కిరాయి ఆర్టిస్టులతో వీడియో తీయించిన కేసీఆర్

బిజెపి ఇతర పార్టీల ఎమ్యెల్యేలను కొనుగోలు చేస్తున్నదని అంటూ కిరాయి ఆర్టిస్టులతో వీడియో తీయించి, అదే నిజమని నమ్మించడానికి కేసీఆర్ ప్రయత్నిస్తున్నారని కేంద్ర మంత్రి జి కిషన్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. గురువారం రాత్రి కేసీఆర్ ప్రదర్శించిన వీడియోను ప్రదర్శిస్తూ  అయితే ఇదంతా ప్రజలు గమనిస్తున్నారని స్పష్టం చేశారు. 

కేసీఆర్ విడుదల చేసిన వీడియోలోని వ్యక్తులకు తమ పార్టీకి ఎలాంటి సంబంధం లేదని ఆయన తేల్చి చెప్పారు. మీడియా సమావేశంలో  సీఎం కేసీఆర్  చెప్పినవన్నీ అబద్ధాలేనని పేర్కొంటూ ఎమ్మెల్యేల కొనుగోలు ఉదంతంలో అమిత్ షా, నడ్డా, సంతోష్ ల పాత్ర ఉందంటూ కేసీఆర్ చేసిన వ్యాఖ్యల్ని కిషన్ రెడ్డి తీవ్రంగా ఖండించారు.  రాష్ట్రంలో టీఆర్ఎస్ పార్టీకి ప్రజల్లో ఆదరణ తగ్గిపోతోందని, ఆ అసహనంతోనే కేసీఆర్ ఏవేవో మాట్లాడుతున్నారని ఆయన మండిపడ్డారు. 

ఈ మధ్య కాలంలో కేసీఆర్ నోరు తెరిస్తే జాతీయ రాజకీయాలు గురించి మాట్లాడుతున్నారని అంటూ ముందు రాష్ట్రాన్ని బాగు చేసి దేశం గురించి తర్వాత ఆలోచించాలని హితవు చెప్పారు. రాష్ట్రంలో ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేసిన కేసీఆర్ దేశంలో ప్రజాస్వామ్యం గురించి మాట్లాడటం హాస్యాస్పదంగా ఉందని కిషన్ రెడ్డి ఎద్దేవా చేశారు.

ప్రజాస్వామ్యాన్ని పరిహాసం చేసిన టీఆర్‌ఎస్

కాగా, మునుగోడు ఉపఎన్నికల్లో అధికార టీఆర్‌ఎస్ అధికార దుర్వినియోగానికి పాల్పడిని ప్రజాస్వామ్యాన్ని మరోసారి పరిహాసం చేసిందని కిషన్ రెడ్డి విమర్శించారు. అంగబలం, అర్థబలంతో పాటు పోలీసులు, ఇతర అధికారులను తమ గెలుపు కోసం విచ్చలవిడిగా వినియోగించుకుందని ఆరోపించారు. 

ఎన్నికలకు 36 గంటల ముందు స్థానికేతరులు మునుగోడు నియోజకవర్గాన్ని ఖాళీ చేసి పోవాలన్న నిబంధనను కూడా టీఆర్ఎస్ పార్టీ యథేచ్చగా గాలికొదిలేసిందన్న కిషన్ రెడ్డి, టీఆర్ఎస్ ఎంపీలు, ఎమ్మెల్యేలు, నాయకులు మాత్రం ఎన్నికకు ముందు రెండు రాత్రులు అధికారులు, పోలీసుల అండదండలతో గ్రామాల్లో తిరుగుతూ డబ్బులు పంచారని ధ్వజమెత్తారు. 

పైగా, ప్రశ్నించిన వారిపై దాడులకు చేస్తూ అరాచకాలకు పాల్పడటం దురదృష్టకరమని ఆవేదన వ్యక్తం చేశారు. పారదర్శకంగా జరగాల్సిన ఎన్నిక పక్షపాతంగా మారిందని విమర్శించారు.

“నాతో పాటుగా బీజేపీ నాయకులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు అందరూ నిబంధనల ప్రకారం నవంబర్ 1వ తేదీ సాయంత్రం 5 గంటల వరకే మునుగోడును ఖాళీ చేశాము. కానీ టీఆర్ఎస్ ఎంపీలు, ఎమ్మెల్యేలు, నాయకులు మాత్రం ఎన్నికకు ముందు రెండు రాత్రులు అధికారులు, పోలీసుల అండదండలతో గ్రామాల్లో తిరుగుతూ డబ్బులు పంచడంతోపాటు, ప్రజలను బెదిరించడం, ప్రశ్నించిన వారిపై భౌతిక దాడులకు పాల్పడటం వంటి అరాచకాలకు పాల్పడటం దురదృష్టకరం” అని కేంద్ర మంత్రి తెలిపారు. 

ఎన్నికకు ఒకరోజు ముందు రాత్రి, ఎన్నిక జరుగుతున్న సమయంలోనూ టీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు డబ్బులు పంచుతుంటే, స్థానికేతరులు యథేచ్ఛగా డబ్బు, మద్యం పంచుతుంటే పోలీసులు చేష్టలుడిగి చూడటం అత్యంత దారుణమని కిషన్ రెడ్డి మండిపడ్డారు. ఫిర్యాదు చేసిన బీజేపీ నాయకులు, కార్యకర్తలపైనే ఉల్టా కేసులు బనాయించి, బెదిరించడం పట్ల ఆగ్రహం వ్యక్తం చేశారు. 

దీనికి తోడు వివిధ గ్రామాల్లో ఫంక్షన్ హాళ్లలో అక్రమంగా ఉన్న స్థానికేతరులు ఉంటున్న విషయాన్ని తెలియజేసిన, అధికార పార్టీ డబ్బులు పంచడాన్ని అడ్డుకున్న బీజేపీ కార్యకర్తలు, ఓటర్లపైనే పోలీసులు కేసులు పెట్టడం, లాఠీ చార్జ్ చేయడం అమానుషం అని మండిపడ్డారు. 

 రాజకీయాలకు అతీతంగా ప్రజలకు సేవ చేయాల్సిన అధికారులు, పోలీసులు అన్యాయంగా అధికార పార్టీకి పూర్తి అనుకూలంగా వ్యవహరించడం ప్రజాస్వామ్య విరుద్ధం అని ఆయన స్పష్టం చేశారు. టీఆర్ఎస్ పార్టీ వ్యవహరించిన తీరును, అధికారులు, పోలీసుల వ్యవహార శైలిని ఆయన తీవ్రంగా ఖండించారు.