బీజేపీ కార్యకర్తలకు ప్రగతి భవన్ నుంచి ఫోన్లు

టీఆర్ఎస్ మీద ప్రజల్లో వ్యతిరేకత ఉందని,అందుకే ఆ పార్టీ తొండి ఆట ఆడుతోందని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి విమర్శించారు. బీజేపీ కార్యకర్తలకు ప్రగతి భవన్ నుంచి ఫోన్లు వెళ్తున్నాయని,  బీజేపీ నేతల వెంట మంత్రులు తిరిగి బెదిరింపులకు పాల్పడుతున్నారని ఆయన ఆరోపించారు. లేదంటే విహార యాత్రలకు వెళ్ళడానికి అయ్యే ఖర్చు మొత్తం తామే భరిస్తామంటూ ప్రలోభాలకు గురిచేస్తున్నారని మండిపడ్డారు.
 
అంగట్లో గొర్రెలను కొన్నట్టు అనేక గ్రామాల్లో అన్ని పార్టీల సర్పంచ్ లకు డబ్బులు ఇస్తున్నారని కేంద్ర మంత్రి ఆరోపించారు. మునుగోడులో ఊరికొక ఎమ్మెల్యేను పెట్టి ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేస్తున్నారని ధ్వజమెత్తారు. గ్రామాల్లో మంత్రులు తిష్టవేసి నేరుగా ఓటర్లకు లిక్కర్, చికెన్, మటన్ పంపిణీ చేస్తున్న పరిస్థితి నెలకొందని పేర్కొన్నారు.
 
ప్రభుత్వం ఎన్ని వందల కోట్లు ఖర్చు చేసినా. ఎన్ని అడ్డదారులు తొక్కినా సరే ప్రజలు మార్పు కోరుకొని టీఆర్ఎస్ ను ఓడిస్తారని కిషన్ రెడ్డి స్పష్టం చేశారు.  కాంగ్రెస్ ప్రచారం బాగా జరగాలన్న విధానంతో టీఆర్ఎస్ సహకరిస్తోందని తద్వారా వ్యతిరేక ఓటు చీల్చి లాభపడాలని చూస్తోందని కిషన్ రెడ్డి విమర్శించారు.  టీఆర్ఎస్, కాంగ్రెస్ దొందు దొందేనని అంటూ ఎవరికి ఓటేసినా ఒకటేని హెచ్చరించారు.
 
తెలంగాణలో రైల్వే పనులు వేగంగా చేయాలని కేంద్ర రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్ ను తాను  కలిసినట్లుగా ఆయన చెప్పారు. రాష్ట్ర ప్రభుత్వ సహకారం లేకపోవడం వల్లే రైల్వే పనులు నత్త నడకన నడుస్తున్నాయన్నారు. ఎంఎంటీఎస్ పేదవారి రైల్…సెకండ్ ఫేజ్ లో రాష్ట్ర ప్రభుత్వం చేసుకున్న ఒప్పందం అమలు చేయడం లేదని ఆయన విమర్శించారు.
 
ఈ అంశాలపై ఎన్ని ఉత్తరాలు రాసినా సీఎం కేసీఆర్ పట్టించుకోవడం లేదన్న కిషన్ రెడ్డి…  రాష్ట్ర ప్రభుత్వం ఆలస్యం వల్ల రూ. 800 కోట్ల ప్రాజెక్టు రూ. 1122 కోట్లకు చేరిందని చెప్పారు. మొత్తం 1300 కిలోమీటర్ల రైల్వే లైన్లు వేయాలని తెలిపారు.

మునుగోడు బీజేపీ నేతకు కేటీఆర్ ఫోన్

ఇలా ఉండగా, మునుగోడు నియోజకవర్గానికి చెందిన బీజేపీ నేత జగన్నాథంతో మంత్రి కేటీఆర్ మాట్లాడిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో  వైరల్ అవుతోంది. మునుగోడులో టీఆర్ఎస్ కు సహకరించాలని మంత్రి కేటీఆర్ ఆయనను  కోరారు. మీరు కొంచెం సహకరిస్తే.. గట్టుప్పల్ ను అభివృద్ధి చేసుకుందామని  కేటీఆర్  ఆయనతో చెప్పారు.
 
రైతుబంధు వందల ఎకరాలున్న భూస్వాములకు ఇవ్వటం కాదు.. వ్యవసాయం చేసే వారికి, కౌలు రైతులకు కూడా ఇవ్వాలని బీజేపీ నేత జగన్నాథం కేటీఆర్ కు సూచించారు.
 
అయితే, మంత్రి కేటీఆర్ ఫోన్ చేసినప్పటికీ పార్టీకి మోసం చేసే ప్రసక్తే లేదని జగన్నాథం తెలిపారు. బీజేపీని వీడేది లేదని ఆయన తేల్చి చెప్పారు. జగన్నాథం  కమిట్ మెంట్ ను మునుగోడు బీజేపీ స్టీరింగ్ కమిటీ చైర్మన్ వివేక్ వెంకటస్వామి అభినందించారు.  బీజేపీ నేతలను మంత్రులు కొనలేరన్నారు. బీజేపీ లీడర్లను కొనడానికి మంత్రులు ప్రయత్నిస్తున్నారనటానికి ఇది నిదర్శనమని వివేక్ వెంకటస్వామి తెలిపారు.