ఆ వీడియో అంతా ఒక నాటకం, బూటకం

ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి అవసరమైన సంఖ్య కంటే ఎక్కువ మంది ఎమ్మెల్యేలున్న తెలంగాణ ప్రభుత్వంలో సీఎం కే. చంద్రశేఖర రావుకు ఎందుకంత భయం, అభద్రతాభావం పట్టుకుందో చెప్పాలని భారతీయ జనతా పార్టీ తెలంగాణ రాష్ట్ర వ్యవహారాల ఇంచార్జి తరుణ్ చుగ్ ప్రశ్నించారు. గురువారం సాయంత్రం సీఎం కేసీఆర్ విడుదల చేసిన ‘ఫాంహౌజ్ వీడియో’ వివాదంపై స్పందిస్తూ స్పందిస్తూ ఆ వీడియోలో ఉన్న వ్యక్తులెవరితోనూ తమ పార్టీకి సంబంధం లేదని స్పష్టం చేశారు.
 వారికి పార్టీలో ఎప్పుడైనా చూశారా అని ప్రశ్నించారు. ఈ విషయంపై తమ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ ఆలయానికి వెళ్లి మరీ ప్రమాణం చేశారని, కానీ కేసీఆర్ ఎందుకు దేవుడి ముందు ప్రమాణం చేయలేకపోతున్నారో చెప్పాలని నిలదీశారు. ముగ్గురు వ్యక్తులతో ఒక నాటకం సృష్టించి బూటకపు కథలు అల్లుతున్నారని తరుణ్ చుగ్ మండిపడ్డారు.
కేసీఆర్ వ్యవహారశైలి చూస్తుంటే తన పార్టీ అమ్ముడు పోతోందని అంటున్నట్టుగా ఉందని ఎద్దేవా చేశారు. ఒక ముఖ్యమంత్రి టీవీ ముందుకొచ్చి ఇలా మాట్లాడడం మొదటిసారి చూస్తున్నానని విస్మయం వ్యక్తం చేశారు. పార్టీ మీద, నాయకుడి మీద భరోసా ఉంటే నేతలు ఎందుకు అమ్ముడుపోతారని ప్రశ్నించారు.
కేసీఆర్ వ్యవహారశైలి, నిరంకుశత్వం, అహంకారపూరిత ధోరణిపై ప్రజలు, సొంత పార్టీ నేతలు విసుగుచెంది ఉన్నారని తరుణ్ చుగ్ తెలిపారు. అందుకే కేసీఆర్‌లో భయం పుట్టుకొచ్చిందని, దాంతో లేనిపోని ఆరోపణలు చేస్తున్నారని ధ్వజమెత్తారు.
 మునుగోడు ఉప ఎన్నికల్లో బీజేపీ గెలుస్తుందన్న ధీమా వ్యక్తం చేసిన తరుణ్ చుగ్, కేసీఆర్ కుటుంబ పాలనకు ప్రజలు బుద్ధి చెబుతారని సూత్రీకరించారు. ప్రభుత్వ యంత్రాంగం మొత్తం మునుగోడులోనే తిష్టవేసి ధన ప్రవాహం సృష్టించారని, అయినా సరే ‘కేసీఆర్ బై, బై’ అని ప్రజలు నినదిస్తున్నప్పుడు తమ గెలుపును ఎవరూ ఆపలేరని ధీమా వ్యక్తం చేశారు.