ఉమ్మడి పౌరస్మృతి అమలు ఆలోచనలో గుజరాత్

గుజరాత్‌ లోని బీజేపీ ప్రభుత్వం రాష్ట్రంలో ఉమ్మడి పౌరస్మృతి అమలు చేసే దిశలో చర్యలు చేపడుతున్నది.  ఈ విషయమై ఓ కమిటీ ఏర్పాటుకు మంత్రివర్గం శనివారం ఆమోదం తెలిపింది. 

దీనిపై మీడియా సమావేశంలో ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి భూపేంద్ర పటేల్‌ మాట్లాడుతూ యుసిసి అమలుకు రిటైర్ట్‌ సుప్రీంకోర్టు/హైకోర్టు న్యాయమూర్తి నేతృత్వంలో ఓ ఉన్నతస్థాయి కమిటీని ఏర్పాటు చేయాలనే ప్రతిపాదనకు కేబినెట్‌ ఆమోదం పొందిందని తెలిపారు. ఈ కమిటీ అన్ని అంశాలను పరిగణనలోకి తీసుకుని యూసీసీపై ముసాయిదాను సిద్ధం చేస్తుందని ఆయన చెప్పారు.

త్వరలో గుజరాత్ అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్ విడుదల కానున్న నేపథ్యంలో క్యాబినెట్ ఈ నిర్ణయం తీసుకోవడం ప్రాధాన్యం సంతరించుకుంది. రిటైర్డ్ హైకోర్టు న్యాయమూర్తి నేతృత్వంలో ఏర్పాటు కానున్న కమిటీలో ముగ్గురు నుంచి నలుగురు సభ్యులు ఉంటారని కేంద్ర మంత్రి పర్సోత్తమ్ రూపాల తెలిపారు. 

ఉమ్మడి పౌర  స్మృతి అమలులోకి వస్తే పౌరులందరికీ సమాన హోదా లభిస్తుందని, మతం లేదా లింగం ప్రాతిపదికన ఎటువంటి వివక్షత ఉండబోదని ఈ సందర్భంగా కేంద్ర మంత్రి రూపాల చెప్పారు.  యుసిసి అమల్లోకి వస్తే వివాహం, ఆస్తి, వారసత్వ హక్కులకు సంబంధించి అన్ని మతాల ప్రజలకు ఒకే చట్టం అమల్లోకి వస్తుంది. 

ఇప్పటికే ఉత్తరాఖండ్‌, హిమాచల్‌ ప్రదేశ్‌ రాష్ట్రాల్లోనూ యూసిసిని అమలు చేస్తామని అక్కడి బిజెపి ప్రభుత్వాలు ప్రకటించాయి. ఈ ఏడాది అధికారంలోకి రాగానే ఉత్తరాఖండ్‌ బిజెపి ప్రభుత్వం యుసిసి హామీ అమలుకు చర్యలు చేపట్టింది. ఉత్తరాఖండ్‌ సిఎం పుష్కర్‌ సింగ్‌ ధామి ముఖ్యమంత్రి బాధ్యతలు చేపట్టిన మరుసటిరోజే యుసిసి అమలుకు నిపుణులతో కూడిన హైపవర్‌ కమిటీని ఏర్పాటు చేశారు.