మంత్రి జగదీశ్రెడ్డికి కేంద్ర ఎన్నికల సంఘం నోటీసులు

మంత్రి జగదీశ్రెడ్డికి కేంద్ర ఎన్నికల సంఘం నోటీసులిచ్చింది. జగదీశ్రెడ్డి వ్యాఖ్యలపై సీఈసీకి బీజేపీ నేత కపిలవాయి ఫిర్యాదు చేశారు. ఈ నెల 25న మునుగోడు ప్రచారంలో మాట్లాడిన జగదీశ్  టీఆర్ఎస్ కు ఓటు వేయకపోతే సంక్షేమ పథకాలు నిలిపివేస్తామని హెచ్చరించారు. 

ఇది ఎన్నికల ప్రవర్తనా నియమావళి ఉల్లంఘన కిందకి వస్తుందని కేంద్ర ఎన్నికల సంఘానికి దిలీప్‌ కుమార్‌ ఫిర్యాదు చేశారు. జిల్లా ఎన్నికల అధికారి కూడా జగదీశ్  రెడ్డి ప్రసంగం నోట్ ను సీఈసీకి పంపారు. వీటన్నింటినీ పరిగణలోకి తీసుకున్న ఈసీ .. ప్రాథమికంగా మంత్రి జగదీశ్ రెడ్డి ఎన్నికల ప్రవర్తనా నియమావళిని ఉల్లంఘించినట్లు అభిప్రాయపడింది. జగదీశ్రెడ్డి వ్యాఖ్యలపై వాస్తవిక నివేదిక అందించాలని, రాష్ట్ర ఎన్నికల అధికారికి కేంద్ర ఎన్నికల సంఘం సూచించింది.

గురువారం జగదీశ్రెడ్డి వ్యాఖ్యలపై వాస్తవిక నివేదికను ఎస్ఈసీ అందించింది. నివేదిక ఆధారంగా ఆయనకు సీఈసీ నోటీసులు ఇచ్చింది. శుక్రవారం  మధ్యాహ్నం 3 గంటల లోపు వివరణ ఇవ్వాలని జగదీశ్రెడ్డికి ఈసీ ఆదేశించింది.  ఎన్నికల నియమావళిని మంత్రి ఉల్లంఘించారని ఈసీ నోటీసుల్లో పేర్కొంది.

సంక్షేమ పథకాలు కావాలంటే టీఆర్‌ఎస్‌కు, వద్దనుకుంటే బీజేపీకి ఓటు వేయాలని జగదీశ్‌ రెడ్డి మునుగోడు ప్రజలకు సూచించారు.  ‘ఈ ఎన్నిక కూసుకుంట్ల ప్రభాకర్‌రెడ్డి, రాజగోపాల్‌రెడ్డి మధ్య జరుగుతున్నది కాదు. సంక్షేమ పథకాలు కావాలా.. వద్దా..అన్న ఆంశపై జరుగుతున్న ఎన్నిక’ అని చెప్పారు మంగళవారం టీఆర్‌ఎస్‌ అభ్యర్థి కూసుకుంట్ల ప్రభాకర్‌రెడ్డితో కలిసి జగదీశ్‌రెడ్డి రోడ్‌షోలో పాల్గొన్నారు. ‘

గుజరాత్‌లో వ్యవసాయబావులకు మోటర్లు బిగించడంతో రైతులకు నెలకు రూ.1,500 బిల్లు వస్తోంది. ఇక్కడ కూడా అలాగే కావాలంటే బీజేపీకి ఓటు వేసుకోవచ్చు’ అని విమర్శించారు. రైతు బీమా కావాలంటే టీఆర్ఎస్ కు ఓటేయాలని చెబుతూ మునుగోడులో రాజగోపాల్ రెడ్డిని  గెలిస్తే టీఆర్ఎస్ ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు ఆగిపోతాయని స్పష్టం చేశారు.