సగం మందిని ఉద్యోగాల నుంచి తొలగిస్తున్న ట్విట్టర్

వివిధ దేశాల్లో పని చేస్తున్నవారిలో దాదాపు సగం మందిని ఉద్యోగాల నుంచి తొలగించాలని నిర్ణయించింది. ఉద్యోగాల నుండి తొలగించే విషయానన్ని తెలుపాటు వ్యక్తిగత ఈ-మెయిల్ ఐడీలకు లేఖలను పంపుతామని తెలిపింది. ఈ కంపెనీ యాజమాన్య బాధ్యతలను ఎలన్ మస్క్ చేపట్టిన తర్వాత భారీ స్థాయిలో ఉద్యోగుల తొలగింపుకు శుక్రవారం శ్రీకారం చుట్టారు.
 
 ”మీరు ఆఫీసులో ఉన్నా.. లేదంటే ఆఫీసుకు బయల్దేరినా… దయచేసి తిరిగి ఇంటికి వెళ్లండి” అని ట్విటర్‌ గురువారం తమ ఉద్యోగులకు పంపిన మెయిల్‌లో పేర్కొన్నట్లు సమాచారం. ఇక విధుల్లో కొనసాగే సిబ్బందికి వారి వర్క్‌ ఇమెయిల్‌ ఐడిల ద్వారా సమాచారాన్ని అందించన్నారు. 
 
ఉద్యోగుల కోతపై శుక్రవారం ఉదయం 9 గంటలకు (స్థానిక కాలమానం ప్రకారం) సిబ్బందిని అప్రమత్తం చేస్తామని కంపెనీ ఇమెయిల్‌లో వెల్లడించినట్లు తెలుస్తోంది. ఉద్యోగులు తొలగించబడ్డారా, తాత్కాలికంగా కార్యాలయాలను మూసివేయనున్నారా అన్న వివరాలు ఇమెయిల్‌ ద్వారా తెలియజేయనున్నట్లు ప్రకటించింది.
 
 ట్విటర్‌ను ఆరోగ్యకరమైన మార్గంలో ఉంచే ప్రయత్నంలో భాగంగా తమ సిబ్బందిని తగ్గించాలనే క్లిష్టమైన ప్రక్రియను ప్రారంభించామని, ఈ నిర్ణయం చాలా మందిపై పెను ప్రభావం చూపిస్తుందని తెలుసని ట్విటర్ మెయిల్ లో పేర్కొంది.  కానీ కంపెనీని విజయవంతంగా ముందుకు తీసుకెళ్లేందుకు ఈ చర్యలు తప్పట్లేదని ఈ మెయిల్‌లో వెల్లడించినట్లు రాయిటర్స్‌ మీడియా పేర్కొంది. 
 
ట్విటర్‌ ఉద్యోగుల ఇన్‌బాక్స్‌ల్లో ఇమెయిల్‌ కనిపించిన కొద్ది సేపటికే వందలాది మంది ఉద్యోగులు కంపెనీ స్లాక్‌ ఛానెల్‌లలో గుడ్‌బై చెప్పారని సంబంధిత వర్గాలు తెలిపాయి. ట్విటర్‌ మౌలిక సదుపాయాల ఖర్చులను ఏడాదికి ఒక బిలియన్‌ డాలర్ల వరకు తగ్గించుకోవాలని మస్క్‌..ట్విటర్‌ సిబ్బందిని ఆదేశించినట్లు రాయిటర్స్‌ పేర్కొంది.
 
ట్విటర్ కార్యాలయాలను ఇప్పటికే మూసివేశారు. అందరు ఉద్యోగుల బ్యాడ్జ్‌లను సస్పెండ్ చేశారు.  లేఆఫ్ ప్రణాళికపై చర్చించేందుకు టెస్లా, స్పేస్ఎక్స్ కంపెనీల్లోని సన్నిహిత సహచరులతో ఎలన్ మస్క్ సమావేశమయ్యారని జాతీయ మీడియా కథనాలనుబట్టి తెలుస్తోంది. సుమారు 3,738 మందిని ఉద్యోగాల నుంచి తొలగించే అవకాశం ఉన్నట్లు సమాచారం .లేఆఫ్‌కు ముందు వరకు ట్విటర్ కంపెనీలో ఉద్యోగుల సంఖ్య సుమారు 7,500 మంది.