మునుగోడులో ముగిసిన ఎన్నిక‌ల ప్ర‌చారం… రేపే పోలింగ్ 

న‌ల్ల‌గొండ జిల్లా మునుగోడు ఉప ఎన్నిక కోసం రాజ‌కీయ పార్టీల ప్ర‌చారం మంగళవారం  సాయంత్రంతో ముగిసింది. ఈ ఉపఎన్నిక  కోసం టీఆర్ ఎస్‌, బీజేపీ, కాంగ్రెస్ పార్టీల‌తో పాటు ప‌లు చిన్నా, చిత‌కా పార్టీల అభ్య‌ర్థులు పోటీ ప‌డుతున్నారు. అయితే.. ప్ర‌ముఖంగా ఇక్క‌డ త్రిముఖ పోటీ ఉండ‌నున్న‌ట్టు నెలకొంది. 
 
ఈ ఉప ఎన్నిక వ‌చ్చిన‌ప్ప‌టి నుంచి టీఆర్ ఎస్‌, బీజేపీ మ‌ధ్యనే  ప్రధానంగా పోటీ కేంద్రీకృతమై, రెండు పార్టీల మధ్య ఉద్రిక్తపూరితంగా ఎన్నికల ప్రచారం జరిగింది.  గెలుపుకోసం ఈ రెండు పార్టీలు పోటా పోటీ ప్ర‌చారం చేశాయి. పెద్ద ఎత్తున తమ నాయకులను మోహ‌రించిన ఇరు పార్టీలు ఓట‌ర్ల‌ను ఆక‌ట్టుకునే య‌త్నం చేశాయి.
అధికార టిఆర్ఎస్ అయితే మొత్తం మంత్రులు, ఎంపీలు,  ఎమ్యెల్యేలను మోహరించి ప్రతిష్టాకరంగా ప్రచారం చేసింది. బిజెపి సహితం పోటాపోటీగా ప్రచారం చేపట్టింది. వచ్చే  జరిగే అసెంబ్లీ ఎన్నికలకు ప్రజల నాడి వెల్లడయ్యే ఎన్నికగా ప్రచారం జరగడంతో మూడు ప్రధాన పార్టీలకు జీవన్మరణ సమస్యగా ఈ ఎన్నికలు మారాయి.
 దుబ్బాక, హుజురాబాద్ ఉపఎన్నికల సమయంలో పడకవేసిన కాంగ్రెస్ ఈ ఎన్నిక ద్వారా తెలంగాణాలో తన ఉనికి చాటుకొనే ప్రయత్నం చేస్తున్నది. గతంలో ఏ ఉపఎన్నికలో సహితం ఒక  పర్యయంకన్నా ఎక్కువగా ప్రచారంకు రాని ముఖ్యమంత్రి కేసీఆర్ ఇక్కడ మాత్రం ఎన్నికల ప్రకటనకు ముందు ఒకసారి, చివరిలో మరోసారి వచ్చి బహిరంగ సభలలో ప్రసంగించారు.  బిజెపి జాతీయ నాయకత్వం స్వయంగా ఇక్కడ ఎన్నికల ప్రచారాన్ని పర్యవేక్షించింది. ఇక్కడ అభ్యర్థుల జయాపజయాలకన్నా మూడు ప్రధాన పార్టీల రాజకీయ అస్తిత్వంకు అగ్ని పరీక్షగా ఈ ఎన్నికలు మారాయి. 
 
అందరి దృష్టి ఆకర్షిస్తోన్న ఉపఎన్నిక పోలింగ్ సజావుగా నిర్వహించేందుకు ఎన్నికల సంఘం అవసరమైన ఏర్పాట్లు చేస్తోంది. సాధారణంగా మారిన ప్రలోభాలను నిరోధించేందుకు ప్రత్యేక బృందాలను రంగంలోకి దింపింది. గురువారం ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు 298 కేంద్రాల్లో మునుగోడు ఉపఎన్నిక పోలింగ్ జరగనుంది.
 
మునుగోడు ఉప ఎన్నిక బరిలో 47 మంది అభ్యర్థులు నిలిచారు. నోటా కలిపి ఒక్కో ఇవిఎంలో మూడు బ్యాలెట్ యూనిట్లు అవసరం. ఇందుకోసం 1,192 బ్యాలెట్ యూనిట్లను సిద్ధం చేశారు. కంట్రోల్ యూనిట్లు, వీవీప్యాట్లను 596 చొప్పున అందుబాటులో ఉంచారు. మునుగోడు పరిధిలో 2లక్షల 41వేల 855 మంది ఓటర్లున్నారు. 
 
ఉప ఎన్నికలో అన్ని పోలింగ్ కేంద్రాల్లోనూ వెబ్ కాస్టింగ్ ఏర్పాటు చేశారు. యాప్ ద్వారా ప్రతి గంటకూ నేరుగా పోలింగ్ కేంద్రం నుంచి ఓటింగ్ శాతం నమోదవుతుందని తెలిపారు. మునుగోడు నియోజకవర్గంలో బయటవారు ఉండకుండా ఫంక్షన్ హాళ్లు, హోటళ్లు, ఇతర ప్రాంతాలలో విస్తృత తనిఖీలు చేస్తున్నారు.
 నియోజకవర్గ సరిహద్దుల్లో 100 చెక్ పోస్టులు చేశారు. ఎన్నికలకు సంబంధించి పెద్ద మొత్తంలో ఎస్‌ఎంఎస్‌లపై నిషేధం విధించడంతోపాటు సామాజిక మాధ్యమాల్లో జరుగుతున్న ప్రచారంపై ఎన్నికల సంఘం ఆరా తీస్తుంది. సమస్యాత్మకమైనవిగా గుర్తించిన 105 పోలింగ్ కేంద్రాలపై ప్రత్యేక దృష్టి సారించారు.
 ఎన్నికల విధుల కోసం 3,366 మంది రాష్ట్ర పోలీసులను వినియోగించారు. 15 కంపెనీల కేంద్ర బలగాలు కూడా నియోజకవర్గానికి వచ్చాయి. అన్ని పోలింగ్ కేంద్రాల వద్ద కేంద్ర బలగాలు, రాష్ట్ర పోలీసులు ఉండేలా ప్రణాళిక రూపొందించారు.
మండలానికి రెండు చొప్పున 14 ఫ్లయింగ్ స్క్వాడ్స్, 14 స్టాటిక్ సర్వైలెన్స్ టీంలు, మరో 14 వీఎస్‌టీ బృందాలు పని చేయనున్నాయి. ఎన్నికల ప్రవర్తనా నియమావళి అమలు, పర్యవేక్షణ కోసం 7 మండలాలు, 2 మున్సిపాల్టీలకు ఒకటి చొప్పున తొమ్మిది బృందాలు ఏర్పాటు చేశారు. మొత్తం 51 బృందాలు పర్యవేక్షణలో ఉండనున్నాయి.