హిమాచల్‌లో మళ్ళీ బీజేపీ ప్రభుత్వం.. ప్రధాని ధీమా

హిమాచల్ ప్రదేశ్‌ శాసన సభ ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ  గెలుపొంది మరోసారి ప్రభుత్వం ఏర్పాటు చేస్తుందని ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ధీమా వ్యక్తం చేశారు. ఆయన శనివారం ఆ రాష్ట్రంలోని సోలన్‌లో ఎన్నికల ప్రచార సభలో మాట్లాడుతూ హిమాచల్‌లో మళ్ళీ బీజేపీ ప్రభుత్వం’ అనే నినాదాన్ని గట్టిగా వినిపించారు.

రాష్ట్రంలో డబుల్ ఇంజిన్ ప్రభుత్వం ఏర్పాటవుతుందనే నమ్మకం ఉందని చెబుతూ బీజేపీ సుస్థిర ప్రభుత్వాన్ని అందిస్తుందని, సుస్థిర ప్రభుత్వం వల్ల అనేక ప్రయోజనాలు ఉంటాయని తీగెకుపోయారు. రాష్ట్రానికి సుస్థిరతను ఇచ్చే బీజేపీ ప్రభుత్వం ఏర్పాటుకావలసిన అవసరం ఎంతో ఉందని చెప్పారు.

 గత ప్రభుత్వాల గురించి ప్రస్తావిస్తూ, 30 ఏళ్ళపాటు ఢిల్లీలో అస్థిరత్వం రాజ్యమేలిందన్నారు. ప్రభుత్వాలు వస్తూ, పోతూ, మళ్లీ మళ్లీ ఎన్నికలు జరుగుతూ ఉండేవని గుర్తు చేశారు. ఎన్నికల కోసం వేల కోట్ల రూపాయలు వృథా అవుతుండేవని ధ్వజమెత్తారు. 2014లో ప్రజలు ఓ సుస్థిర ప్రభుత్వానికి ఓటు వేశారని చెప్పారు.

కాంగ్రెస్ పరిపాలించిన కాలంలో అనేకమంది స్వార్థపరులు భారతదేశంలో సుస్థిర ప్రభుత్వాన్ని చూడాలని కోరుకోలేదని ప్రధాని విమర్శించారు. దేశంలోని చిన్న రాష్ట్రాలే ఇటువంటి స్వార్థపరులకు లక్ష్యంగా ఉండేవని పేర్కొన్నారు. ఉత్తరాఖండ్, గోవా, మణిపూర్ వంటి చిన్న రాష్ట్రాలు సుస్థిర ప్రభుత్వాలకు మద్దతుగా నిలిచాయని ప్రధాని సంతోషం వ్యక్తం చేశారు.

ప్రభుత్వాలను మార్చే సంప్రదాయం ఉత్తర ప్రదేశ్‌లో ఉండేదని,  కానీ ఆ రాష్ట్ర ప్రజలు ఆ సంప్రదాయాన్ని మార్చారని, యోగి ఆదిత్యనాథ్ ప్రభుత్వం మళ్ళీ వచ్చిందని ప్రధాని గుర్తు చేశారు. సుస్థిర ప్రభుత్వాలు ఏర్పడటం వల్ల ఉగ్రవాదం, నక్సలిజం అదుపులోకి వచ్చాయని మోదీ తెలిపారు. కేంద్రంలో సుస్థిర ప్రభుత్వం ఏర్పడటం వల్ల అవినీతికి, అవినీతిపరులకు వ్యతిరేకంగా పోరాటం ప్రారంభమైందని చెప్పారు.

మండి జిల్లాలోని సుందర్ నగర్ లో జరిగిన ఎన్నికల ప్రచార ర్యాలీలో ప్రధాని మోదీ పాల్గొని ప్రజలనుద్దేశించి ప్రసంగీస్తూ రాష్ట్రంలో రెండోసారి బీజేపీ అధికారంలోకి రావాలని ప్రజలు కోరుకుంటున్నారని  చెప్పారు.  హిమాచల్ ప్రదేశ్  ప్రజలు వేసే ప్రతి ఒక్క ఓటు రాబోయే 25 ఏండ్లలో జరగాల్సిన అభివృద్ధికి దిక్సూచిలా నిలుస్తుందని ప్రధాని మోదీ తెలిపారు.

రాష్ట్రం వేగంగా అభివృద్ధి చెందాలన్నా, సుస్థిర ప్రభుత్వం రావాలన్నా బీజేపీని మళ్లీ గెలిపించాలని కోరారు. బీజేపీ అంటే సుస్థిరత, సేవా భావం, సమానత్వానికి మారుపేరు అని మోదీ వ్యాఖ్యానించారు. హిమాచల్ ప్రదేశ్ శాసన సభ ఎన్నికలు ఈ నెల 12న జరుగుతాయి, ఓట్ల లెక్కింపు డిసెంబరు 8న జరుగుతుంది. రాష్ట్రంలోని 68 నియోజకవర్గాలకు ఎన్నికలు జరుగుతాయి.