వాడుకలో లేని 25 లక్షల క్రెడిట్ కార్డుల  రద్దు!

కరోనా మహమ్మారి తర్వాత ఒక వంక డిజిటల్ బ్యాంకింగ్ వేగం పుంజుకోవడంతో క్రెడిట్ కార్డుల వినియోగం విశేషంగా పెరుగుతూ ఉండగా, మరోవంక ఏడాది కాలానికి పైగా వాడని క్రెడిట్‌ కార్డులను రద్దు చేసేయాలని బ్యాంకులను ఆర్బీఐ ఆదేశించడంతో భారీ సంఖ్యలో కార్డుల రద్దు జరుగుతున్నది.
జూలై-సెప్టెంబర్‌ త్రైమాసికంలో 2.55 మిలియన్ల క్రెడిట్‌ కార్డులు రద్దు కావడంతో ప్రస్తుతం మార్కెట్‌లో 77.7 మిలియన్ల క్రెడిట్‌ కార్డులు వినియోగంలో ఉన్నాయి. అయితే, నెలవారీగా సగటున కొత్తగా 15 లక్షల క్రెడిట్‌ కార్డులు మార్కెట్‌లోకి వస్తున్నాయి.  వరుసగా గత ఆరు నెలల్లో ప్రతి నెలా రూ. లక్ష కోట్లకు పైగా క్రెడిట్ కార్డులపై లావాదేవీలు జరుగుతున్నాయి. అదే పండుగల సీజన్‌లో క్రెడిట్‌ కార్డులతో రూ. 1.22 లక్షల కోట్ల లావాదేవీలు జరిగాయి.
క్రెడిట్‌ కార్డు వాడుకలో లేకపోవడంతో రద్దు చేస్తున్నామని యూజర్‌కు సమాచారం ఇచ్చిన నెల రోజుల్లో సమాధానం రాని పక్షంలో ఆ క్రెడిట్‌ కార్డు అకౌంట్‌ రద్దు చేయాలని  ఆర్బీఐ స్పష్టం చేసింది. ఒకవేళ సదరు క్రెడిట్‌ కార్డుపై బకాయిలు ఉన్నట్లయితే, వాటి చెల్లింపులు పూర్తయ్యాక రద్దు చేయాలని సూచిచింది. రద్దు చేసిన తర్వాత నెల రోజుల్లోపు క్రెడిట్‌ ఇన్ఫర్మేషన్‌ కంపెనీకి డేటాను అప్‌డేట్‌ చేయాలని పేర్కొంది.
దేశంలోనే అత్యధికంగా క్రెడిట్‌ కార్డులు గల హెచ్డీఎఫ్‌సీ బ్యాంక్‌ కు సంబంధించి రెండో త్రైమాసికంలో 16.2 లక్షలు రద్దయ్యాయి. దేశంలోని రద్దయిన వివిధ బ్యాంకుల క్రెడిట్‌ కార్డుల్లో హెచ్డీఎఫ్సీ బ్యాంక్‌ అత్యధికం. జూలై నెలాఖరు నాటికి దాదాపు 1.8 కోట్ల క్రెడిట్‌ కార్డులు ఉంటే, సెప్టెంబర్‌ నెలాఖరు నాటికి 16.32 మిలియన్లకు పడిపోయాయి.

తాము కొత్తగా 12 లక్షల క్రెడిట్‌ కార్డులు జారీ చేయడంతో ఇప్పుడు 16.3 మిలియన్ల క్రెడిట్‌ కార్డులు మార్కెట్‌లో ఉన్నాయని హెచ్డీఎఫ్సీ బ్యాంక్‌ వర్గాలు తెలిపాయి.  క్రెడిట్‌ కార్డులను అత్యధికంగా రద్దు చేసిన బ్యాంకుల్లో రెండో స్థానంలో యాక్సిస్‌ బ్యాంక్‌ నిలిచింది.  గత సెప్టెంబర్‌తో ముగిసిన త్రైమాసికంలో 1.10 మిలియన్లకు పైగా క్రెడిట్‌ కార్డులను రద్దు చేసింది. ఫలితంగా జూలైలో 10 మిలియన్ల క్రెడిట్‌ కార్డులు ఉంటే, సెప్టెంబర్‌ నాటికి 8.82 మిలియన్ల కార్డులను యూజర్లు వినియోగిస్తున్నారని యాక్సిస్‌ బ్యాంక్‌ తెలిపింది.

మరో ప్రైవేట్‌ బ్యాంక్‌ ఐసీఐసీఐ బ్యాంక్‌ 4,09,147 కార్డులను కోల్పోయింది. కెనరా బ్యాంక్‌ 3,54,413 క్రెడిట్‌ కార్డులు, యెస్‌ బ్యాంక్‌ 40,567, స్టాండర్డ్‌ చార్టర్డ్‌ 1,04,432 క్రెడిట్‌ కార్డులను నష్టపోయింది.

ఇదిలా ఉంటే, ఎస్బీఐ కార్డులు సెప్టెంబర్ త్రైమాసికంలో కొత్తగా 2,93,368 జత కలిశాయి. ప్రీ-బేస్డ్ కార్డులే 95 శాతం ఉండటంతో ఆర్బీఐ నిబంధనల ప్రకారం ఎస్బీఐ కార్డుల రద్దుపై పెద్దగా ప్రభావం చూపలేదని తెలుస్తున్నది. కొత్తగా కొటక్‌ మహీంద్రా బ్యాంక్‌ 2,47,813 , ఐడీఎఫ్సీ ఫస్ట్‌ బ్యాంక్‌ 1,61,443, ఇండస్‌ఇండ్ బ్యాంక్‌ 1,08,334 , ఆర్బీఎల్‌ బ్యాంక్‌ 92,545 కార్డులు పెంచుకున్నాయి.