సీఎం కేసీఆర్, కూసుకుంట్ల ప్రభాకర్ పై క్రిమినల్ కేసు

సీఎం కేసీఆర్, మునుగోడు టీఆర్ఎస్ అభ్యర్థి కూసుకుంట్ల  ప్రభాకర్ రెడ్డిపై  క్రిమినల్ కేసు నమోదు అయ్యింది.  ఓటర్లను ప్రలోభాలకు గురి చేసేలా మాట్లాడిన కేసీఆర్ పై చర్యలు తీసుకోవాలని నల్గొండలో ఓ న్యాయవాది  కోర్టును ఆశ్రయించారు.
మునుగోడు ఉప ఎన్నికల ప్రచారంలో భాగంగా అక్టోబర్ 30న బంగారు గడ్డలో జరిగిన బహిరంగ సభలో సీఎం కేసీఆర్ వ్యాఖ్యలపై అభ్యంతరం వ్యక్తం చేశారు. ప్రభాకర్ రెడ్డిని గెలిపిస్తే 15 రోజుల్లో ఆసుపత్రి, చండూరును రెవిన్యూ డివిజన్ చేస్తానని, రోడ్లు అద్దంలా మారుస్తానని ఓటర్లను ప్రలోభ పెట్టారని ఆయన పేర్కొన్నారు. 171 ఎఫ్ సెక్షన్‭లో కేసు వేశారు.
తెలంగాణ ఎలక్ట్రికల్ ఎంప్లాయిస్ యూనియన్ అసోసియేషన్ వైస్ ప్రెసిడెంట్ ఏనుగు సత్తిరెడ్డి ఫిర్యాదు దారుడిగా  న్యాయవాది  పురుషోత్తం రెడ్డి స్పెషల్ జుడీషియల్ ఫస్ట్ క్లాస్ మెజిస్ట్రేట్ జడ్జికి క్రిమినల్ ఫిర్యాదును దాఖలు చేశారు. కేసు వివరాలను పరిశీలించడానికి సోమవారానికి వాయిదా వేశారు.
ఇదిలా ఉంటే.. ఉపఎన్నిక రాకముందు మునుగోడు నియోజకవర్గంలోని గ్రామాలను కేసీఆర్ పట్టించుకోలేదని న్యాయవాది పేర్కొన్నారు. ఇప్పుడు ఎన్నికలు రాగానే.. ప్రజలు ఏం చెప్పినా ఓటు వేస్తారని, అబద్ధపు హామీలు ఇచ్చి ప్రజలను మోసం చేసే ప్రయత్నం చేశారని కోర్టుకు తెలిపారు.
కేసీఆర్, కేటీఆర్ లపై ఆకుల శ్రీవాణి ఫిర్యాదు
మరోవంక, సీఎం కేసీఆర్, మంత్రి కేటీఆర్‭లపై వెంటనే కేసులు నమోదు చేయాలని సరూర్ నగర్ బీజేపీ కార్పొరేటర్ ఆకుల శ్రీవాణి కోరారు. డీజే టిల్లు అని కేటీఆర్‭ను ఉద్దేశించి తాను అనలేదని ఆమె చెప్పారు. కావాలనే తనపై కేసు నమోదు చేశారని ఆమె విమర్శించారు. బహిరంగంగా దేశ ప్రధాని, కేంద్ర మంత్రులపై అనుచిత వ్యాఖ్యలు చేస్తే కేసులు ఎందుకు నమోదు చేయడం లేదని ఆమె ప్రశ్నించారు.
పోలీసులు కేసీఆర్, కేటీఆర్ పై కేసు నమోదు చేయకపోతే వారు మాట్లాడిన భాషపై ఎన్.వో.సి ఇవ్వాలని ఆమె డిమాండ్ చేశారు.  మంత్రి కేటీఆర్ పై అనుచిత వ్యాఖ్యలు చేయడంపై సీసీఎస్ సైబర్ క్రైమ్స్‭లో ఆకుల శ్రీవాణి పై కేసు నమోదు చేశారు. అయితే ఈ నేపథ్యంలో పలువురు బీజేపీ కార్పొరేటర్‭లతో కలిసి ఆమె పోలీసుల ఎదుట హాజరై వివరణ ఇచ్చారు.
అనంతరం దేశ ప్రధాని, కేంద్ర మంత్రులపై అనుచిత వ్యాఖ్యలు చేస్తున్న సీఎం  కేసీఆర్, మంత్రి కేటీఆర్ పై బీజేపీ కార్పొరేటర్లు సీసీఎస్ సైబర్ క్రైమ్ పోలీసు స్టేషన్‭లో ఫిర్యాదు చేశారు. బీజేపీ కార్పొరేటర్ పై ఏ విధంగా అయితే హుటాహుటిన కేసు నమోదు చేశారో అదే విధంగా కేసీఆర్, కేటీఆర్‭లపై కేసు నమోదు చేయాలని  వారు డిమాండ్ చేశారు.