హైకోర్టు ఆంక్షలతో తమిళనాడులో ఆర్ఎస్ఎస్ ర్యాలీల వాయిదా!

తమిళనాడులో ఆదివారం నిర్వహించతలపెట్టిన అన్ని కార్యక్రమాలను రాష్ట్రీయ స్వయంసేవక్‌ సంఘ్‌ (ఆర్ఎస్ఎస్) వాయిదా వేయాలని నిర్ణయించుకున్నది. ఆయా కార్యక్రమాలపై మద్రాస్‌ హైకోర్టు సింగిల్‌ జడ్జి బెంచ్‌ ఆంక్షలు విధించిన నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నది. మరో వైపు సింగిల్‌ జడ్జి బెంచ్‌ నిర్ణయాన్ని సవాల్‌ చేసేందుకు సిద్ధమైంది.

మద్రాస్ హైకోర్టు తమకు ఆమోదయోగ్యం కాని కొన్ని ఆంక్షలు విధించినందున నవంబర్ 6న రాష్ట్రంలో రూట్ మార్చ్ లను నిర్వహించబోమని ఆర్‌ఎస్‌ఎస్ వెల్లడించింది. మొత్తం 60 లేదా44 ప్రదేశాల్లో ఆర్‌ఎస్‌ఎస్ ర్యాలీలు నిర్వహించేందుకు మద్రాస్ హైకోర్టు అనుమతినిచ్చిందని, మూసి ఉన్న స్టేడియం లేదా మైదానంలో మాత్రమే ర్యాలీలు నిర్వహించాలను కోర్టు పేర్కొందని  ఆర్ఎస్ఎస్ నేత  ఆర్ వన్నిరాజన్   తెలిపారు. మూసి ఉన్న స్టేడియాలు, ఇండోర్​ స్టేడియాల్లో ర్యాలీ మార్చ్​ చేపట్టాలనడంపై అభ్యంతరం వ్యక్తం చేశారు.

మద్రాస్‌ హైకోర్టు తమిళనాడులోని 44చోట్ల సంఘ్‌ కార్యక్రమాలకు షరతులతో కూడిన అనుమతులు మంజూరు చేసింది. 50 చోట్ల ర్యాలీల నిర్వహణకు ఆర్‌ఎస్‌ఎస్‌ అనుమతి కోరింది.  ఈ నెల 6న 44చోట్ల కవాతు, బహిరంగ సభలు నిర్వహించుకునేందుకు సంఘ్‌కు అనుమతి ఇవ్వాలని మద్రాస్‌ హైకోర్టు శుక్రవారం తమిళనాడు పోలీసులను ఆదేశించింది.

కోయంబత్తూరు, మెట్టుపాళయం, పొల్లాచ్చి, తిరుప్పూర్‌ జిల్లాలోని పల్లడం, కన్యాకుమారి జిల్లాలోని అరుమనై, నాగర్‌కోయిల్‌లో ర్యాలీకి హైకోర్టు అనుమతి ఇవ్వలేదు.  ఆయా ప్రదేశాల్లో పరిస్థితి సరిగా లేనందున అనుమతి నిరాకరించింది. మరో వైపు షరతులను పాటించకపోతే అవసరమైన చర్యలు తీసుకునేందుకు పోలీసు అధికారులకు స్వేచ్ఛ ఉందని కోర్టు తెలిపింది.

ర్యాలీలు, కార్యక్రమాలు కాపాండ్ గోడలున్న  ప్రదేశాలలో అంటే క్రీడా మైదానాలు, స్టేడియంలలో మాత్రమే జరగాలని స్పష్టం చేసింది. ట్రాఫిక్ కు, ఇతరులకు ఆటంకం కలిగించకుండా సొంత వాహనాలపై వాటిల్లో పాల్గొనేవారు రావాలని పేర్కొన్నది.  ఎవ్వరు కూడా ఇతర వ్యక్తులు, మతాలు లేదా కులాలకు వ్యతిరేకంగా పాటలు పాడటం గాని, మాట్లాడటం గాని చేయరాదని తెలిపింది.

సంఘ్‌ ర్యాలీల్లో కేంద్ర ప్రభుత్వం నిషేధం విధించిన సంస్థలకు అనుకూలంగా, అలాగే దేశ స్వయం ప్రతిపత్తి, సమగ్రతను ప్రభావితం చేసే అంశాలపై మాట్లాడొద్దన చెప్పింది.  అలాగే ర్యాలీలో పాల్గొనే కార్యకర్తలు కర్రలు, ఇతర హానికారక ఆయుధాలపై సైతం ఆంక్షలు విధించింది. ర్యాలీ సందర్భంగా ప్రభుత్వ, ప్రైవేటు ఆస్తులకు ఏదైనా నష్టం జరిగితే సంఘ్‌ ద్వారానే పరిహారం చెల్లించేలా చర్యలు తీసుకోవచ్చు అంటూ మద్రాస్‌ హైకోర్టు బెంచ్‌ పేర్కొంది.

తాము 50 చోట్ల ర్యాలీల కోసం అనుమతి కోరితే పోలీసులు కేవలం 4 చోట్ల మాత్రమే ఇచ్చారని అంటూ నవంబర్ 2 న హైకోర్టును ఆశ్రయించారు. 24 ప్రదేశాలలో పూర్తిగా అనుమతి నిరాకరించగా, మరో 23 చోట్ల ఇన్ డోర్ ప్రదేశాలలో మాత్రమే జరుపుకోవాలని పోలీసులు స్పష్టం చేశారు.  తమ నిర్ణయానికి మద్దతుగా 2008 నుండి 2022 వరకు ఆయా ప్రదేశాలలో నమోదైన ఎఫ్ఐఆర్ లను పోలీసులు ప్రస్తావించారు.  అయితే అవ్వన్ని పాత ఎఫ్ఐఆర్ లని అంటూ హైకోర్టు తిరస్కరించింది. వారిలో పేర్కొన్న కారణాలు ఆమోదయోగ్యం కావని స్పష్టం చేసింది.

98 ఏళ్లుగా బహిరంగ ప్రదేశాల్లో రూట్ మార్చ్ లు నిర్వహిస్తున్నామని, బహిరంగ ప్రదేశాలకు వెళ్లినప్పుడు మాత్రమే ప్రభుత్వం నుంచి అనుమతి తీసుకోవాల్సి ఉంటుందని, జమ్మూ కాశ్మీర్, పశ్చిమ బెంగాల్, కేరళ వంటి రాష్ట్రాల్లో కూడా రూట్ మార్చ్ లకు అనుమతి ఉందని  ఆర్​ఎస్​ఎస్​ తరపు న్యాయవాది రాబు మనోహర్​ చెప్పారు​.