ఎర్రకోటపై దాడి కేసులో ఉగ్రవాదికి ఉరిశిక్ష ఖరారు 

2000 సంవత్సరంలో ఎర్రకోటపై దాడి కేసులో ఒక ఉగ్రవాదికి ఉరిశిక్షను సుప్రీంకోర్టు గురువారం ధ్రువీకరించింది. మరణశిక్ష విధిస్తూ తనకు విధించిన తీర్పును పున:సమీక్షించాలంటూ లష్కరే తోయిబా(ఎల్‌ఇటి) ఉగ్రవాది మహ్మద్‌ ఆరిఫ్‌ అలియాస్‌ అష్ఫాక్‌ దాఖలు చేసిన పిటిషన్‌ను సుప్రీంకోర్టు తిరస్కరించింది.

ఎలక్ట్రానిక్‌ రికార్డులను పరిగణనలోకి తీసుకోవాలన్న ఆరిఫ్‌ చేసిన విజ్ఞప్తిని అంగీకరించామని ప్రధాన న్యాయమూర్తి ఉదరు ఉమేష్‌ లలిత్‌, జస్టిస్‌ బేల ఎం త్రివేదిలతో కూడిన ధర్మాసనం తెలిపింది. ‘ఎలక్ట్రానిక్‌ రికార్డులను పరిగణనలోకి తీసుకోవాలన్న విజ్ఞప్తిని అంగీకరించాం. అతని నేరం రుజువైంది. ఈ కోర్టు తీసుకున్న అభిప్రాయాన్ని మేము ధ్రువీకరిస్తున్నాం. రివ్యూ పిటిషన్‌ను తిరస్కరిస్తున్నాం’ అని ధర్మాసనం పేర్కొంది.

2000 డిసెంబరు 22న ఎర్రకోటలో ఉగ్రవాదులు చొరబడి విచక్షణా రహితంగా కాల్పులు జరిపారు. ఈ దుర్ఘటనలో అక్కడ కాపలా విధుల్లో ఉన్న ఇద్దరు సైనికాధికారులు, మరో పౌరుడు మరణించారు. ఈ కేసులో మహమ్మద్‌ అరీఫ్‌ సహా 11 మందిపై కేసులు నమోదయ్యాయి. 

కోర్టు అతనికి ఉరిశిక్ష విధించగా సుప్రీంకోర్టులో రివ్యూ పిటిషన్‌ దాఖలు చేశాడు. దీన్ని పరిశీలించిన ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ యు.యు.లలిత్‌, జస్టిస్‌ ఎస్‌.రవీంద్ర భట్‌, జస్టిస్‌ బేలా ఎం త్రివేదిల ధర్మాసనం ఆ పిటిషన్‌ను తిరస్కరించి శిక్షను ఖరారు చేసింది. 

కింది కోర్టు 2005లో మరణ శిక్ష విధించగా, తర్వాత 2007లో  ఢిల్లీ హైకోర్టు సహితం ఆ శిక్షను ఖరారు చేసింది. 2011లో సుప్రీం కోర్ట్ ఆ శిక్షను ఖరారు  చేసినా, 2014లో శిక్ష అమలు కాకుండా స్టే ఇచ్చింది. 2000 నుండి అతను తీహార్ జైలులోనే ఉన్నాడు.  అతనిది పాకిస్థాన్‌లో అబ్బోటాబాద్‌ కావడం గమనార్హం. అతను పాకిస్థాన్ నుండి భారత్ కు వచ్చి, ఓ స్థానిక యువతి రెహ్మాన్ యూసఫ్ ఫారూఖీని వివాహం చేసుకున్నాడు. అతని విద్రోహ కార్యకలాపాల పట్ల పూర్తి పరిజ్ఞానం గల ఆమెను కూడా అరెస్ట్ చేశారు.