పెనుకొండలో పురావస్తు శాఖ తవ్వకాలు చేపట్టాలి

విజయనగర సామ్రాజ్య రెండో రాజధాని పెనుకొండ పట్టణంలోని వై.ఎస్.ఆర్. కాలనీలో ”సతి స్మారకశీల’ దొరికిన పరిసరాల్లో రాష్ట్ర పురావస్తు శాఖ తవ్వకాలు చేపట్టాలని చారిత్రక పరిశోధకుడు మైనాస్వామి విజ్ఞప్తి చేశారు.  ఇంటి నిర్మాణం కోసం తప్పినప్పుడు క్రీ.శ.15వ శతాబ్దం నాటి స్మారక శిల బయట పడిన ప్రదేశాన్ని పెనుకొండ విశ్వహిందూ పరిషత్ కార్య వర్గ సభ్యులతో కలిసి మైనస్వామి సందర్శించారు. 
 
వీరగల్లులు, సతి స్మారక శిలలు శివాలయంలోపల లేదా పరిసరాల్లో ఎక్కువగా వుంటాయి. యుద్ధంలో మరణించిన వీరుల, గ్రామ- నగర రక్షణ విధుల్లో భాగంగా జరిగిన పోరాటంలో ప్రాణాలు పోగొట్టుకొన్న వారి జ్ఞాపకార్ధం ‘వీరగల్లు’లను ప్రతిష్టించి, వాటిపై శాసనాలు చెక్కిస్తారని చారిత్రక పరిశోధకుడు వివరించారు. 
 
పోరాటంలో మరణించిన వీరుని భార్య ‘ సతీ సహగమనం’ ద్వారా భర్త చితి మంటల్లోకి దూకి ప్రాణత్యాగం చేసిన వీరవనిత స్మృతి కోసం వెలసిందే  పెనుకొండలో లభించిన ‘సతి స్మారక శిల’ అని మైనాస్వామి తెలిపారు. సతి శిలలు -అరుదుగా వుంటాయని ఆయన పేర్కొన్నారు. తవ్వకాలు జరిపితే మారిన్ని విషయాలు వెలుగులులోకి వస్తాయని ఆయన విశ్వాసం వ్యక్తం చేశారు. 
 
శాసనంలో 3 భాషలు
పెనుకొండలో దొరికిన ‘సతి స్మారక శిల’ శ్రీ. శ. 1433 ప్రమాదీచ సంవత్సరానికి చెందినదని, అందులతో సంస్కృతం, కన్నడం, తెలుగు భాషలుండడం అరుదైన విషయమని మైనాస్వామి చెప్పారు. ‘నమస్తుంగ శరశ్చంద్ర .. చారవే ‘ అనే శివస్తుతి సంస్కృత శ్లోకంతో శాసనం మొదలయింది. శాసనంలోని భాషలు, పదాలు ఆసక్తిగా వున్నాయి. 
 
విజయనగర సామ్రాజ్యాన్ని రెండవ దేవరాయలు (క్రీ.శ. 1424-1446) పాలిస్తున్న కాలంలో సంస్కృతం, తెలుగు, కన్నడం భాషలకు విశేష ఆదరణ లభించినట్టు శాసనం ద్వారా తెలుస్తున్నదని పరిశోధకుడు విశ్లేషించారు. సతిశీలను మ్యూజియంలో భద్ర పరచాలని ఆయన కోరారు.