టపాసుల దుకాణం అగ్నిప్రమాదంలో ఇద్దరు సజీవ దహనం

విజయవాడ నగరంలోని గాంధీనగర్ జింఖానా గ్రౌండ్స్‌లోని టపాసుల దుకాణంలో జరిగిన అగ్నిప్రమాదంలో ఇద్దరు సజీవ దహనమయ్యారు. ఆదివారం ఓ దుకాణంలో టపాసు పేలింది. దీంతో షాపులో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి.
మంటలకు బాణా సంచా పేలి పెద్ద ఎత్తున శబ్దం వచ్చింది. దీంతో చుట్టుప్రక్కల నివాసితులు భయంతో ఇళ్లల్లో నుంచి‌ బయటకి పరుగులు పెట్టారు. సమాచారం అందుకున్న పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది హుటాహుటిన సంఘటన ప్రదేశానికి చేరుకుని మంటలను అదుపు చేయడంతో పెద్ద ప్రమాదం తప్పింది.
ఈ ప్రమాదంలో మూడు షాపులు పూర్తిగా అగ్నికి ఆహుతి అయ్యాయి. ఏ మాత్రం ఆలస్యం అయినా ఇరవై షాపులు దగ్ధం అయ్యేవని, పక్కనే పెట్రోల్ బంక్ కూడా ఉండటంతో స్థానికులు ఆందోళన వ్యక్తం చేశారు. నాలుగు ఫైరింజన్లతో అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపు చేశారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
కాగా జింఖాన గ్రౌండ్స్‌లో క్రాకర్ షాపులకు అనుమతులపై స్థానికులు పలు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. సమీపంలోనే పెట్రోల్ బంక్ ఉంటే అనుమతులు ఎలా ఇస్తారంటూ ప్రశ్నిస్తున్నారు. దుకాణాల యజమానులతో అగ్నిమాపక శాఖ, పోలీస్ శాఖ కుమ్మక్కైన కారణంగానే అనుమతులు ఇచ్చారంటూ విమర్శిస్తున్నారు.
వినాయక చవితికి పలు ఆంక్షలు విధించిన పోలీసులు బాణాసంచా దుకాణాలు ఏర్పాటుపై నిబంధనలను ఏమయ్యాయని ప్రశ్నిస్తున్నారు. అగ్ని ప్రమాదంలో ఇద్దరు మృతి చెందటానికి అగ్నిమాపక, పోలీస్ శాఖ నిర్లక్ష్యమే ప్రధాన కారణమని ఆరోపించారు.
బాణాసంచా నిప్పురవ్వలు పక్కన పెట్రోల్ బంక్ మీద పడి ఉంటే మరింత విపత్తు జరిగే పరిస్థితి ఏర్పడేదని స్థానికులు అంటున్నారు. అగ్నిమాపక సిబ్బంది. మృతులను పటాకుల దుకాణంలో పనిచేసే సిబ్బందిగా గుర్తించారు పోలీసులు. ఈ ఘటనపై కేసు నమోదుచేసి దర్యాప్తు చేస్తున్నారు పోలీసులు.