తేజస్వీయాదవ్‌ని మందలించిన ఢిల్లీ కోర్టు

ఐఆర్‌సిటిసి కుంభకోణం కేసులో ఆర్జేడీ నేత, బీహార్‌ ఉపముఖ్యమంత్రి తేజస్వీయాదవ్‌ని ఢిల్లీ రౌస్ ఎవెన్యూ కోర్టు మందలించింది. ఈ  కేసుకు సంబంధించి తేజస్వీ బెయిల్‌ను రద్దు చేయాలన్న సిబిఐ వాదనను కోర్టు తోసిపుచ్చింది. అయితే, బహిరంగ సభల్లో వ్యాఖ్యానించేటపుడు సిబిఐ అధికారుల గౌరవ మర్యాదలకు తగినట్లుగా సరైన పదాలను ఎంపిక చేసుకోవాలని హెచ్చరించింది.

ఉపముఖ్యమంత్రి స్థాయిలో ఉన్నప్పుడు ఇలాంటి ప్రకటనలు చేయాలా? అని ప్రశ్నించింది. ఇకపై ఇటువంటి వ్యాఖ్యలు చేయవద్దని హెచ్చరించింది. ఓ సిబిఐ అధికారిపై ఉత్తరప్రదేశ్‌లో హత్యాయత్నం జరిగిందని సిబిఐ అధికారులు కోర్టుకు తెలిపారు. బెదిరింపుల తర్వాత భయానక వాతావరణం నెలకొందని పేర్కొన్నారు.

ఈ కేసులో దర్యాప్తును ప్రభావితం చేసేందుకు తేజస్వి ప్రయత్నిస్తున్నారని, మీడియా సమావేశంలో సీబీఐ అధికారులను బెదరించారని సీబీఐ ఆరోపిస్తూ ఆయనకిచ్చిన బెయిల్ రద్దు చేయాలని కోర్టును సీబీఐ అశ్రయించింది. దీనిపై మంగళవారంనాడు కోర్టుకు తేజస్వి హాజరయ్యారు. సీబీఐ తరఫు న్యాయవాది డీపీ సింగ్ తన వాదన వినిపిస్తూ, ఈ కేసుకు సంబంధించిన సీబీఐ అధికారి ఒకరు ఇటీవల ప్రమాదానికి గురయ్యారని చెప్పారు. సాక్ష్యం లేనందున దీనిని బెదరింపుగా సీబీఐ భావించలేదని పేర్కొన్నారు.

అయితే, తేజస్వి యాదవ్ ఇటీవల మీడియాతో మాట్లాడిన తర్వాత తమ అధికారులకు తప్పనిసరిగా ముప్పు ఉందనే అభిప్రాయానికి సీబీఐ వచ్చిందన్నారు. ఆ దృష్ట్యా తేజస్వికి మంజూరు చేసిన బెయిల్‌ను రద్దు చేయాలని ఆయన కోర్టును కోరారు.  అయితే బెదిరింపులకు, విమర్శలకు మధ్య స్పష్టమైన తేడా ఉందని తేజస్వీ తరపు న్యాయవాది మనీందర్ సింగ్ కోర్టుకు తెలిపారు. రాజకీయ లక్ష్యంగానే ఆయనపై తప్పుడు కేసులు బనాయించారని పేర్కొన్నారు.

ఇటీవల పాట్నాలో జరిగిన ఓ మీడియా సమావేశంలో తేజస్వీ యాదవ్‌ మాట్లాడుతూ సిబిఐ అధికారులకి కుటుంబం ఉండదా? వారు ఎప్పుడూ సిబిఐ అధికారుల్లాగానే ఉంటారా? వారు పదవీ విరమణ చేయరా? అని ప్రశ్నించారు. మీరు రాజ్యాంగబద్ధ సంస్థ విధులను పాటించాలని హితవు చెప్పారు.