ప్రగతి భవన్ లోనే ఫాంహౌస్ ఎమ్మెల్యేలు.. భద్రత పెంపు 

మొయినాబాద్ ఫాంహౌస్ ఘటన తర్వాత నుంచి నలుగురు టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ప్రగతిభవన్ కే పరిమితమయ్యారు. గత 11 రోజులుగా తమ తమ నియోజకవర్గాలకు కూడా వెళ్లడం లేదు. సొంత పార్టీ నేతలకు సహితం అందుబాటులో ఉండడం లేదు.  తాజాగా, తాండూరు ఎమ్మెల్యే రోహిత్ రెడ్డి, అచ్చంపేట ఎమ్మెల్యే గువ్వల బాలరాజు, కొల్లాపూర్ ఎమ్మెల్యే బీరం హర్షవర్ధన్ రెడ్డి, పినపాక ఎమ్మెల్యే రేగా కాంతారావుకు మంత్రులతో సమానంగా రాష్ట్ర ప్రభుత్వం ప్రస్తుతం సెక్యూరిటీని పెంచింది.

వారికి బుల్లెట్‌ ప్రూఫ్‌ కార్లు ఇవ్వడంతో పాటు ఇప్పటివరకు 2+2 ఉన్న గన్‌మెన్‌ను 4+4 చేసింది.వీరికి ఎస్కార్ట్‌ సదుపాయం ఇవ్వనుంది.  ఇక నలుగురు ఎమ్మెల్యేల నివాసం, కార్యాలయాల వద్ద కూడా భద్రత పెంచారు

మొయినాబాద్ ఫాం హౌస్ ఘటన తర్వాత ప్రగతిభవన్ కు వెళ్లిన నలుగురు ఎమ్మెల్యేలు అప్పటి నుంచి అక్కడే ఉంటున్నారు. ఉప ఎన్నిక సందర్భంగా ప్రచారం కోసం ముఖ్యమంత్రి కేసీఆర్  గత నెల 30వ తేదీన మునుగోడుకు వెళ్లారు. ఆ సమయంలో తన వెంటహెలికాఫ్టర్ లో నలుగురు ఎమ్మెల్యేలను వెంట తీసుకెళ్లారు.

 ఆ సభ తర్వాత మళ్లీ నలుగురు ఎమ్మెల్యేలు సీఎం కేసీఆర్ తో ప్రగతిభవన్ కే వెళ్లారు. తమ నియోజకవర్గాలకు వెళ్లలేదు. ఈనెల 3వ తేదీన ప్రగతి భవన్ లో  నిర్వహించిన ప్రెస్ మీట్ లో నలుగురు ఎమ్మెల్యేలు ముఖ్యమంత్రి కేసీఆర్ పక్కనే కనిపించారు.

కాగా,  మంత్రులు, ఎమ్మెల్యేలతో పాటు సన్నిహితులకు కూడా నలుగురు టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు టచ్ లోకి రావడం లేదని తెలుస్తోంది. కేవలం ప్రగతి భవన్ లో ముఖ్యమంత్రి కేసీఆర్, మంత్రులు కేటీఆర్, హరీష్ రావుతోనే టచ్ లోకి వస్తున్నారని సమాచారం. 

ఎమ్మెల్యేల‌ కొనుగోళ్ళల్లో రారాజుగా కేసీఆర్ 

ఎమ్మెల్యేల కొనుగోళ్లలో కేసీఆర్ రారాజుగా మిగిలారని బీజేపీ జాతీయ కార్యవర్గ సభ్యుడు, ఎమ్మెల్యే ఈటెల రాజేందర్ విమర్శించారు.  2014 నుంచి టీఆర్ఎస్ సర్కార్ పరిపాలనపై కేసీఆర్  తనతో చర్చకు రావాలని సవాల్ విసిరారు. ఏబీఎన్‌ ఛానల్‌ను నిషేధించి మీడియాపై విషం చిమ్మిన మాట వాస్తవం కాదా? అని ప్రశ్నించారు. ప్రజాస్వామ్యంపై సీఎం కేసీఆర్‌వి మొసలి కన్నీళ్ళని ధ్వజమెత్తారు.

నలుగురు ఎమ్మెల్యేలు పరమ పవిత్రులు ఎలా అవుతారో కేసీఆర్ ప్రజలకు చెప్పాలని డిమాండ్ చేశారు. హుజూరాబాద్‌లో జరిగిందే  మునుగోడులో జరిగబోతోందని స్పష్టం చేశారు. ఉప ఎన్నిక నిర్వహణలో ఎన్నికల‌ కమిషన్ విఫలమైందని ఈటెల విమర్శించారు. ఓటమి భయంతోనే మునుగోడులో టీఆర్ఎస్ హింసను ప్రేరేపించిందని ఆయన ఆరోపించారు.

మంత్రులు, ఎమ్మెల్యేలు స్వయంగా మునుగోడులో ఓటుకు నోట్లు పంచారని తెలిపారు. దళిత ముఖ్యమంత్రిని చేస్తానన్న కేసీఆర్.. మంత్రి కొప్పుల ఈశ్వర్‌ ను అవమానించారని పేర్కొన్నారు. టీఆర్ఎస్‌కు ఓటు వేయకుంటే పధకాలు రావని మంత్రి హెచ్చరించటం దారుణమని మండిపడ్డారు. ఓడిపోయిన ఎమ్మెల్యేలతో నియోజకవర్గాల్లో అధికారిక కార్యక్రమాలు నిర్వహిస్తున్నారని చెప్పారు.

కేసీఆర్ హాయాంలో ప్రజాస్వామ్య ఖూనీ అయిందని తెలిపారు. తెలంగాణ సంస్కృతి, ఆత్మగౌరవాన్ని సీఎం కేసీఆర్ మంట గలిపారని మండిపడ్డారు. ఇతర పార్టీల ఎమ్మెల్యేలను టీఆర్ఎస్‌లో ఎలా చేర్చుకున్నారో చెప్పాలని నిలదీశారు. కేసీఆర్ అసలు రూపం తెలంగాణ ప్రజలకు అర్థమైందని చెప్పారు.