కేసీఆర్ బయటపెట్టిన వీడియోలను జబర్దస్త్ వీడియోలు 

గురువారం సాయంత్రం ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రగతి భవన్ లో బయట పెట్టిన  టిఆర్ఎస్ ఎమ్మెల్యే ల కొనుగోలుకు సంబందించిన వీడియోలు జబర్దస్త్ కామెడీ షోని తలపించినట్లు ఉన్నాయని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్  చేశారు.  ”కాపీ చేసిన తెలివిగా చేయాలి. సినిమా పేరు ఫామ్ హౌస్ డ్రామా.. ఇందులో యాక్టర్స్, టిఆర్ఎస్ ఎమ్మెల్యేలు. రచయిత, డైరెక్టర్, ప్రొడ్యూసర్ సీఎం కేసీఆర్” అని ట్వీట్ చేశారు. 

మునుగోడు ఉప ఎన్నికలో ఓటమి తప్పదని కేసీఆర్ కు అర్థమైందని, అందుకే విలేఖర్ల సమావేశంలో పచ్చి అబద్ధాలు మాట్లాడారని బీజేపీ జాతీయ ఉపాధ్యక్షురాలు, మాజీ మంత్రి  డీకే అరుణ విమర్శించారు. అసలు  కేసీఆర్ చెప్తున్న ఆ ముగ్గురు నిందితులకు బీజేపీకి ఏమి సంబంధమని ఆమె ప్రశ్నించారు. 

వీడియో చేయడానికి చాలా కష్ట పడ్డాం అని ముఖ్యమంత్రే ఒప్పుకున్నారని.. కేసీఆర్ తీరు దయ్యాలు వేదాలు వల్లించినట్లు ఉందని ఆమె ఎద్దేవా చేశారు.  నలుగురులో ముగ్గురు ఎమ్మెల్యేలు కాంగ్రెస్ టిక్కెట్ పై పోటీ చేసి గెలిచారని చెబుతూ ఆ ముగ్గురు ఎమ్మెల్యే లను కొన్నది ఎవరు? అని డీకే అరుణ ప్రశ్నించారు.

దేశ ప్రధాన మంత్రి గురించి మాట్లాడినంత మాత్రాన దేశ్ కి నేత కాలేరని ఆమె ఎద్దేవా చేశారు. కేసులపై భయంలేనప్పుడు తెలంగాణ రాష్ట్రంలో కేంద్ర దర్యాప్తు సంస్థలను ఎందుకు అడ్డుకున్నావని ఆమె ప్రశ్నించారు. తెలంగాణ ప్రజలు కల్వకుంట్ల కుటుంబాన్ని తరిమికొడతారని డీకే అరుణ జోస్యం చెప్పారు.

కాగా, ఎమ్మెల్యేల కొనుగోలుతో బీజేపీకి సంబంధం లేదని బిజెపి జాతీయ ప్రధాన కార్యదర్శి  తరుణ్ చుగ్ తెలిపారు. పట్టుబడ్డ ముగ్గురు నిందితులకు బీజేపీతో సంబంధాలు ఉన్నాయన్నది అబద్ధమని పేర్కొన్నారు. సొంత ఎమ్మెల్యేలపై కేసీఆర్కు విశ్వాసం లేదని ఎద్దేవా చేశారు. రాష్ట్రంలో అరాచక పాలన సాగుతుందని విమర్శించారు. కేసీఆర్ అహంకారం మునుగోడు ఫలితంతో తగ్గుతుందని చెప్పారు.

మునుగోడు ఉపఎన్నికలో బీజేపీ కార్యకర్తలు కష్టపడి పనిచేశారన్న చుగ్.. మునుగోడు ప్రజలకు, కార్యకర్తలకు ఆయన ధన్యవాదాలు తెలిపారు. ప్రధాని మోదీపై కేసీఆర్ తప్పుడు ప్రచారం చేస్తున్నారని తరుణ్ చుగ్ మండిపడ్డారు. ప్రధాని కావాలని కేసీఆర్ కలలుకంటున్నాడని.. అయితే ప్రజాస్వామ్యబద్ధంగా ఎవరైనా ప్రధానమంత్రి కావొచ్చని చెప్పారు.