ఢిల్లీలో వాయు కాలుష్యంపై మానవ హక్కుల సంఘం ఆగ్రహం

ఢిల్లీలో వాయు కాలుష్యంపై జాతీయ మానవ హక్కుల కమీషన్ ఆగ్రహం వ్యక్తం చేసింది. వాయు కాలుష్యాన్ని నియంత్రించడంలో ప్రభుత్వాలు వైఫల్యం అయ్యాయని తెలిపింది. ఈ నెల 10న ఢిల్లీ, పంజాబ్ , హర్యానా, ఉత్తర ప్రదేశ్ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శులు తన ముందు హాజరుకావాలని నోటీసులు జారీ చేసింది.

ఈ సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వాలు తీసుకున్న చర్యలపై మానవ హక్కుల కమీషన్ అసంతృప్తి వ్యక్తం చేసింది. ఆర్టికల్ 47 ప్రకారం ప్రజారోగ్యం, ప్రజల జీవన ప్రమాణాలను మెరుగుపరచాల్సిన బాధ్యత  ప్రభుత్వాలదేనని స్పష్టం చేసింది. దీంతో పాటు ఈ మధ్య కాలంలో తమ ప్రాంతాల్లో పొగను నివారించడానికి చేపట్టిన చర్యల గురించి తెలియజేయాలని ఆదేశించింది.

ఢిల్లీ-ఎన్‌సీఆర్‌లో వాయు కాలుష్యాన్ని నియంత్రించేందుకు ఇంకా చాలా చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉందని కమిషన్ అభిప్రాయపడింది. ఇదిలా ఉండగా దేశ రాజధాని ఢిల్లీలో గాలి కాలుష్యం అంతకంతకూ పెరుగుతోంది. ఎయిర్ క్వాలిటీ రోజురోజుకూ తగ్గిపోతుండటంపై ప్రజల్లో ఆందోళన వ్యక్తమవుతోంది.

ఈ నేపథ్యంలో ఢిల్లీ ముఖ్యమంత్రి కేజ్రీవాల్  రేపట్నుంచి ప్రైమరీ స్కూళ్లు మూసి  చేస్తున్నట్లు ప్రకటించారు. కాలుష్యం తగ్గే వరకు స్కూళ్లు మూసేవేస్తామని చెప్పారు.  ప్రైమరీ స్కూళ్లకు సెలవులు ప్రకటించిన ప్రభుత్వం 5 నుంచి 8వ తరగతి విద్యార్థుల ఔట్ డోర్ యాక్టివిటీస్పై నిషేధం విధించారు.

 శీతాకాలానికి తోడు సమీప రాష్ట్రాలైన పంజాబ్, హర్యానాలో రైతులు పంట వ్యర్థాలను కాల్చడం వల్ల కాలుష్యం తీవ్రత పెరిగింది. ప్రస్తుతం ఢిల్లీలో ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ (ఏఐక్యూ) 472 వద్ద ఉంది. ఇది చాలా ప్రమాదకర స్థితిని సూచిస్తోంది. 

దేశ రాజధాని ఢిల్లీ సహా పరిసర ప్రాంతాల ప్రజలు గడపదాటి బయటకు రావాలంటే మాస్కు ధరించక తప్పని పరిస్థితి నెలకొంది. రాజధాని ప్రాంతంలో గాలి నాణ్యత క్షీణించడంతో, అది మెరుగుపడే వరకు పాఠశాలలను మూసివేయాల్సిందిగా జాతీయ బాలల హక్కుల పరిరక్షణ కమిషన్‌ ఢిల్లీ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిని కోరింది.

ఈ నేపథ్యంలో ఢిల్లీ, నోయిడా పరిధిలో పాఠశాలలు ఆన్ లైన్ బోధన ప్రారంభించాయి. ఢిల్లీ ప్రభుత్వం ఈ నెల 8వ తేదీ వరకు అన్ లైన్ క్లాసులు నిర్వహించాలని నిర్ణయించింది. అలాగే, విద్యార్థుల ఆరోగ్య సంరక్షణపై పాఠశాలల యాజమాన్యాలు దృష్టి సారించాయి. 

గాలి నాణ్యత మెరుగయ్యే వరకు పాఠశాలల ప్రాంగణాల్లో చిన్నారుల ఆటపాటలను నిలిపివేయాలని నిర్ణయించాయి. మరికొన్ని స్కూళ్లలో ఎయిర్ ప్యూరిఫయర్స్, వైద్య సదుపాయాలు ఏర్పాటు చేస్తున్నాయి.