ప్రధాన రవాణా విమానాల ఉత్పత్తిదారునిగా భారత్ 

భారతదేశం ఇప్పుడు రవాణా విమానాల ఉత్పత్తిలో ప్రధాన దేశంగా మారుతుందని, భారత వైమానిక దళం కోసం సి-295 మీడియం రవాణా విమానాల తయారీ కేంద్రానికి శంకుస్థాపన చేసిన అనంతరం ప్రధాని నరేంద్ర మోదీ తెలిపారు.  తమ ప్రభుత్వ విధానాలు “స్థిరంగా, ఊహాజనితంగా, భవిష్యత్తుకు అనుగుణంగా” ఉన్నందున తయారీ రంగంతో సహా భారతదేశం వేగవంతమైన ఆర్థిక వృద్ధిని సాధిస్తోందని ప్రధాని చెప్పారు.

మన దేశంలో ప్రైవేటు రంగంలో తొలి విమానాల తయారీ కర్మాగారానికి ప్రధాని ఆదివారం గుజరాత్ లోని వడోదరలో శంకుస్థాపన చేశారు. టాటా-ఎయిర్‌బస్ కన్సార్షియం దీనిని ఏర్పాటు చేస్తోంది. స్వయం సమృద్ధ భారత దేశం (ఆత్మనిర్భర్ భారత్) దిశగా ఇది మరొక ముందడుగు అని బీజేపీ వర్గాలు చెప్తున్నాయి.

త్వరలో మేకిన్ ఇండియా ట్యాగ్ తో తయారు చేయబడిన విమానాలు అందుబాటులోకి వస్తాయని ఈ సందర్భంగా ప్రధాని చెప్పారు. గుజరాత్ లో తయారు చేయబడే విమానాలు సైన్యానికి కొత్త శక్తిని అందించడమే కాకుండా, విమానాల తయారీలో కొత్త నిర్మాణ వ్యవస్థను కూడా అభివృద్ధి చేస్తాయని పేర్కొన్నారు.

‘మేక్-ఇన్-ఇండియా’, ‘మేక్-ఫర్ వరల్డ్’ విధానంతో భారతదేశం తన బలాన్ని మరింత పెంచుకుంటోందని, దేశం ప్రపంచవ్యాప్తంగా ప్రధాన తయారీ కేంద్రంగా ఆవిర్భవించిందని ప్రధాని విశ్వాసం వ్యక్తం చేశారు. దేశంలో తొలిసారి మిలిటరీ రవాణా విమానాల తయారీకి శ్రీకారం చుట్టామని.. స్వావలంబన దిశగా ఇది భారీ ముందడుగు అని పేర్కొన్నారు. 
దేశంలో అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్నరంగంలో విమానయాన రంగం ఒకటని చెబుతూ త్వరలో ఎయిర్ ట్రాఫిక్ పరంగా టాప్ 3 దేశాల జాబితాలోకి భారత్ ప్రవేశించబోతోందని ప్రధాని ప్రకటించారు. రాబోయే పదేండ్లల్లో దేశానికి 2 వేలకు పైగా కార్గో విమానాలు అవసరమవుతాయని మోదీ వెల్లడించారు.

రక్షణలో స్వావలంబన కోసం భారతదేశపు అన్వేషణలో ఈ సందర్భాన్ని ఒక మైలురాయిగా రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ అభివర్ణించారు.

భారత వాయు సేనను ఆధునికీకరించాలనే లక్ష్యంతో ఈ కంపెనీని ఇక్కడ ఏర్పాటు చేస్తున్నారు. ఈ ప్రాజెక్టు కోసం రూ.21,935 కోట్లు ఖర్చవుతుందని అంచనా. ఇక్కడ సీ-295 విమానాలను తయారు చేస్తారు. మోదీ శనివారం ఇచ్చిన ట్వీట్‌లో, వైమానిక రంగానికి సంబంధించిన తదుపరి తరం మౌలిక సదుపాయాలకు కేంద్రంగా ఈ కంపెనీ ఉంటుందని తెలిపారు. 

టాటా అడ్వాన్స్‌డ్ సిస్టమ్స్ లిమిటెడ్, స్పెయిన్‌కు చెందిన ఎయిర్‌బస్ డిఫెన్స్ అండ్ స్పేస్ కలిసి ఈ ప్రాజెక్టును చేపట్టాయి. సీ-295 విమానాల కోసం గత ఏడాది ఎయిర్‌బస్ డిఫెన్స్ అండ్ స్పేస్‌తో భారత ప్రభుత్వం ఒప్పందం కుదుర్చుకుంది. రూ.21,000 కోట్లతో 56 విమానాలను కొనాలని నిర్ణయించింది.

వీటిలో 16 విమానాలు స్పెయిన్ నుంచి వస్తాయి. మిగిలిన 40 విమానాలు వడోదరలో ఏర్పాటు చేస్తున్న కంపెనీలో తయారవుతాయి.  సి-295 విమానాలు అడ్వాన్స్‌డ్‌ ల్యాండింగ్‌ గ్రౌండింగ్స్‌ (ఏఎల్‌జీ) నుంచే గాక సిద్ధంగాని రన్‌వేల పైనుంచీ రాకపోకలు కొనసాగించగలవు. ఐరోపా వెలుపల ఈ విమానాన్ని తయారుచేయబోవడం ఇదే ప్రథమం.