విజయవాడలో 6న సమరసత సమ్మేళనం

దేశవ్యాప్తంగా కులాల హెచ్చుతగ్గులు అస్పృశ్యత నిర్మూలనకు కృషి చేస్తున్న సామాజిక సమరసత వేదిక ఆధ్వర్యంలో ఈ నెల 6న ఆదివారం విజయవాడ సిద్ధార్థ కళాశాల ఆడిటోరియంలో “సమరసత సమ్మేళనం” జరుగుతుందని సంస్థ జాతీయ కన్వీనర్ కే.శ్యాం ప్రసాద్ విజయవాడలో మీడియా సమావేశంలో తెలిపారు. 
 
1917 నవంబర్ 9, 5 ,6 తేదీలలో విజయవాడ కృష్ణా నది తీరాన గల ప్రముఖులు శ్రీ కాశీనాధుని నాగేశ్వరరావు పంతులు, ఉన్నవ లక్ష్మీనారాయణ. శ్రీఅయ్య దేవర కాళేశ్వరరావు వంటి పెద్దలు అస్పృశ్యత నిర్మూలన కోసం “ఆది ఆంధ్ర మహాసమ్మేళనం” నిర్వహించడం జరిగిందని ఆయన గుర్తు చేశారు. 
 
 హైదరాబాద్ కు చెందిన ప్రముఖ ఎస్సీ నాయకులు భాగ్యరెడ్డి వర్మ ఈ   సభకు అధ్యక్షత వహించారు. అస్పృశ్యత అంటరానితనం గురవుతున్న వర్గాల ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యల పరిష్కారాలకై అనేక తీర్మానాలు చేశారు. ఆ సభల స్ఫూర్తితో గత 105 సంవత్సరాల ఏళ్లలో సామాజిక సమతా దిశలో అనేకమంది పనిచేశారని శ్యాంప్రసాద్ వివరించారు.
 గత 72 ఏళ్లుగా భారత రాజ్యాంగానికి అనుగుణంగా ఈ దశలో దేశం అనేక అడుగులు ముందుకు వేసినా ఆశించిన స్థాయిలో మార్పులు రాలేదని పేర్కొన్నారు.  ఈ నేపథ్యంలో ఈ నెల 6 న “సామరసత సమ్మేళనం” నిర్వహిస్తున్నామని చెప్పారు.
 
డాక్టర్ మంగళగిరి రవీంద్రనాథ్ అధ్యక్షతన జరిగే ఈ సమ్మేళనంలో కేంద్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి సి. నారాయణస్వామి, పూజ్యశ్రీ కమలానంద భారత స్వామీజీ, ఆర్ఎస్ఎస్ జాతీయ ప్రచార ప్రముఖ సునీల్ అంబెకర్, ఏపీ ప్రభుత్వ మాజీ ప్రధాన కార్యదర్శి ఐ వి ఆర్ కృష్ణారావు, మాజీ మంత్రులు మండలి బుద్ధ ప్రసాద్, డొక్కా మాణిక్య వరప్రసాద్తదితరులు పాల్గొంటారని తెలిపారు. 
 
ఈ సందర్భంగా కాశీనాధునీ నాగేశ్వరరావు పంతులు, వేముల కూర్మయ్య భాగ్యరెడ్డి వర్మ కుటుంబికులకు సత్కారం జరుగుతుందని చెప్పారు. విలేకరుల సమావేశంలో సంస్థ రాష్ట్ర అధ్యక్షులు తాళ్లూరి శ్రీ విష్ణు , ప్రెస్ క్లబ్ అధ్యక్షులు నిమ్మరాజు చలపతిరావు, ప్రముఖ రచయిత జర్నలిస్ట్ డాక్టర్ దుగ్గరాజు శ్రీనివాసరావు పాల్గొన్నారు.