భజరంగ్ దళ్ లో తెలంగాణలో లక్షమంది యువత

తెలంగాణ రాష్ట్రంలో లక్ష మంది యువతను బజరంగ్ దళ్ లో చేర్చుకుంటున్నామని  విశ్వహిందూ పరిషత్ (వి హెచ్ పి) రాష్ట్ర అధ్యక్షులు సురేందర్ రెడ్డి వెల్లడించారు. ధర్మం రక్షణ కోసం తమ సంస్థ విరామ మెరుగక పనిచేస్తోందని శుక్రవారం మీడియా సమావేశంలో  తెలిపారు.

ప్రతి మూడు సంవత్సరాలకు ఒకసారి విశ్వహిందూ పరిషత్ ఆధ్వర్యంలో నిర్వహించే “హితచింతక్ అభియాన్” (సభ్యత్వ నమోదు కార్యక్రమం)లో  భాగంగానే నవంబర్ 6 నుంచి 20 వరకు తెలంగాణ రాష్ట్రంతో పాటు ప్రపంచవ్యాప్తంగా సభ్యత్వ నమోదు కార్యక్రమం చేపడుతున్నట్లు చెప్పారు.
 
ప్రత్యేకంగా తెలంగాణ రాష్ట్రంలో యువతను విశ్వహిందూ పరిషత్ వైపు ఆకర్షిస్తున్నట్లు పేర్కొన్నారు. ఇప్పటికే నిర్దేశించిన ప్రణాళిక ప్రకారం రాష్ట్రంలోని 6000 గ్రామాలకు వెళ్లి సభ్యత్వ నమోదు చేయిస్తామని చెప్పారు. ప్రత్యేకంగా 30 వేల మంది కార్యకర్తలు ఈ పనిలో ఉన్నారని,  మొత్తంగా 10 లక్షల మందిని విశ్వహిందూ పరిషత్ లో కొత్తగా సభ్యులుగా చేర్చుకుంటామని ఆయన వివరించారు. 
 
సమాజంలోని స్వామీజీలు, దేవాలయాలు, పీఠాలు, మఠాలు,  పేరుమోసిన ప్రముఖులు,ఇతర వ్యక్తులు అందరినీ కలుపుతూ బడుగు బలహీన వర్గాలను హిందుత్వం వైపు ఆకర్షిస్తామని పేర్కొన్నారు. కులాలకు అతీతంగా అగ్రవర్ణాలు, అణగారిన వర్గాలు తేడా లేకుండా ప్రతి ఒక్కరిని విశ్వహిందూ పరిషత్ సాధారణంగా ఆహ్వానిస్తుందని ఆయన చెప్పారు. 
 
 దళితులను హిందూ సమాజంలో గౌరవ భాగస్వాములను చేస్తామని, అంటరానితనం అనే వివక్షను తొలగించేందుకు పనిచేస్తామని తెలిపారు.  1964 శ్రీకృష్ణ జన్మాష్టమి రోజు ఆవిర్భవించిన విశ్వహిందూ పరిషత్ వచ్చే రెండు సంవత్సరాలలో షష్టిపూర్తి చేసుకుంటుందని, అప్పటివరకు తెలంగాణ రాష్ట్రంలోని ప్రతి పల్లెలో విశ్వహిందూ పరిషత్ కమిటీ వేస్తామని విశ్వాసం వ్యక్తం చేశారు. 
 
బజరంగ్ దుర్గా వాహిని, గోరక్ష, మఠ మందిర్ తదితర విభాగాల ద్వారా సమస్త హైందవ లోకాన్ని ఏకం చేస్తామని చెప్పారు.  ఏ హిందువుకు ఆపద వచ్చినా పరిషత్ కార్యకర్తలు ముందుంటారని భరోసా ఇచ్చారు. ధర్మం వీడి ఇతర మతంలోకి వెళ్లిన వారందరూ తిరిగి స్వధర్మం లోకి రావాలని ఆహ్వానించారు. 
 
లవ్ జిహాద్ ను అడ్డుకుంటామని చబుతూ  ప్రతి మహిళ ధర్మం గురించి తెలుసుకోవాలని సూచించారు. ఈ సందర్భంగా సభ్యత్వ నమోదుకు సంబంధించిన కరపత్రాన్ని విడుదల చేశారు. పరిషత్ రాష్ట్ర ఉపాధ్యక్షులు జగదీశ్వర్ , రాష్ట్ర ప్రచార ప్రముఖ్ పగుడాకుల బాలస్వామి, బజరంగ్ దళ్ రాష్ట్ర కన్వీనర్ శివరాములు, దుర్గా వాహిని రాష్ట్ర కన్వీనర్ వాణి సక్కు భాయి తదితరులు పాల్గొన్నారు.