ఆర్థిక శాస్త్రంలో ప్రతిష్టాత్మకమైన నోబెల్ పురస్కారం అమెరికాకు చెందిన ముగ్గురు ఆర్థిక వేత్తలకు దక్కింది. ఈ మేరకు రాయల్ స్వీడిష్ అకాడెమీ సోమవారం మధ్యాహ్నం ఓ ప్రకటన చేసింది. ఈ ఏడాది ఆర్థిక శాస్త్రంలో నోబెల్ బహుమతిని అమెరికాకు చెందిన బెన్ ఎస్ బెర్నాంకే, డగ్లస్ డబ్ల్యూ డైమండ్, ఫిలిప్ హెచ్. డిబ్‌విగ్‌లకు అందించనున్నట్లు అకాడెమీ తన ప్రకటనలో తెలిపింది.
బ్యాంకులు, ఆర్థిక సంక్షోభంపై జరిగిన పరిశోధనలకు గాను వీరిని ఈ ఏడాది నోబెల్ బహుమతికి ఎంపిక చేసినట్లు పేర్కొంది. ఆర్థిక సంక్షోభాల వేళ బ్యాంకుల పాత్ర ఎంత ముఖ్యమైందన్న విషయాన్ని ఈ ముగ్గురూ తమ పరిశోధనల్లో వెల్లడించారు. బ్యాంకులు దివాళా తీయకుండా ఉండేందుకు ఈ అధ్యయనం చాలా కీలకమైందని నోబెల్ కమిటీ అభిప్రాయపడింది.
దేశాల ఆర్థిక వ్యవస్థల నిర్మాణంలో బ్యాంకుల పాత్ర ఏమిటి ? ప్రత్యేకించి ఆర్థిక సంక్షోభాలు దేశాలను అలుముకున్నప్పుడు బ్యాంకుల పాత్ర ఏమిటి ? బ్యాంకులు కుప్పకూలకుండా నిరోధించడం ఎందుకు అతి ముఖ్యం ? అనే అంశాలు కేంద్రంగా ఈ ముగ్గురు ఆర్థిక వేత్తల అధ్యయనం జరిగింది. బ్యాంకులను సంక్షోభాల నుంచి ఎలా గట్టెక్కించాలి? ఆర్థిక సంక్షోభాల సమయంలో దేశాలు ఎలా స్పందించాలి ? అనే ప్రశ్నలకూ సమాధానం ఇచ్చేలా వారి అధ్యయనం జరిగింది.
బ్యాంకులు కుప్పకూలకుండా ఉండేందుకు కావాల్సిన జాగ్రత్తలు గురించి ఈ ముగ్గురు తమ స్టడీలో సూచనలు చేశారు. 1980 దశకం ఆరంభంలోనే ఈ స్టడీ జరిగింది. ఆర్థిక మార్కెట్ల నియంత్రణ, ఆర్థిక సంక్షోభాల నివారణకు స్టడీ ఉపయోగపడినట్లు నోబెల్ కమిటీ తెలిపింది.
ఆర్థిక రంగ నిపుణులకు ప్రదానం చేసే నోబెల్ ప్రైజ్ పూర్తి పేరు.. ‘స్వెరైస్ రిక్స్ బ్యాంక్ ప్రైజ్ ఇన్ ఎకానమిక్ సైన్సెస్ ఇన్ మెమొరీ ఆఫ్ ఆల్ర్ఫెడ్ నోబెల్’. డిసెంబరు 10న స్వీడన్ రాజధాని స్టాక్ హోంలో నోబెల్ బహుమతుల ప్రదానోత్సవం జరగనుంది. నోబెల్ ప్రైజ్ కు ఎంపికైన ముగ్గురు ఆర్థికవేత్తలకు కలిపి రూ.7.50 కోట్ల ప్రైజ్ మనీతో పాటు మెడల్, డిప్లొమా అందిస్తారు.
గతేడాది కూడా ఆర్థిక శాస్త్రంలో నోబెల్ ప్రైజ్ ముగ్గురిని.. డేవిడ్ కార్డ్, జోషువా డి అంగ్రిస్ట్, గుయిడో డబ్ల్యూ ఇంబెన్స్‌లకు దక్కింది. కార్మిక ఆర్థిక శాస్త్రానికి అనుభావిక సహకారంపై పరిశోధన చేసిన డేవిడ్ కార్డ్‌కు సగం బహుమతి ఇవ్వగా, మిగతా సగాన్ని జోషువా డి.అంగ్రిస్ట్, గుడియో డబ్ల్యూ. ఇంబెన్స్‌లకు సంయుక్తంగా అందజేశారు.
More Stories
45 ఏళ్లుగా పడిపోతున్న జపాన్ బాలల జనాభా
యూఏఈ చమురు శుద్ధి కేంద్రంపై ఇరాన్ డ్రోన్ దాడి
ఓ దుండగుడు వైట్‌హౌస్ భద్రతా సిబ్బందిపై కాల్పులు