రాజకీయాలు చేస్తున్న న్యాయమూర్తులు

న్యాయమూర్తులు తమ తమ ఉద్యోగాలను వదిలేసి రాజకీయాలు చేస్తున్నారని  కేంద్ర న్యాయశాఖ మంత్రి కిరణ్‌ రిజిజు ఆవేదన వ్యక్తం చేశారు. కొలీజియం ద్వారా జరుగుతున్న జడ్జిల నియామక ప్రక్రియలో సంస్కరణలు  రావాలని ఆయన స్పష్టం చేశారు.  అహ్మదాబాద్‌లో జాతీయ హిందీ వార పత్రిక పాంచజన్య నిర్వహించిన ‘సాబర్మతి సంవాద్‌’ కార్యక్రమంలో పాల్గొని ప్రసంగిస్తూ కిరణ్‌ రిజిజు ఈ వ్యాఖ్యలు చేశారు.
 
మనకు రాజ్యాంగం పవిత్రమైన  పత్రం అని పేర్కొంటూ  కార్యనిర్వాహక, శాసన, న్యాయ వ్యవస్థలు ఉండగా, మొదటివి తమ విధులు నిర్వహిస్తూ  ఉంటె, మూడో వ్యవస్థ వాటిని మెరుగు పరచాలని ఆయన తెలిపారు. అయితే న్యాయవ్యవస్థను మెరుగు పరచే వ్యవస్థ లేదని ఆయన విచారం వ్యక్తం చేశారు.
 
పలు సందర్భాలలో న్యాయమూర్తులు తమ పరిధులు అధిగమించి క్షేత్రస్థాయి వాస్తవాలు, ఆచరణలో ఎదురయ్యే ఇబ్బందులు, ఆర్ధిక సమస్యలను తెలుసుకోకుండా కార్యనిర్వాహక వ్యవస్థ చేసే విధులు నిరవహించే ప్రయత్నం చేస్తుంటారని కేంద్ర మంత్రి విచారం వ్యక్తం చేశారు.
 
భారత దేశం పారదర్శకత గల ప్రజాస్వామ్య వ్యవస్థ అని, కొన్ని సార్లు రాజకీయ పార్టీలు సంతృప్తికరణ విధానాలు అవలంభిస్తూ ఉంటాయని చెబుతూ బీజేపీ మాత్రం న్యాయవ్యవస్థను కించపరిచే ప్రయత్నం చేయబోదని స్పష్టం చేశారు.  ఇందిరా గాంధీ హయాంలో ముగ్గురు సీనియర్ న్యాయమూర్తులను కాదని సుప్రీం కోర్ట్ ప్రధాన న్యాయమూర్తిని నియమించారని ఆయన గుర్తు చేశారు. అయితే నరేంద్ర మోదీ ప్రభుత్వం మాత్రం అటువంటి పనులు చేసే ప్రయత్నం చేయడం లేదని స్పష్టం చేశారు.
న్యాయవ్యవస్థ కార్యకలాపాలు పారదర్శకంగా లేవని పేర్కొంటూ అక్కడ చాలా రాజకీయం జరుగుతున్నదని, ఈ రాజకీయం బయటికి కనిపించదని తెలిపారు, అయితే ఇక్కడ అనేక విభేదాలు, ఫ్యాక్షనిజం కూడా కనిపిస్తున్నదని కేంద్ర మంత్రి  ఆరోపించారు. న్యాయమూర్తులు న్యాయం చేయడానికి బదులు కార్యనిర్వాహకులుగా వ్యవహరించాలని చూస్తే తాము మొత్తం వ్యవస్థనే పునఃపరిశీలించాల్సి ఉంటుందని రిజిజు  హెచ్చరించారు.
 
సుప్రీంకోర్టు కొలీజియం వ్యవస్థలో రాజకీయాలకు తావులేదన్న రిజిజు దేశంలో న్యాయమూర్తుల నియామక ప్రక్రియలో మార్పులు తీసుకురావాల్సిన అవసరం ఉన్నదని అభిప్రాయపడ్డారు. న్యాయమూర్తులే న్యాయమూర్తులను నియమించే ప్రక్రియ ప్రపంచవ్యాప్తంగా ఎక్కడా లేదని, కేవలం మన వద్దనే ఆచరణలో ఉన్నదని చెప్పారు. ఈ విధానాన్ని మార్చాల్సిన అవసరం ఎంతైనా ఉన్నదని పేర్కొన్నారు.భారత రాజ్యాంగం ప్రకారం న్యాయమూర్తులను నియమించడం కేంద్ర ప్రభుత్వం బాధ్యత అని, అయితే 1998లో సుప్రీంకోర్టు కొలీజియం వ్యవస్థను ప్రారంభించిందని కేంద్ర మంత్రి రిజిజు చెప్పారు. దీని ద్వారా జడ్జీలను జడ్జీలే భర్తీ చేస్తున్నారన్నారని  గుర్తు చేశారు.
“మా ప్రభుత్వం  న్యాయమూర్తుల నీయమకంకు జాతీయ జ్యూడిషియల్ నియామక కమీషన్ ను ఏర్పాటు చేస్తే సుప్రీం కోర్ట్ కొట్టివేసినదని ఆయన గుర్తు చేశారు. న్యాయవ్యవస్థను నియంత్రించే వ్యవస్థ లేదని, పైగా `క్రియాశీలక న్యాయవ్యవస్థ’  అనే పదం వాడుతున్నారని ఆయన గుర్తు చేశారు. న్యాయమూర్తులు చేసే పలు వాఖ్యలు వారి తీర్పులలో కనిపించవని పేర్కొన్నారు.

 ఎక్కువ మంది న్యాయమూర్తులు తమ ప్రధాన విధులను వదిలేసి సగం కంటే ఎక్కువ సమయం ఇతర న్యాయమూర్తుల నియామకానికి సంబంధించి నిర్ణయాలు తీసుకోవడం గమనించానని పేర్కొన్నారు. ఇది న్యాయం అందించడం అనే వారి పనిపై ప్రభావం చూపుతుందని చెప్పారు.

అందుకే ఈ విధానంలో మార్పులు రావాల్సిన అవసరం ఉన్నదని  ఆయన స్పష్టం చేశారు. న్యాయమూర్తుల ప్రవర్తనను నియంత్రించేందుకు న్యాయవ్యవస్థ లోనే స్వయం నియంత్రణ ఏర్పాటు జరగాలని కేంద్ర మంత్రి సూచించారు. నేటి సోషల్  మీడియా,కోర్ట్ వ్యవహారాల  ప్రత్యక్ష ప్రసారాల సమయంలో ప్రజలు న్యాయమూర్తులు వ్యవహార తీరును కూడా సమీక్షిస్తారని ఆయన హెచ్చరించారు.