భారత తొలి ఓటరు శ్యామ్‌ శరణ్‌ నేగి కన్నుమూత

స్వతంత్ర భారతదేశంలో  మొదటిసారిగా ఓటు హక్కు వినియోగించుకున్నవారిలో ఒకరైన శ్యామ్‌ శరణ్‌ నేగి కన్నుమూశారు. గత కొంతకాలంగా వయోధిక ఆరోగ్య సమస్యలతో బాధపడుతున్న 106 ఏండ్ల శ్యామ్‌ శరణ్‌ హిమాచల్‌ప్రదేశ్‌లోని తన స్వస్థలమైన కల్పాలో శనివారం ఉదయం తుదిశ్వాస విడిచారు.

ఆయన మృతిపట్ల రాష్ట్ర ముఖ్యమంత్రి జైరామ్‌ ఠాకూర్‌ సంతాపం తెలిపారు. నేగి అంత్యక్రియలను ప్రభుత్వ అధికార లాంఛనాలతో నిర్వహిస్తామని ప్రకటించారు. త్వరలో జరుగనున్న హిమాచల్‌ప్రదేశ్‌ అసెంబ్లీ ఎన్నికల్లో భాగంగా ఈ నెల 2న పోస్టల్ బ్యాలెట్‌ ద్వారా ఆయన తన ఓటుహక్కు వినియోగించుకున్నారు. నేగీ ఎన్నికల్లో ఓటువేయడం ఇది 34వ సారి.

శ్యామ్‌ శరణ్‌ నేగీ  1917, జూలై 1న జన్మించారు. భారతదేశానికి స్వాతంత్య్రం సిద్ధించిన తర్వాత ఓటు హక్కు వినియోగించుకున్నవారిలో ఒకరిగా గుర్తింపు పొందారు. 1951 నుంచి జరిగిన ప్రతి ఎన్నికల్లో ఆయన ఓటు వేశారు. ఇప్పటివరకు 16 సార్లు లోక్‌సభ ఎన్నికల్లో తన ఓటుహక్కు వినియోగించుకున్నారు. 

శ్యామ్ నేగి కల్పాలో పాఠశాల ఉపాధ్యాయుడిగా పనిచేశారు. ఆయన హిందీ చిత్రం సనమ్ రేలో కూడా ప్రత్యేక పాత్రలో కనిపించారు. 2014లో హిమాచల్ ప్రదేశ్ రాష్ట్ర ఎన్నికల సంఘం యువ ఓటర్లలో ఎన్నికల వ్యవస్థలో పాల్గొనేలా అవగాహన కల్పించేందుకు ఆయనను బ్రాండ్ అంబాసిడర్‌గా నియమించింది.

అంత్య‌క్రియ‌ల్లో పాల్గొన‌నున్న సీఈసీ

నేగి అంత్య‌క్రియ‌ల్లో కేంద్ర ఎన్నిక‌ల సంఘం ప్ర‌ధానాధికారి రాజీవ్ కుమార్ పాల్గొన‌నున్నారు. ఈ క్ర‌మంలో హిమాచ‌ల్ ప్ర‌దేశ్‌లోని నేగి స్వ‌గ్రామ‌మైన క‌ల్పాకు సీఈసీ వెళ్ల‌నున్నారు. ఆయ‌న కుటుంబ స‌భ్యులను ప‌రామ‌ర్శించి, అంత్య‌క్రియ‌ల్లో పాల్గొన‌నున్నారు.

శ్యామ్ శరణ్ నేగి మృతిపై ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. శ్యామ్ కుటుంబీలకు ప్రగాఢ సంతాపం తెలిపారు. శ్యామ్ శరణ్ నేగి తుది శ్వాస విడిచే వరకూ బాధ్యతాయుత పౌరుడిగా తన కర్తవ్యాన్ని నెరవేర్చారని కొనియాడారు. హిమాచల్ ప్రదేశ్ ఎన్నికల్లో నవంబర్ 2న పోస్టల్ బ్యాలెట్ ద్వారా శ్యామ్ ఓటు వేసిన విషయాన్ని ప్రధాని గుర్తు చేశారు.

దీనిపై దేశంలోని ప్రతి పౌరుడు ఆలోచించుకోవాలని, శ్యామ్ శరణ్ ను ఆదర్శంగా తీసుకోవాలని ప్రధాని  సూచించారు.  శ్యామ్ నేగి అంత్యక్రియలకు జిల్లా యంత్రాంగం ఏర్పాట్లు చేస్తోందని, ఆయనకు గౌరవప్రదంగా వీడ్కోలు పలికేందుకు బ్యాండ్‌ను ఏర్పాటు చేస్తున్నట్లు జిల్లా కలెక్టర్ కిన్నౌర్ అబిద్ హుస్సేన్ తెలిపారు. 

నేగి మృతి పట్ల భారత ఎన్నికల కమీషన్ సంతాపం తెలుపుతూ ఆయన భారత దేశపు మొదటి ఓటరు మాత్రమే కాకుండా, మన ప్రజాస్వామ్య వ్యవస్థ పట్ల విశేషమైన విశ్వాసం గల వ్యక్తిగా పేర్కొన్నది. జాతికి ఆయన చేసిన సేవల పట్ల తాము ఎల్లప్పుడూ కుతజ్ఞులై ఉంటామని తెలిపింది. 

మరణించడానికి ముందు కూడా పోస్టల్ బ్యాలట్ ద్వారా హిమాచల్ ప్రదేశ్ ఎన్నికలలో ఓటు వేయడం ద్వారా ఎన్నికల పక్రియ పట్ల తన అచంచలమైన విశ్వాసాన్ని ప్రకటించుకున్నారని కమీషన్ గుర్తు చేసింది. కొద్దిరోజుల క్రితం పోస్టల్ బ్యాలట్ ద్వారా ఓట్ వేసిన అనంతరం కిన్నాపూర్ డిప్యూటీ కమీషనర్ ఆయనను ఇంటికి వెళ్లి సత్కరించారు.