బిజెపిలోకి టిఆర్ఎస్ మాజీ ఎంపీ బూర నర్సయ్య గౌడ్!

మునుగోడు ఉప ఎన్నిక వేళ టీఆర్ఎస్ పార్టీ సీనియర్ నేత, మాజీ ఎంపీ డా. బూర నర్సయ్య గౌడ్ బీజేపీలో చేరనున్నారని తెలుస్తోంది. మునుగోడు టిక్కెట్ ఆశించిన ఆయన టిక్కెట్ దక్కక పోవడంతో అసంతృప్తిగా ఉన్నారు. ప్రస్తుతం ఢిల్లీలో ఉన్న బూర నర్సయ్య గౌడ్ బీజేపీ పెద్దలతో భేటీ అయినట్లు తెలుస్తోంది. 

 టీఆర్ఎస్ కు ఆయన మంగళవారం రాజీనామా చేశారు. పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేస్తూ సీఎం కేసీఆర్ కు లేఖ పంపారు. 2009 నుంచి తెలంగాణ ఉద్యమం, పార్టీ ప్రస్థానంపై లేఖలో ప్రస్తవించారు . 2019లో ఎంపీగా ఓడిన తర్వాత చాలా అవమానాలు ఎదుర్కొంటున్నానని లేఖలో పేర్కొన్నారు. పైరవీలు చేసే వ్యక్తిని కాదని తెలిసినా.. కేసీఆర్  అపాయింట్ మెంట్  ఇవ్వలేదంటూ ఆవేదన వ్యక్తం చేశారు.  

మునుగోడు అసెంబ్లీ నియోజకవర్గం ఉపఎన్నికల్లో పోటీచేయాలని భావించినప్పటికీ, టీఆర్ఎస్ నాయకత్వం చివరకు కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డికే మొగ్గు చూపడంతో నర్సయ్య గౌడ్ మనస్తాపానికి గురయ్యారు. . ప్రభాకర్ రెడ్డి నామినేషన్ కార్యక్రమంలోనూ నర్సయ్య గౌడ్ పాల్గొన్నారు. కానీ అకస్మాత్తుగా ఆయన ఢిల్లీకి పయనమవడం రాజకీయవర్గాల్లో చర్చకు దారితీసింది. 

 శుక్రవారం రాత్రి బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌తో బూర చర్చలు జరిపినట్టు తెలిసింది. అనంతరం ఢిల్లీ చేరుకున్న ఆయన తరుణ్ చుగ్‌తో సమావేశమయ్యారని, పార్టీ జాతీయాధ్యక్షుడు జేపీ నడ్డా, కేంద్ర హోంమంత్రి అమిత్ షాను కలిసే ప్రయత్నాల్లో ఉన్నట్టు తెలిసింది. 

బూర నర్సయ్య గౌడ్ చేరికపై మీడియా ప్రశ్నించగా  తనను ఎవరూ కలవలేదని పార్టీ ప్రధాన కార్యదర్శి తరుణ్ చుగ్‌ చెప్పారు. అయితే పార్టీలో ఎవరైనా, ఎప్పుడైనా చేరవచ్చని చెబుతూ రాజకీయ క్షేత్రంలో రేపు ఏదైనా జరగవచ్చని  తెలిపారు.  ఈ నేపథ్యంలో ఆయన త్వరలోనే బీజేపీ కండువా కప్పుకోనున్నారన్న ఊహాగానాలు వినిపిస్తున్నాయి.

నర్సయ్య గౌడ్ బీజేపీలో చేరితే.. మునుగోడు ఉప ఎన్నిక వేళ టీఆర్ఎస్ కు పెద్ద షాక్ అని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు. ఇప్పటికే మునుగోడులో రాజకీయ పార్టీలు హోరాహోరీగా ప్రచారం చేస్తున్నాయి. కోట్లాడి తెచ్చుకున్న తెలంగాణలో బీసీలకు ఆర్థిక, రాజకీయ, విద్య, వైద్య రంగాల్లో వివక్షకు గురికావడం బాధాకరమని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. రాజకీయ వెట్టి చాకిరీ ప్రజలు ఎక్కువ కాలం భరించలేరని నర్సయ్యగౌడ్‌ చెప్పుకొచ్చారు. 

తెలంగాణ ఉద్యమంలో క్రియాశీలక పాత్ర పోషించిన ఆయన 2013 సంవత్సరంలో టీఆర్‌ఎస్‌లో చేరారు. 2014 లోక్ సభ ఎన్నికల్లో టీఆర్ఎస్ తరపున భువనగిరి పార్లమెంట్ నియోజకవర్గం నుంచి పోటీ చేసి గెలుపొందారు. 2019లో జరిగిన  లోక్ సభ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి చేతిలో ఓటమి పాలయ్యారు.  సొంత పార్టీ నేతలే బూర నర్సయ్య గౌడ్ ను ఓడించారనే ప్రచారం జరిగింది.

ఇదే విషయంపై పార్టీ అధిష్టానానికి కూడా బూర నర్సయ్యగౌడ్ ఫిర్యాదు చేశారు. ఆ తర్వాత ప్రతీ సమయంలో తన వాణి వినిపిస్తూ వచ్చారు. మునుగోడు ఉప ఎన్నిక సందర్భంగా  ఆయన టీఆర్ఎస్ టిక్కెట్ ఆశించారు. మునుగోడులో బీసీ సామాజిక వర్గానికి చెందిన వారి ఓట్లు ఎక్కువగా ఉన్నాయని, ఆ నియోజకవర్గంలో ఇప్పటివరకు ఎక్కువగా ఓసీ నేతలే గెలిచారని, ఈసారి టిఆర్ఎస్ పార్టీ బీసీకే టికెట్ కేటాయించాలని డిమాండ్ చేశారు.

టికెట్ ఆశించడంలో కూడా తన గళం గట్టిగా వినిపించారు. మంత్రి జగదీష్ రెడ్డి తీరుపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. తనను పార్టీ మీటింగులకు పిలువడం లేదంటూ పార్టీ నాయకులు, కార్యకర్తల ఎదుట అసంతృప్తి వ్యక్తం చేశారు.