ఉగ్రవాదుల అత్యాధునిక సాంకేతికతో పెను ముప్పు 

ఉగ్రవాద కార్యకలాపాల కోసం అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగిస్తుండటం వల్ల పెను ముప్పు పొంచి ఉందని భారత్ శనివారం హెచ్చరించింది. రకరకాల టెక్నాలజీలు నేడు చౌకగా, సిద్ధంగా అందుబాటులో ఉంటున్నాయని పేర్కొంది.

ఆర్థికాభివృద్ధికి, అసమానతలను తగ్గించడానికి నూతన టెక్నాలజీలు దోహదపడుతున్నాయని, అదే సమయంలో పెను సవాళ్ళను కూడా విసురుతున్నాయని తెలిపింది. ఐక్య రాజ్య సమితి భద్రతా మండలి కౌంటర్ టెర్రరిజం కమిటీ సమావేశాలు శుక్రవారం నుంచి భారత్ లో  జరుగుతున్నాయి.

ఐక్య రాజ్య సమితికి భారత దేశ శాశ్వత ప్రతినిధి రుచిర కాంబోజ్ శనివారం న్యూఢిల్లీలో జరిగిన ఈ సమావేశాల్లో మాట్లాడుతూ, నూతన, అభివృద్ధి చెందుతున్న సాంకేతిక పరిజ్ఞానం ఆర్థికాభివృద్ధికి, అసమానతలను తగ్గించడానికి దోహదపడటంతోపాటు, అత్యవసరంగా దృష్టి సారించి, చర్యలు తీసుకోవలసిన చాలా సవాళ్ళను కూడా విసురుతున్నట్లు తెలిపారు.

ఉగ్రవాద ప్రయోజనాల కోసం నూతన టెక్నాలజీలను ఉపయోగిస్తుండటం పెరుగుతోందని ఆమె గుర్తు చేశారు. వేర్వేరు టెక్నాలజీలు కారుచౌకగా, అందరికీ సిద్ధంగా అందుబాటులో ఉంటుండటం వల్ల ఉగ్రవాదులు వాటిని వాడుతున్నారని ఆమె చెప్పారు. కరోనా మహమ్మారి సమయంలో ఆన్‌లైన్ కార్యకలాపాలు పెరగడం వల్ల ఉగ్రవాదులు తమ విషపూరిత కథనాలను వ్యాపింప చేయడానికి అవకాశం చిక్కిందని ఆమె తెలిపారు.

వారు తమ ప్రచారానికి పదును పెట్టడానికి, మరీ ముఖ్యంగా యువత, బాలలను లక్ష్యంగా చేసుకుని ప్రచారం చేయడానికి అవకాశం దొరికిందని ఆమె పేర్కొన్నారు. గేమింట్ ప్లాట్‌ఫామ్స్‌ను కూడా ఉగ్రవాదులు వాడుకుంటున్నారని ఆమె చెప్పారు.

విదేశాంగ మంత్రి సుబ్రహ్మణ్యం జైశంకర్ మాట్లాడుతూ, ఉగ్రవాదం ముప్పు పెరుగుతోందని, ఈ జాఢ్యాన్ని నివారించేందుకు రెండు దశాబ్దాల నుంచి ఐక్య రాజ్య సమితి చెప్పుకోదగ్గ కృషి చేస్తున్నప్పటికీ, అది మరింతగా విస్తరిస్తోందని తెలిపారు. ఈ టెక్నాలజీలు ప్రభుత్వాలకు, రెగ్యులేటరీ వ్యవస్థలకు నూతన సవాళ్లను విసురుతున్నాయని ఆయన చెప్పారు.

ఉగ్రవాద నిరోధం లక్ష్యంగా ఆంక్షలను విధిస్తోందని పేర్కొంటూ ఉగ్రవాదాన్ని ప్రభుత్వ నిధులతో నడిచే వ్యవస్థగా మార్చిన దేశాలను ఎత్తి చూపేందుకు ఈ కృషి దోహదపడుతోందని ఆయన చెప్పారు. ఇటువంటి కృషి జరుగుతున్నప్పటికీ ఉగ్రవాదం పెరుగుతూనే ఉందని విచారం వ్యక్తం చేశారు. ముఖ్యంగా ఆసియా, ఆఫ్రికా దేశాల్లో ఉగ్రవాదం విస్తరిస్తోందని ఆయన చెప్పారు.

ఐరాస కౌంటర్ టెర్రరిజం ట్రస్ట్‌కు భారత దేశం ఈ ఏడాది 5 లక్షల డాలర్లను అందజేస్తుందని విదేశాంగ మంత్రి ప్రకటించారు. ఉగ్రవాదంపై పోరాటంలో సభ్య దేశాల సత్తాను పెంచేందుకు సహాయపడటం కోసం ఈ నిధులను ఇస్తామని ఆయన తెలిపారు.

ఐక్య రాజ్య సమితి భద్రతా మండలికి భారత దేశ నాయకత్వం నూతన, అభివృద్ధి చెందుతున్న టెక్నాలజీ పట్ల ప్రధానంగా దృష్టి సారిస్తుందని ఐరాస భద్రతా మండలి కౌంటర్ టెర్రరిజం కమిటీ చీఫ్ డేవిడ్ స్చరియా  కొనియాడారు.  ముఖ్యమైన సమస్యగానూ, ప్రధానంగా దృష్టి సారించవలసిన అంశంగానూ నూతన, అభివృద్ధి చెందుతున్న టెక్నాలజీని చూస్తుందని తెలిపారు.

ఉగ్రవాదం వల్ల సవాళ్ళను ఎదుర్కొంటున్నప్పటికీ, ప్రపంచం మొత్తానికి ఉగ్రవాద సమస్య ఉండకూడదనే లక్ష్యంతో అంతర్జాతీయ పరిష్కారాలపై దృష్టి పెట్టినందుకు భారత్‌కు ఆయన ధన్యవాదాలు తెలిపారు. ఇది చాలా అద్భుతమైన విషయమని అంటూ ఈ సమస్యలను ఏ విధంగా ఎదుర్కొనబోతున్నదీ తెలిపే ప్రకటనను ఈ సమావేశాల అనంతరం విడుదల చేస్తామని చెప్పారు.

ఉగ్రవాదులు నూతన, అభివృద్ధి చెందుతున్న టెక్నాలజీలను ఉపయోగించుకుంటుండటంపై అత్యున్నత స్థాయిలో ఈ సమావేశాల్లో చర్చించడం చాలా గొప్ప విజయమని ఆయన చెప్పారు.