రాజీనామాతో కేసీఆర్ ప్రభుత్వాన్ని మునుగోడుకు రప్పించా

తన రాజీనామాతో కేసీఆర్ ప్రభుత్వాన్ని మునుగోడుకు రప్పించానని మునుగోడు బీజేపీ అభ్యర్థి కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి తెలిపారు. మునుగోడులో ప్రచారం నిర్వహిస్తున్న ఆయన కేసీఆర్ ప్రభుత్వంపై విరుచుకుపడ్డారు. తాను ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు  ఎంత మొత్తుకున్నా సీఎం కేసీఆర్ మునుగోడుకు ఒక్క రూపాయి కూడా ఇవ్వలేదని, అందుకే రాజీనామా చేశానని స్పష్టం చేశారు
 
ఇవాళ తనను ఓడించడానికి టీఆర్ఎస్ ప్రభుత్వానికి చెందిన మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఎమ్మెల్సీలు మునుగోడులో మకాం వేశారని మండిపడ్డారు. తాను రాజీనామా చేయకపోతే  వాళ్లంతా వచ్చేవాళ్లా? మునుగోడుకు ఇన్ని నిధులు మంజూరు అయ్యేవా? అని రాజగోపాల్ రెడ్డి ప్రశ్నించారు. ‘‘నేను రాజీనామా చేయకుంటే మునుగోడు గురించి మాట్లాడేవారే కాదు. నా రాజీనామాతో మునుగోడుకు ప్రభుత్వం కదిలివచ్చింది’’ అని పేర్కొన్నారు.
మునుగోడులో ప్రభుత్వం అభివృద్ధి పనులు చేస్తే ఇప్పుడు ఇంత సైన్యం ఎందుకని ప్రశ్నించారు. అవినీతి సొమ్ముతో  తనను ఓడించాలని కేసీఆర్‌ కుట్రలు చేస్తున్నారని రాజగోపాల్‌రెడ్డి ఆరోపించారు.   ఇవాళ  దేశం మొత్తం మునుగోడు వైపే చూస్తోందని, ఇదంతా తాను రాజీనామా చేయడం వల్లేనని చెప్పారు.   ఈ ఎనిమిదేళ్లలో కేసీఆర్ రాష్ట్రాన్ని దోచుకున్నారని రాజగోపాల్ రెడ్డి ఆరోపించారు. తనను ప్రశ్నిస్తారని భావించిన కేసీఆర్ 12 మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేలను గొర్రెలను కొన్నట్లు కొన్నారని మండిపడ్డారు.
 
నిరుద్యోగ భృతి, డబుల్ బెడ్రూం ఇండ్లు, కేజీ టూ పీజీ, రుణ మాఫీ, సీసీ రోడ్లు, ఉద్యోగాలు అంటూ ఎన్నికల సమయంలో హామీలిచ్చిన కేసీఆర్ గెలిచాక ప్రజలను మోసం చేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. గ్రామానికి 20 ఇండ్లు ఇవ్వలేదు గానీ.  20 బెల్ట్ షాపులు మాత్రం ఇచ్చారని ఎద్దేవా చేశారు. బంగారు తెలంగాణ అంటే ఇదేనా అని ప్రశ్నించారు.
 
మునుగోడు ఉప ఎన్నికలో తనను ఓడించడానికి 100 మంది కౌరవులు వచ్చారని టీఆర్ఎస్ ఎమ్మెల్యేలను ఉద్దేశించి ధ్వజమెత్తాడారు. టీఆర్ఎస్ కండువా కప్పుకోవాలని, లేకుంటే కేసులు పెట్టి జైలులో పెడుతామని బీజేపీ సర్పంచులు, ఎంపీటీసీలను బెదిరిస్తున్నారని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. తాము అధికారంలోకి వచ్చాక కేసీఆర్ ను ఫాంహౌజ్ నుంచి గల్లా పట్టి లాక్కొస్తామని రాజగోపాల్ రెడ్డి హెచ్చరించారు.

సంస్థాన్ నారాయణపురంలో ఉద్రిక్తత

ఇలా ఉండగా, మునుగోడు నియోజకవర్గంలోని సంస్థాన్ నారాయణపురంలో ఉద్రిక్త పరిస్థితి ఏర్పడింది. బీజేపీ నేత బాబుమోహన్ ప్రచారం చేస్తుండగా గొడవ జరిగింది. కాంగ్రెస్, బీజేపీ కార్యకర్తల పోటాపోటీ నినాదాలతో ఉద్రిక్తత నెలకొంది. తమ మైకులను బీజేపీ కార్యకర్తలు గుంజుకున్నారని ఆరోపిస్తూ కాంగ్రెస్ కార్యకర్తలు రోడ్డుపై బైఠాయించారు.

పోలీసులు పక్కనే ఉండి పట్టించుకోలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. పోలీసులకు వ్యతిరేకంగా కాంగ్రెస్ నేతలు నినాదాలు చేశారు. ఈ సందర్భంగా మాట్లాడిన బాబుమోహన్ టీఆర్ఎస్ ప్రభుత్వంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. సీఎం కేసీఆర్ నియోజకవర్గంలో తప్ప అభివృద్ధి ఎక్కడా జరగలేదని ధ్వజమెత్తారు.

కేసీఆర్, ఆయన కొడుకు,  అల్లుడు నియోజకవర్గాల్లోనే అభివృద్ధి పనులు చేసుకుంటున్నారని ఆయన ఆరోపించారు. మునుగోడులో బీజేపీ గెలుస్తుందనే భయం టీఆర్ఎస్ లో కనిపిస్తోందని అంటూ కాంగ్రెస్ కు డిపాజిట్ కూడా దక్కలేదన్నారు. మునుగోడులో గెలుపు కోసం పార్టీలు హోరాహోరీగా ప్రచారం చేస్తున్నాయి. టీఆర్ఎస్ నుంచి కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి, బీజేపీ నుంచి రాజగోపాల్ రెడ్డి, కాంగ్రెస్ నుంచి పాల్వాయి స్రవంతి బరిలో ఉన్నారు. టీఆర్ఎస్ నుంచి పలువురు మంత్రులు, ఎమ్మెల్యేలు అంతా నియోజకవర్గంలోనే ఉంటూ ప్రచారం చేస్తున్నారు.