2024 అధ్యక్ష ఎన్నికల్లో పోటీకి ట్రంప్ సై!

2024లో జరిగే అమెరికా  అధ్యక్ష ఎన్నికలలో తిరిగి పోటీ చేయడానికి మాజీ అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ సై అంటున్నారు. 2020 అధ్యక్ష ఎన్నికల్లో డెమొక్రట్స్ తనను మోసం చేసి గెలిచారని ఆరోపించిన ట్రంప్.. 2024లో జరిగే అధ్యక్ష ఎన్నికల్లో తాను పోటీ చేసే అవకాశాలు ఉన్నాయని స్పష్టం చేశారు.

అమెరికాలో వ‌చ్చేవారం మ‌ధ్యంత‌ర ఎన్నిక‌లు జ‌ర‌గ‌నున్నాయి. ఈ సంద‌ర్భంగా రిప‌బ్లిక‌న్ పార్టీ అయోవాలో  నిర్వ‌హించిన ఒక‌ ర్యాలీలో పాల్గొన్న  ట్రంప్ ఈ ప్రకటన చేశారు. 2020 ఎన్నికల సమయంలో జరిగిన మోసం వల్ల తాను పరాజయం పొందానని, ఈసారి కచ్చితంగా తమదే విజయమని ధీమా వ్యక్తం చేశారు.

ఇప్పటికే తాను రెండు సార్లు పోటీ చేశానని చెప్పిన ఆయన 2020లో కంటే 2022లో ఎక్కువ ఓట్లు వచ్చాయని చెప్పుకొచ్చారు. ఇప్పుడు మళ్లీ పోటీ చేయడానికి సిద్ధంగా ఉన్నట్లు వెల్లడించారు. ఈ నెలలోనే వైట్‌హౌస్  కోసం మూడో బిడ్‌ను బహుశా వేయవచ్చని చెప్పారు.

‘మ‌న‌దేశాన్ని బ‌లీయ‌మైన శ‌క్తిగా, సుర‌క్షితంగా, విజ‌య‌మంత‌మైన దేశంగా మార్చేందుకు నేను బ‌హుశా మ‌ళ్లీ అధ్య‌క్ష ఎన్నిక‌ల్లో పోటీ చేయొచ్చు. ఏడాది మ‌నం మ‌ళ్లీ వైట్‌హౌస్‌లో అడుగుపెట్ట‌బోతున్నాం. సెనేట్‌గా గెల‌వ‌బోతున్నాం 2024 ఎన్నిక‌ల్లో అమెరికాలో ప్ర‌భుత్వాన్ని ఏర్పాటు చేస్తాం. అందుకు అంద‌రూ సిద్ధంగా ఉండండి’ అని అక్క‌డి జ‌నాన్ని ఉద్దేశించి ఉత్తేజంగా ప్ర‌సంగించారు ట్రంప్.

అటు మాజీ అధ్యక్షుడి తాజా బిడ్‌ను పరిశీలిస్తున్నట్లు ముగ్గురు ట్రంప్ సలహాదారులు కూడా ధృవీకరించారు. ఇదిలాఉంటే.. 2020 నాటి అధ్యక్ష ఎన్నికల్లో ఓటమి తర్వాత ట్రంప్ అనుచరులు, మద్దతుదారులు ఎంతటి విధ్వంసం సృష్టించారో తెలిసిందే. ఏకంగా క్యాపిటల్ భవనంపై దాడికి పాల్పడ్డారు.

బ‌రాక్ ఒబామా త‌ర్వాత 2016లో అమెరికా అధ్య‌క్షుడిగా వైట్‌హౌస్‌లో అడుగుపెట్టారు డొనాల్డ్ ట్రంప్. పెద్ద‌ వ్యాపార‌వేత్త అయిన ట్రంప్‌ రిప‌బ్లిక‌న్ పార్టీ త‌ర‌ఫున ఎన్నిక‌ల్లో బ‌రిలోకి దిగి, డెమోక్రాటిక్ అభ్య‌ర్థి హిల్ల‌రీ క్లింట‌న్‌ని ఓడించారు. ఈమె అమెరికా మాజీ అధ్య‌క్షుడు బిల్ క్లింట‌న్ భార్య‌.

ట్రంప్ త‌న‌ ప‌ద‌వీకాలం త‌ర్వాత మ‌ళ్లీ అధ్య‌క్షుడిగా పోటీ చేయాల‌నుకున్నారు. అంతేకాదు, వైట్‌హౌస్‌ను ఖాళీ చేయ‌క‌పోవ‌డం, అధికార మార్పిడికి స‌హ‌క‌రించ‌క‌పోవ‌డం వంటి చ‌ర్య‌ల‌తో వార్త‌ల్లో నిలిచారు ట్రంప్. ప్ర‌స్తుతం అమెరికా ప్రెసిడెంట్‌గా ఉన్న డెమొక్రాటిక్ పార్టీ అభ్య‌ర్తి జో బిడెన్ ప‌ద‌వీకాలం 2024లో ముగుస్తుంది.

అమెరికా అధ్యక్షుడిగా డెమొక్రటిక్ పార్టీ నేత జో బైడెన్ ఎన్నికను ధ్రువీకరించడం కోసం జనవరి 6న యూఎస్ కాంగ్రెస్ క్యాపిటల్ భవనంలో సమావేశమైంది. ఈ సందర్భంగా ట్రంప్ ఇచ్చిన పిలుపుతో అప్పటికే వాషింగ్టన్ చేరుకున్న ఆయన మద్దతుదారులు ఒక్కసారిగా భవనంలోకి దూసుకెళ్లేందుకు ప్రయత్నించి అలజడి సృష్టించారు.

రక్షణగా భవనం బయట ఏర్పాటు చేసిన బారికేడ్లను దాటుకుని వచ్చి కిటికీలు, ఫర్నిచర్, అద్దాలు పగులగొట్టారు. వారిని శాంతింపజేసేందుకు తొలుత టీయర్ గ్యాస్ ప్రదర్శించినప్పటికీ లాభం లేకపోయింది. దాంతో తప్పనిసరి పరిస్ధితుల్లో పోలీసులు తూటాలకు పని చెప్పారు. ఈ ఘటనలో నలుగురు ప్రాణాలు కోల్పోయారు. ఈ ఘటన అగ్రరాజ్యం చరిత్రలోనే మాయని మచ్చగా మిగిలిపోయింది.