ఏపీలో త్వరలోనే ముందస్తు ఎన్నికలు?

రాష్ట్రంలో త్వరలోనే ముందస్తు ఎన్నికలు జరిగే అవకాశం ఉన్నదని నరసాపురం ఎంపీ కె రఘురామకృష్ణం రాజు తెలిపారు. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి సతీ సమేతంగా గవర్నర్ తో భేటీ కావడం పరిశీలిస్తే, రాష్ట్రంలో ముందస్తు ఎన్నికలు ఖాయమన్న సంకేతాలు వెలువడుతున్నాయని ఆయన చెప్పారు.  
 
మూడు రాజధానులకు మద్దతుగా మరో ముగ్గురు, నలుగురు ఎమ్మెల్యేల చేత రాజీనామాలు ఇప్పించి, అయ్యా బాబోయ్ ఎమ్మెల్యేలంతా మూకుమ్మడిగా రాజీనామాలు చేసే విధంగా ఉన్నారనే భావనను ప్రజలలో కల్పించి, ప్రభుత్వాన్ని రద్దు చేసి ముందస్తు ఎన్నికలకు వెళ్లి అవకాశం ఉందని ఆయన పేర్కొన్నారు. ఏప్రిల్, మే నెలలో ముందస్తు ఎన్నికలు జరిగే అవకాశం ఉందని తెలిపారు. 
 
కాగా, రాష్ట్ర ప్రభుత్వం ఖజానా ఖాళీ అయిందని, ప్రస్తుతం ప్రభుత్వం వద్ద డబ్బులు లేవని ఆయన చెప్పారు. రాష్ట్ర ప్రభుత్వానికి ఈ సంవత్సరానికి ఇచ్చిన రుణ పరిమితికి మించి అదనంగానే రెండు వేల కోట్ల రూపాయలు అప్పులు చేశారని,  వీరు మరిన్ని తమ శక్తి యుక్తులను, కుయుక్తులను ఉపయోగించి మరిన్ని అప్పులు తెచ్చినా రెండు, మూడు నెలలకు మించి ప్రభుత్వాన్ని నడపడం కష్టమని ఆయన స్పష్టం చేశారు. 
 
రాష్ట్ర ప్రభుత్వ ఖజానా ఖాళీ అయిందన్న విషయం ప్రజలందరికీ అర్థమయ్యే లోపే మూడు రాజధానుల పేరిట ఎన్నికలకు వెళ్లే అవకాశం ఉందని రఘురామకృష్ణంరాజు తెలిపారు. ఇలా ఉండగా, ఆంధ్ర ప్రదేశ్ పోలీస్ విక్టిమ్ ఫోరం ఏర్పాటు చేస్తానని, తనలాగే పోలీసు బాధితులకు అండగా ఉండేందుకు ఈ ఫోరం ద్వారా మద్దతుగా నిలుస్తానని ఆయన వెల్లడించారు. 
 
లుగుదేశం పార్టీ, 26 జిల్లాలలో తమ పార్టీ కార్యకర్తలకు మద్దతుగా నిలిచేందుకు లీగల్ సెల్ ను బలోపేతం చేస్తుండడం స్వాగతించాల్సిన విషయమని పేర్కొన్నారు. రాజకీయాలకతీతంగా పోలీసు బాధితులకు టిడిపి న్యాయ విభాగం అండగా ఉండాలని ఆయన సూచించారు. అలాగే ఏపీ పోలీస్ విక్టిమ్ ఫోరం తరఫున తాము కూడా మద్దతుగా ఉంటానని చెప్పారు. 
 
టిడిపి మీడియా కోఆర్డినేటర్ నరేంద్రను సిఐడి పోలీసులు, ఒక వాట్సాప్ గ్రూపులలో వచ్చిన సందేశాన్ని మరొక గ్రూపులోకి ఫార్వర్డ్ చేసినందుకు అరెస్టు చేయడం అత్యంత దారుణమని ఆయన మండిపడ్డారు. సీఎం కార్యాలయంలో పనిచేసే ఒక అధికారి భార్య బంగారాన్ని స్మగ్లింగ్ చేసిందనే ఆరోపణలు సోషల్ మీడియాలో చక్కర్లు కొట్టాయని ఆయన గుర్తు చేశారు. 
 
ఈ సంఘటనలో, గుమ్మడికాయల దొంగ ఎవరు అంటే భుజాలు తడుముకున్నట్లుగా సిఐడి పోలీసుల వ్యవహార శైలి ఉన్నదని ఆయన మండిపడ్డారు. ముగ్గురు, నలుగురిని తీసుకువచ్చి స్టేషన్లో బాదితే జనం భయపడతారని సిఐడి పోలీసులు భావిస్తున్నట్లుగా తెలుస్తోందని ధ్వజమెత్తారు. 
 
ఇదే కేసులో సీనియర్ జర్నలిస్టు అంకబాబును అరెస్టు చేశారని, ఇప్పుడు నరేంద్ర వంతు వచ్చిందని చెప్పారు.  నరేంద్రను సిఐడి పోలీసులు బట్టలు విప్పించి, మర్మాంగాలను లాఠీతో తాకుతూ, కాళ్ళను నీటిలో తడిపించి, కాళ్లపై లాఠీలతో కొట్టినట్లుగా బాధితుడు చెప్పుకొచ్చారని రఘురామకృష్ణం రాజు పేర్కొన్నారు. 
 
ఇక సిఐడి పోలీసులు ఎంతటి అసభ్య పదజాలంతో బూతులు తిడతారో తనకంటే బాగా మరెవరికి తెలియదని ఆయన తెలిపారు.  అసలు సిఐడి పోలీసులకు, సోషల్ మీడియా పోస్టింగులకు సంబంధం ఏమిటని రఘురామకృష్ణంరాజు ప్రశ్నించారు. సిఐడి పోలీసుల అరాచకానికి పరాకాష్ట ఐపిసి సెక్షన్ 153ఎ  కింద బాధితులపై కేసులు నమోదు చేయడమని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు.