారులను తిప్పి పంపుతా
90 మంది పాలస్తీనా ఖైదీలను విడుదల చేసిన ఇజ్రాయెల్
భారత్ బలం అద్భుతమైన ఐక్యతలోనే ఉంది