క్రిమియా వంతెనపై పేలుడు అనంతరం ఉక్రెయిన్‌పై దాడులు మరింత పెంచింది. ఈ క్రమంలో ఇరుదేశాల మధ్య ఉద్రిక్తతలు పెరగడంపై సోమవారం భారత్ ఆందోళన వ్యక్తం చేసింది. మౌలిక సదుపాయాలను లక్ష్యంగా చేసుకోవడం, పౌరులు ప్రాణాలు కోల్పోవడం, ఘర్షణలు పెరగడంపై భారత్ తీవ్రంగా ఆందోళన చెందుతోందని విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ పేర్కొంది.
ఈ మేరకు ఒక ప్రకటనను విడుదల చేసింది. వంతెనపై పేలుడు తర్వాత ఉక్రెయిన్ నగరాలపై రష్యా రాకెట్ దాడులతో విరుచుకుపడింది. కీవ్‌తో పాటు ఉక్రెయిన్ నగరాలు రష్యా దాడులతో దద్దరిల్లాయి. కీలకమైన ఇంధన మౌలిక సదుపాయాలే లక్ష్యంగా రష్యా దాడికి పాల్పడిందని, దీంతో ఉక్రెయిన్‌లో అనేక ప్రాంతాలకు విద్యుత్ అంతరాయం కలిగిందని అధికారులు పేర్కొన్నారు.
ఇరుదేశాలు శత్రుత్వాన్ని వీడి, తక్షణమే దౌత్యం, చర్చల మార్గాన్ని అనుసరించాలని ఇరుదేశాలకు భారత్ విజ్ఞప్తి చేసింది. ఘర్షణలు పెరుగడం ఎవరికీ మంచిది కాదని భారత్ పునరుద్ఘాటిస్తుందని, ఇరుదేశాలు చర్చలకు రావాలని కోరుతుందని విదేశీ వ్యవహారాల శాఖ ప్రకటనలో పేర్కొంది.
ఇరుదేశాల మధ్య ఉద్రిక్తతలను తగ్గించేందుకు జరిగే అన్ని ప్రయత్నాలకు మద్దతు ఇచ్చేందుకు భారత్ సిద్ధంగా ఉందని స్పష్టం చేసింది. మరో వైపు ఉక్రెయిన్‌లో ఉన్న భారతీయుల కోసం ఇండియన్ ఎంబసీ అడ్వైజరీని జారీ చేసింది. ఉక్రెయిన్‌పై రష్యా దాడులు పెంచిన నేపథ్యంలో ఉక్రెయిన్‌కు వెలుపల భారతీయులు అనవసర ప్రయాణాలను నివారించాలని సూచించింది. అలాగే ఎప్పటికప్పుడు తమ ఉనికిని ఎంబసీకి తెలియజేయాలని కోరింది.
ఉగ్రవాద చర్య .. పుతిన్ ఆగ్రహం
ఇలా ఉండగా, రష్యా – క్రిమియాను కలిపే కెర్చ్ వంతెనపై పేలుడు ఘటనపై అధికారులతో చర్చించిన రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ వంతనపై పేలుడు ఉగ్రవాద చర్యగా అభివర్ణించారు. ఉక్రెయిన్ ఇంటెలిజెన్స్ ఆర్గనైజేషన్ మొత్తం బ్లూప్రింట్‌ను సిద్ధం చేసి, ఘటనకు పాల్పడిందని ఆరోపించారు. పౌర మౌలిక సదుపాయాలను ధ్వంసమే లక్ష్యంగా దాడికి పాల్పడినట్లు పుతిన్ ఆగ్రహం వ్యక్తం చేశారు.
వంతెనపై దాడి వెనుక ఉక్రెయిన్ ప్రత్యేక బలగాల హస్తం ఉందని, ఉక్రెయిన్ టర్కిష్ స్ట్రీమ్ పైప్‌లైన్‌ను పేల్చివేసేందుకు కూడా ప్రయత్నించినట్లు క్రెమ్లిన్ ఆరోపించింది. రష్యా ప్రాంతంలో ఉగ్రవాద చర్యలు కొనసాగితే తీవ్ర పరిణామాలుంటాయని హెచ్చరించింది.
పుతిన్ సోమవారం రష్యా భద్రతా మండలి సమావేశాన్ని నిర్వహించారు. సమావేశంలో కౌన్సిల్ ఉపాధ్యక్షుడు దిమిత్రి మెద్వెదేవ్ దాడికి కారణమైన ఉగ్రవాదులను హతమార్చాలని స్పష్టం చేశారు. మరోవంక, ఉక్రెయిన్‌లో రష్యా సైన్యం ప్రారంభించిన భారీ క్షిపణి దాడిని రష్యా ప్రత్యేక సైనిక చర్యలో భాగంగా నిర్వహిస్తున్నట్లు క్రెమ్లిన్ పేర్కొన్నట్లు ఏటీఎఫ్ తెలిపింది.
కాగా, బ్రిడ్జి పేల్చివేతకు సంబంధించి ఉక్రెయిన్ అధికారికంగా ఎలాంటి ప్రకటన చేయకపోవడం గమనార్హం. కాగా, తమ దేశంపై దాడులకు ఇరాన్‌కు చెందిన డ్రోన్లను రష్యా ఉపయోగించిందని ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్ స్కీ ఆరోపించారు. రష్యా తమ దేశ పౌరులను, ఇంధన మౌలిక వసతులను లక్ష్యంగా చేసుకుందని ఉక్రెయిన్ అధ్యక్షుడు ఆగ్రహం వ్యక్తం చేశారు.
తమను ఈ భూమ్మీది నుంచి తుడిచిపెట్టేయాలని రష్యా చూస్తోందని మండిపడ్డారు. రష్యా మిసైల్ దాడిని తీవ్రంగా ఖండించిన జెలెన్‌స్కీ ఓ చిన్నారి సహా 13 మంది మరణించినట్టు చెప్పారు. అలాగే, 89 మంది గాయపడ్డారని, వీరిలో 11 మంది చిన్నారులు ఉన్నారని అధ్యక్ష కార్యాలయం తెలిపింది. శాంతి కాముకులపై నిర్దాక్ష్యంగా జరుగుతున్న దాడి ఇదని జెలెన్‌స్కీ అభివర్ణించారు.
కాగా, రష్యా దాడులను అమెరికా, పశ్చిమ దేశాలు కూడా ఖండించాయి. ఉక్రెయిన్‌లో మౌలిక సదుపాయాలపై రష్యా దాడులు అమానుషమని అమెరికా ఖండించింది. అంతేకాక, రష్యా చర్యయుద్ధ నేరం కిందికి వస్తుందని పేర్కొంది.రష్యా చర్యను పోలండ్ తదితర దేశాలుఖండించాయి. ఉక్రెయిన్ ప్రయాణాలు రద్దు చేసుకోవాలని పోలండ్ ప్రభుత్వం తమ దేశవాసులకు విజ్ఞప్తి చేసింది.
More Stories
కోల్‌కతా ట్రైనీ డాక్టర్ హత్యాచార కేసు దోషికి జీవిత ఖైదు
అక్రమ వలసదారులను తిప్పి పంపుతా
90 మంది పాలస్తీనా ఖైదీలను విడుదల చేసిన ఇజ్రాయెల్