కవితను కాపాడేందుకే కేసీఆర్ ఫాంహౌజ్ డ్రామా

లిక్కర్ కేసులో కవితను కాపాడేందుకే కేసీఆర్ ఫాంహౌజ్ డ్రామా ఆడారని పేర్కొంటూ  ఫాంహౌజ్ డ్రామా స్క్రిప్టు ఢిల్లీలోనే రాసుకున్నడని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ ఆరోపించారు. ఫాంహౌజ్ ఘటనలో నలుగురు ఎమ్మెల్యేల స్టేట్మెంట్ ఎందుకు రికార్డు చేయలేదని ఆయన ప్రశ్నించారు. నలుగురు ఎమ్మెల్యేలను స్టేషన్కు ఎందుకు తీసుకుపోలేదని నిలదీసేశారు.
26న ఘటన జరిగితే పంచనామాపై 27న సంతకం చేసినట్లు ఉందని ఆయన చెప్పారు. ఆధారాలు ఉంటే కోర్టుకు ముందే ఎందుకు సమర్పించలేదని ఆయన అడిగారు. కొడుకు కేటీఆర్ ఫాంహౌజ్ ఘటనపై ఎవరు మాట్లాడొద్దని చెప్తాడు..కేసీఆర్ మాత్రం అన్నీ బయటపెడతాడని చురకలంటించారని ఎద్దేవా చేశారు.
ప్రగతిభవన్లో కేసీఆర్ చూపించిన వీడియోలు చూసి జనం నవ్వుకుంటున్నారని ఎచెబుతూ కేసీఆర్ మాట్లాడుతుంటే..ఆయన ముఖంలో భయం కనిపించిందని తెలిపారు.  కేసీఆర్ అధికారంలోకి వచ్చినప్పుడే ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేశారని  సంజయ్ విమర్శించారు.  37 మంది ఇతర పార్టీల ఎమ్మెల్యేలను కేసీఆర్ సంతలో కొనుగోలు చేసినట్లు కొన్నారని మండిపడ్డారు. 2014లో టిడిపి ఎమ్మెల్యేను చేర్చుకుని మంత్రి పదవి కూడా కట్టబెట్టారని గుర్తు చేశారు. 2018లో కాంగ్రెస్ ఎమ్మెల్యేను చేర్చుకుని మరోసారి మంత్రి పదవి ఇచ్చారని పేర్కొన్నారు.
ప్రశ్నిస్తే కేసులు పెడతాడని, అసెంబ్లీలో ఎమ్మెల్యేలు మాట్లాడితే సస్పెండ్ చేస్తాడని ధ్వజమెత్తారు.జారీ చేసిన జీవోలు పబ్లిక్ డొమైన్లో  ఎందుకు పెట్టడం లేదని సంజయ్ ప్రశ్నించారు. ఇలాంటి కేసీఆర్ ప్రజాస్వామ్యం గురించి మాట్లాడటం హాస్యాస్పదంగా ఉందని విమర్శించారు. ప్రజాస్వామ్యం గురించి మాట్లాడే అర్హత కేసీఆర్కు లేదని మండిపడ్డారు.
తుషార్ అనే వ్యక్తికి బీజేపీతో ఎలాంటి సంబంధం లేదని చెబుతూ  కేరళలో అతను బీడీజేఎస్ తరపున పోటీ చేశారని స్పష్టం చేశారు. రాష్ట్రాన్ని కల్వకుంట్ల కుటుంబం దోచుకుంటుందని ఆరోపించారు. కేసీఆర్ అప్పట్లోనే దొంగ పాస్ పోర్టులు తయారు చేశారని విమర్శించారు.  కొడుకు, కూతురు కోసం కేసీఆర్ ఎంతకైనా తెగిస్తాడని సంజయ్ ఆగ్రహం వ్యక్తం చేశాడు. తలకాయ కిందకు..కాళ్లు పైకి చేసినా..కేసీఆర్ను ఎవరు నమ్మరని ఆయన చెప్పారు. బీజేపీలో ఎవరు చేరినా రాజీనామా చేసిన తర్వాత పార్టీలో చేర్చుకుంటామని గుర్తు చేశారు.
అసలు టీఆర్ఎస్ ప్రభుత్వాన్ని కూల్చాల్సిన పని తమకు లేదని స్పష్టం చేశారు. మరో 13 నెలల్లో ఎన్నికలున్నాయనియూ  ఈ సమయంలో కూలిస్తే బీజేపీ ప్రభుత్వం ఏర్పడుతుందా? అని ప్రశ్నించారు.