విద్వేషపూరిత వ్యాఖ్యల కేసులో అక్బరుద్దీన్‌ కు హైకోర్టు నోటీసు

పది సంవత్సరాల క్రితం నిర్మల్‌, నిజామాబాద్‌ పర్యటనలలో ఎంఐఎం ఎమ్మెల్యే అక్బరుద్దీన్‌ ఒవైసీ చేసిన విద్వేషపూరిత వ్యాఖ్యల కేసులో తెలంగాణ హైకోర్టు తెలంగాణ ప్రభుత్వానికి, పోలీసులకు నోటీసులు జారీ చేసింది. 
 
అక్బరుద్దీన్ చేసిన వ్యాఖ్యలపై నాంపల్లి కోర్టు ఇచ్చిన తీర్పును సవాల్ చేస్తూ న్యాయవాది కరుణ సాగర్ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. పిటిషన్‌పై విచారణ చేపట్టిన హైకోర్టు ప్రభుత్వానికి, పోలీసులకు నోటీసులు జారీ చేశాక తదుపరి విచారణను డిసెంబర్ 30కి వాయిదా వేసింది. 
వాస్తవానికి ఒవైసీకి ఈ కేసులో ఈ ఏడాది ఏప్రిల్‌ 13న ఊరట లభించింది. పదేళ్ల కిందటి రెండు కేసులను కొట్టివేస్తూ నాంపల్లిలోని ప్రజాప్రతినిధుల కోర్టు తీర్పు వెల్లడించింది. ఈ రెండు కేసుల్లో దాదాపు 30 మందికి పైగా సాక్షులను ఎంపీ, ఎమ్మెల్యేల కోర్టు విచారించి, ఈమేరకు తీర్పును వెలువరించింది. సాక్ష్యాధారాలను పూర్తిగా పరిశీలించిన తర్వాత కేసును కొట్టివేస్తున్నట్టు న్యాయస్థానం స్పష్టం చేసింది.
ప్రజాప్రతినిధుల కోర్టు న్యాయమూర్తి జయకుమార్‌, ఎమ్మెల్యే అక్బరుద్దీన్‌కు నాడు కీలక హెచ్చరికలు చేశారు కూడా. ఈ కేసును కొట్టేసినంత మాత్రాన సంబరాలు చేసుకోవద్దని గట్టిగా సూచించారు. ఇటువంటి విద్వేషపూరిత వ్యాఖ్యలు మరోసారి ఎక్కడా చేయొద్దని అక్బరుద్దీన్‌కు నిర్దేశించారు. చట్టసభ సభ్యుడి స్థాయి వ్యక్తి ఇటువంటి వ్యాఖ్యలు చేస్తే భారతదేశ సమగ్రతకు క్షేమకరం కాదని వెల్లడించారు.
2012 డిసెంబర్‌ నెలలో నిర్మల్‌, నిజామాబాద్‌ పర్యటనలలో అక్బరుద్దీన్‌ ఒవైసీ విద్వేష వ్యాఖ్యలు చేశారు. ఆ సమయంలో అవి దేశమంతా తీవ్ర దుమారం రేపాయి. ‘మీరు 100 కోట్ల మంది… మేం కేవలం 25 కోట్ల జనాభా.. ఓ 15 నిమిషాలు మాకు అప్పగించండి. ఎవరు ఎక్కువో.. ఎవరు తక్కువో చూపిస్తాం’ అని అక్బర్‌ ప్రసంగించారు.
అప్పటి కిరణ్‌కుమారెడ్డి ప్రభుత్వం ఆదేశాల మేరకు స్థానిక పోలీసులు సుమోటోగా అక్బరుద్దీన్‌పై కేసులు నమోదు చేశారు. అక్బర్‌ కొన్ని రోజులు లండన్‌కు వెళ్లారు. ఆ తర్వాత హైదరాబాద్‌కు తిరిగొచ్చాక  ఎయిర్‌పోర్టు వద్దనే ఆయన్ను పోలీసులు అరెస్టు చేశారు. ఈ కేసు విషయంలో దాదాపు 40 రోజుల పాటు అక్బరుద్దీన్‌ను జైలులో ఉంచారు.
అనంతరం బెయిల్‌పై బయటకు రాగా, ఈ కేసును నాంపల్లి ప్రజాప్రతినిధుల కోర్టు సుదీర్ఘంగా విచారణ జరిపి కొట్టివేసింది. అక్బరుద్దీన్‌పై కేసును కోర్టు కొట్టివేసిన నేపథ్యంలో ప్రభుత్వం వెంటనే అప్పీల్‌కు వెళ్లాలని ఈ ఏడాది ఏప్రిల్ 13న బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌ డిమాండ్‌ చేశారు.
హిందువులపై అక్బరుద్దీన్‌ చేసిన వ్యాఖ్యలను ప్రంచమంతా చూసిందని, అయినా ఆయనను కోర్టు నిర్దోషిగా ప్రకటించడం ఆశ్చర్యం కలిగిస్తోందని పేర్కొన్నారు. న్యాయస్థానానికి కావాల్సింది ఆధారాలు, సాక్ష్యాలని, అయితే రాష్ట్ర ప్రభుత్వం కావాలనే ఆధారాలను సమర్పించలేదని ఆరోపించారు. ఎంఐఎంతో టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం కుమ్మక్కయిందనడానికి ఇంతకంటే నిదర్శనం ఇంకేమి కావాలని ప్రశ్నించారు.