మోర్బీ ఘటనా స్థలాన్ని పరిశీలించిన ప్రధాని మోదీ

గుజరాత్ లోని మోర్బీలో కేబుల్ బ్రిడ్జి కూలిన ఘటనా స్థలాన్ని ప్రధాని నరేంద్ర మోదీ  పరిశీలించారు. అధికారులతో మాట్లాడి ఘటనకు సంబంధించిన వివరాలను తెలుసుకున్నారు. మృతుల కుటుంబాలను ఓదార్చిన ప్రధాని  ఘటనలో గాయపడి ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న వారిని కూడా ప్రధాని పరామర్శించారు. వారికి అండగా ఉంటామని భరోసా ఇచ్చారు. 
 
సహాయక చర్యలు చేపట్టిన వారితో కూడా మోదీ మాట్లాడారు. ఆ తర్వాత మోర్బీ ఎస్పీ కార్యాలయంలో అధికారులతో ప్రధాని సమీక్ష జరిపారు.  ప్రమాదం తనను తీవ్రంగా కలచివేసిందని మోదీ చెప్పారు. గుజరాత్‌లో పర్యటిస్తున్న ఆయన మృతుల, క్షతగాత్రుల కుటుంబాలను ఆదుకుంటామని పేర్కొన్నారు. 
 
అహ్మదాబాద్‌లో తలపెట్టిన రోడ్‌షోను, వర్చువల్‌ ‘పేజ్‌ కమిటీ సమ్మేళన్‌’ను ప్రధాని ఇప్పటికే రద్దు చేసుకున్నారు. ప్రధాని మోదీతో పాటుగా ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి  భూపేంద్ర పటేల్‌ కూడా క్షతగాత్రులను పరామర్శించారు. 
 
ఈ ప్రమాద ఘటనలో ఇప్పటివరకు మృతుల సంఖ్య 135కి చేరింది.  ఈ సంఖ్య ఇంకా పెరిగే ప్రమాదం ఉందని.. మరో వంద మంది మృతదేహాలు నది అడుగుభాగంలో ఉన్న బురదలో కూరుకుపోయి ఉంటాయనే ఆందోళన వ్యక్తమవుతోంది. ఈ ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయినవారిలో రెండేళ్ల చిన్నారి సహా 47 మంది పిల్లలు ఉన్నారని అధికారులు తెలిపారు. 
 
ఆదివారం సాయంత్రం వంతెన కూలిన వెంటనే.. గల్లంతైనవారి కోసం రాష్ట్ర, జాతీయ విపత్తు సహాయక బృందాలు గాలింపు ప్రారంభించినప్పటికీ.. చీకటి వల్ల కష్టంగా మారింది. దీంతో సోమవారం ఉదయాన్నే గాలింపును కొనసాగించారు. కాగా, ఈ బ్రిడ్జి ప్రమాదానికి సంబంధించి సీసీటీవీ ఫుటేజీ విడుదలైంది. 
 
బ్రిడ్జిపై ఉన్న కొంత మంది వ్యక్తులు సెల్ఫీలు తీసుకుంటుండగా.. మధ్యభాగంలో ఉన్నవారు ఆ వంతెనను అటూఇటూ ఊపేందుకు ప్రయత్నించడంతో అప్పటికే బరువును తట్టుకోలేకపోయిన బ్రిడ్జి కుప్పకూలిపోయిన దృశ్యాలు ఆ వీడియోలో ఉన్నాయి. 125 మందిని మాత్రమే మోయగలిగే సామర్థ్యం ఉన్న ఆ వంతెనపైకి 500 మంది చేరడమే కాక.. దాన్ని ఊపడంతోనే ఈ ప్రమాదం జరిగిందని సమాచారం.
 
మరోవైపు.. నిర్లక్ష్యంతో ఈ ప్రమాదానికి కారకులుగా భావిస్తూ 9 మందిని పోలీసులు అరెస్టు చేశారు. మరమ్మతులు చేపట్టిన సంస్థలపై ఐపీసీ సెక్షన్‌ 304, 308 కింద కేసులు నమోదు చేశారు. సాంకేతిక, నిర్మాణ లోపాలు, నిర్వహణ సమస్యేలే ప్రమాదానికి కారణమని ఎఫ్‌ఐఆర్‌లో పేర్కొన్నారు. నిర్వాహకులు మరమ్మతులు సరిగ్గా చేయలేదని నాణ్యత పరీక్షలు కూడా చేపట్టలేదని ఎఫ్‌ఐఆర్‌లో పేర్కొన్నారు.
పోలీసులు అరెస్టు చేసినవారిలో ఒరేవా కంపెనీ మేనేజర్లు ఇద్దరు, మరో ఇద్దరు టికెట్‌ విక్రేతలు, ఇద్దరు మరమ్మతు కాంట్రాక్టర్లు, ముగ్గురు సెక్యూరిటీ గార్డులు ఉన్నారు.
వంతెన కూలిన ఘటనపై విచారణ జరిపేందుకు  గుజరాత్ ప్రభుత్వం ఇప్పటికే ఐదుగురు సభ్యులతో కూడిన కమిటీని ఏర్పాటు చేసింది. ఈ ప్రమాదంలో మరణించిన వారి కుటుంబ సభ్యులకు ఒక్కొక్కరికి రూ. 2 లక్షలు, గాయపడిన వారికి రూ 50,000 చొప్పున ప్రధాని ఎక్స్‌గ్రేషియా ప్రకటించారు. అటు గుజరాత్ రాష్ట్ర ప్రభుత్వం మృతుల కుటుంబాలకు రూ. 4 లక్షలు, గాయపడిన వారికి రూ 50,000 చొప్పున ఎక్స్‌గ్రేషియా ప్రకటించింది.