టిడిపి సీనియర్ నేత అయ్యన్నపాత్రుడు అరెస్ట్

తెలుగుదేశం పార్టీ సీనియర్‌ నేత చింతకాయ అన్నయ్యపాత్రుడితో పాటు ఆయన తనయుడు రాజేశ్‌ను అరెస్టయ్యారు. అనకాపల్లి జిల్లా నర్సీపట్నంలో తెల్లవారుజామున సీఐడీ పోలీసులు సెక్షన్ సీఆర్పీసీ 50ఏ ప్రకారం నోటీసులు ఇచ్చిన సీఐడీ అధికారులు తండ్రీ కొడుకులను అరెస్టు చేశారు.

ఇటీవల గోడ కూల్చిన వివాదంలో అయ్యన్నపాత్రుడు కోర్టుకు సమర్పించిన డాక్యుమెంట్లు నకిలీవని, ఈ మేరకు మంగళగిరి సీఐడీ పోలీస్‌స్టేషన్‌లో నమోదైన కేసులో అరెస్టు చేసినట్లు అధికారులు నోటీసులో పేర్కొన్నారు. సెక్షన్ 464, 467, 471, 474, 34 ఐపీసీ సెక్షన్‌ కింద నాన్ బెయిలబుల్ కేసు నమోదు చేశారు. అయ్యన్నపాత్రుడు, కుమారుడు రాజేశ్‌ను ఏలూరు కోర్టులో ఇద్దరిని హాజరు పరచనున్నట్లు నోటీసులో పేర్కొన్నారు.

అయితే, సీఐడీ పోలీసుల తీరుపై అయ్యన్నపాత్రుడి సతీమణి పద్మావతి ఆగ్రహం వ్యక్తం చేశారు. తెల్లవారు జామున 3 గంటల ప్రాంతంలో దొంగల్లా గోడ దూకి వచ్చి, తలుపులు పగులగొట్టి ఇంట్లోకి వచ్చేందుకు ప్రయత్నించారని ఆరోపించారు. తన చిన్న కొడుకు రాజేశ్‌ శబ్దాలు విని తలుపులు తీసి మీరెవరు? ఏం కావాలని అడిగితే సమాధానం చెప్పకుండా అయ్యప్ప మాల వేసుకున్న రాజేశ్‌ను ఈడ్చుకొని వెళ్లిపోయారని ఆమె తెలిపారు. పోలీసులు తాగి వచ్చి దుర్భాషలాడారని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు.

అయ్యన్నపాత్రుడు వచ్చి ఎందుకు అరెస్టు చేస్తున్నారంటూ ఎఫ్‌ఐఆర్‌ కాపీ అడిగినా ఇవ్వలేదని, ఇలాంటి పరిస్థితి ఏ రాజకీయ నాయకుడికి రాకూడదని పద్మావతి పేర్కొన్నారు. ప్రభుత్వం నుంచి అయ్యన్నపాత్రుడు, రాజేశ్‌కు ప్రాణహాని ఉందని ఆమె ఆరోపించారు.  కనీసం దుస్తులు మార్చుకొనివ్వకుండా తన భర్తను తోసుకుంటూ తీసుకువెళ్లారని ఆమె చెప్పారు. కాళ్లకు చెప్పులు కూడా వేసుకొనివ్వలేదని పేర్కొంటూ మూడేళ్ళుగా తమ కుటుంబాన్ని వేధింపులకు గురిచేస్తున్నారని ఆమె వాపోయారు.

ఇదిలా ఉండగా, గతంలో అయ్యన్నపాత్రుడి నివాసం దగ్గర ప్రహరీ గోడ విషయంలో వివాదం చెలరేగింది. తెలుగుదేశం సీనియర్‌ నేత, మాజీ మంత్రి పంట కాలువ స్థలాన్ని ఆక్రమించి గోడ కట్టారని కూల్చివేతకు అధికారులు సిద్ధమవగా,  కుటుంబ సభ్యులు అడ్డుకోవడంతో ఉద్రిక్త పరిస్థితులు తలెత్తాయి.

అనంతరం హైకోర్టును ఆశ్రయించగా అయ్యన్న కుటుంబానికి ఊరట లభించింది. తాజాగా అదే కేసులు ఫోర్జరీ డాక్యుమెంట్లను కోర్టుకు సమర్పించారంటూ అయ్యన్నపాత్రుడితో రాజేశ్‌ను సీఐడీ పోలీసులు అరెస్ట్ చేశారు. ఏలూరు కోర్టులో వారిని ప్రవేశపెడుతామని చెప్పి తీసుకెళ్లారు పోలీసులు. కానీ ఆయన్ను విశాఖ ప్రాంతీయ సీఐడీ కార్యాలయానికి తరలించారు. విచారణ అనంతరం ఏలూరు తీసుకెళ్తారా? లేక విశాఖలోనే కోర్టులో ప్రవేశపెడతారో పోలీసులు వెల్లడించలేదు.