ఏదో ఒక వంకతో ఎన్నికలను ఆపాలని టీఆర్‌ఎస్ కుట్ర

ఇండిపెండెంట్లకు సంబంధించిన 8 గుర్తులను రద్దు చేయాలని టీఆర్‌ఎస్ వేసిన పిటిషన్‌ను గౌరవ న్యాయస్థానం కొట్టేయడంపై బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు బండి సంజయ్ (హర్షం వ్యక్తం చేశారు. మునుగోడు ఉప ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న ఆయన యారాగండ్లపల్లిలో మాట్లాడుతూ న్యాయం ఎప్పుడూ ప్రజల పక్షాన ఉంటుందని స్పష్టం చేశారు.

మునుగోడు ఉప ఎన్నికల్లో ఒడిపోతామన్న భయంతో ఎదో ఒక వంకతో ఎన్నికలను ఆపాలని టీఆర్ఎస్ కుట్ర చేస్తోందని ఆయన ఆరోపించారు. టీఆర్ఎస్ ఎన్ని కుట్రలు చేసినా చివరకు న్యాయం గెలుస్తుందని, మునుగొడులో బీజేపీ గెలుస్తుందని ధీమా వ్యక్తం చేశారు. బీజేపీకి న్యాయస్థానంపై గౌరవం ఉందని తెలిపారు

 ఈ గుర్తులు టీఆర్ఎస్ పార్టీ పుట్టినప్పటి నుంచి ఉన్నాయని చెబుతూ ఇన్నాళ్లు లేని అభ్యంతరం ఇప్పుడేమి వచ్చిందో అని సంజయ్ నిలదీశారు. బీజేపీ అభ్యర్థి   రాజగోపాల్ రెడ్డితోనే మునుగోడు అభివృద్ధి జరుగుతుందని స్పష్టం చేశారు. మర్రిగూడెం అభివృద్ధికి ఎన్ని నిధులు కేటాయించారో చెప్పాలని సవాల్ చేశారు.  ఇందుకు తాను చర్చకు సిద్ధమని ప్రకటించారు.

రాజగోపాల్ రెడ్డి ఒక్క రాజీనామాతో ప్రభుత్వం దిగి వచ్చిందని పేర్కొంటూ గట్టుప్పల్ మండల ప్రకటన, 100 పడకల ఆసుపత్రి తిరిగి ఇక్కడకు వచ్చిందని చెప్పారు. అలాగే ఆసర పెన్షన్ ల తో పాటు ప్రభుత్వం ఎన్నో కేటాయిస్తోందని గుర్తు చేశారు.

ముఖ్యమంత్రిని ఫాంహౌస్ నుంచి బయటకు తీసుకొచ్చిన ఘనత రాజగోపాల్ రెడ్డికి దక్కుతుందని అంటూ 16 మంది మంత్రులు, 88 మంది ఎమ్మెల్యేలు, ఇతర ప్రజా ప్రతినిధులు మునుగోడులో మకాం వేశారని వివరించారు.  ఇంతమంది గతంలో ఇక్కడకు వచ్చారా? అని నిలదీశారు. ఫ్లోరైడ్ సమస్యకు పరిష్కారానికి గత ప్రధాని వాజ్ పేయి కృషి చేశారని వెల్లడించారు. నవంబర్ 3న జరిగే ఎన్నికల్లో బీజేపీకి ఓటు వేయాలని కోరారు.

సీఎం కేసీఆర్ అన్యాయాలను కమ్యూనిస్టులు సపోర్ట్ చేస్తున్నట్లే అని  సంజయ్‌ స్పష్టం చేశారు. సీఎం కేసీఆర్‌కు దమ్ముంటే టీఆర్‌ఎస్‌లో చేరిన కాంగ్రెస్ ఎమ్మెల్యేలతో రాజీనామా చేయించాలని సవాల్  చేశారు. ఎన్నికలకు మేం సిద్ధం.. కేసీఆర్ సిద్ధమా? అని  ప్రశ్నించారు. నియోజకవర్గ సమస్యలపై చర్చించేందుకు రాజగోపాల్‌కు కేసీఆర్ సమయం ఇవ్వలేదని నిలదీశారు.  తెలంగాణలో రామరాజ్యం తెస్తామని బండి సంజయ్‌ తెలిపారు.

 

బంగారు తెలంగాణ బీజేపీతోనే సాధ్యం

సీఎం కేసీఆర్ సంక్షేమ పథకాలు అమలులో విఫలమయ్యారని బీజేపీ తెలంగాణ రాష్ట్ర వ్యవహారాల ఇన్‌చార్జి తరుణ్ చుగ్ విమర్శించారు. కుటుంబ పాలన వల్లే రాష్ట్రంలో అభివ‌ృద్ధి కుంటుపడిందని ఆరోపించారు. ఢిల్లీలో మాజీ ఎంపీ బూర నరసయ్య గౌడ్ తరుణ్ చుగ్‌ను కలిసిన సందర్భంలో   ఎనిమిది సంవత్సరాలు కుటుంబ పాలన వల్ల తెలంగాణ వెనకబడింద ని తెలిపారు.
 
ఓబీసీ, డబుల్ బెడ్ రూమ్, దళిత బంధు, ఏ ఒక్క పథకాన్ని తెలంగాణలో సరిగ్గా అమలు చేయలేదని విమర్శించారు . తెలంగాణ దేనికోసం ఏర్పడిందో ఆ కలను కేసీఆర్ నెరవేర్చలేదని అంటూ మహిళలు , యువకులు, డాక్టర్లు, ప్రభుత్వ ఉద్యోగులు, నిరుద్యోగులు, ప్రజలు తెలంగాణలో ఇబ్బందులు పడుతున్నారని చెప్పారు. “తెలంగాణ అభివృద్ధి కోసం పాటుపడే ప్రతి ఒక్కరిని పార్టీలో ఆహ్వానిస్తున్నాం. బంగారు తెలంగాణ బీజేపీతోనే సాధ్యం’’ అని తెలిపారు.