మొమిన్‌పూర్ హింస వెనక అల్ ఖైదా, ఐసిస్

మొమిన్‌పూర్ హింస వెనక అల్ ఖైదా, ఐసిస్
పశ్చిమ బెంగాల్ రాజధాని కోల్‌కతాలోని మోమిన్‌పూర్‌ లో ఆదివారం జరిగిన హింస వెనక అల్ ఖైదా, ఐసిస్ హస్తం ఉందని బీజేపీ నేత, అసెంబ్లీలో ప్రతిపక్ష నేత సువేందు అధికారి ఆరోపించారు. ఈ హింసాత్మక ఘటన నేపథ్యంలో 5 వేల మంది హిందువులు కోల్‌కతాను విడిచిపెట్టి వెళ్లిపోయారని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. 
 
ఈ విషయంలో తాను కోల్‌కతా పోలీస్ కమిషనర్‌కు చాలెంజ్ చేస్తున్నానని పేర్కొంటూ 5 వేల మందికి తక్కువ కాకుండా హిందువులు కోల్‌కతాను విడిచిపెట్టి వెళ్లిపోయారని స్పష్టం చేశారు. ఈ ఘటనలో ముగ్గురు పోలీసు అధికారులు గాయపడ్డారని, ముగ్గురు ఐపీఎస్ అధికారులు ఆసుపత్రి పాలయ్యారని సువేందు అధికారి మీడియాతో మాట్లాడుతూ చెప్పారు.
‘‘బీజేపీ నేతలు ఆ ప్రాంతంలోకి వెళ్లకుండా మీరు అడ్డుకున్నారు. ఇంటర్నెట్‌పై ఆంక్షలు విధించారు. మీరు మా రాష్ట్ర అధ్యక్షుడిని అరెస్ట్ చేశారు. ముఖ్యమంత్రిగా మీరు ఎవరిని ఎన్నుకున్నారో ఇప్పుడు మీకు అర్థమై ఉంటుంది. వారు గృహాలను ధ్వంసం చేశారు. ధ్వంసం చేశారు. బెంగాలీ హిందువులు వలస వెళ్లాలని మేం కోరుకోవడం లేదు’’ అని ఆయన పేర్కొన్నారు.
మొమిన్‌పూర్ అల్లర్లకు సంబంధించి బెంగాల్ గవర్నర్, హోం మంత్రికి ఆధారాలతో లేఖ రాసినట్టు అధికారి చెప్పారు.  మొమిన్‌పూర్ హింసకు సంబంధించి ఆ లేఖలో బీజేపీ మూడు డిమాండ్లు ఉంచింది. సీఆర్పీఎఫ్ సిబ్బందిని తక్షణమే మోహరించాలని, బాధితులకు రాష్ట్ర ప్రభుత్వం వెంటనే పరిహారం చెల్లించాలని ఆ లేఖలో డిమాండ్ చేసినట్టు సువేందు అధికారి తెలిపారు.
మారణహోమానికి సంబంధించిన వీడియో ఫుటేజీని చూసి దోషులను అరెస్ట్ చేసి అసాంఘిక కార్యకలాపాల చట్టం కింద తగిన విధంగా శిక్షించాలన్నది తమ మూడో డిమాండ్ అని చెప్పారు.  మొమిన్‌పూర్  పరిధిలోకి వచ్చే వార్డు కౌన్సిలర్ నెజాముద్దిన్ షామ్స్, ఇతర నేతలు హింసను రెచ్చగొట్టారని పేర్కొంటూ వారిని కూడా తప్పకుండా సంకెళ్లు వేయాలని ఆయన డిమాండ్ చేశారు. అంతేకాకుండా కేసును జాతీయ దర్యాప్తు సంస్థకు అప్పగించాలని ఆయన కోరారు.

గవర్నర్ కు ఫిర్యాదు 

ఇలా ఉండగా, పశ్చిమ బెంగాల్ బీజేపీ ఎమ్మెల్యేలు అసెంబ్లీ నుంచి రాజ్భవన్ వరకు భారీ ర్యాలీ నిర్వహించారు. బీజేపీ శాసనసభాపక్ష నేత సువేందు అధికారి ఆధ్వర్యంలో మోమిన్ పూర్ ప్రాంతంలో ఆదివారం చెలరేగిన హింసాత్మక ఘర్షణలపై గవర్నర్ను కలిసి ఫిర్యాదు చేశారు. మమత సర్కార్ ఘర్షణలను ప్రోత్సహిస్తోందని ఫిర్యాదు చేశారు. 

బీజేపీ ఎమ్మెల్యేల ర్యాలీతో పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. కేవలం ఎమ్మెల్యేలను మాత్రమే రాజ్భవన్లోకి అనుమతించారు. మరోవైపు రాష్ట్రంలో ఘర్షణ వాతావరణం ఉండటంతో కేంద్ర బలగాలను పంపాలని కోరుతూ కేంద్రానికి బీజేపీ నేతలు లేఖ రాశారు.