ములాయం పార్థివ‌దేహానికి యోగీ ఆదిత్య‌నాథ్ నివాళి

ములాయం పార్థివ‌దేహానికి యోగీ ఆదిత్య‌నాథ్ నివాళి

ఉత్త‌ర‌ప్ర‌దేశ్ ముఖ్య‌మంత్రి యోగీ ఆదిత్య‌నాథ్ యూపీ మాజీ ముఖ్య‌మంత్రి, స‌మాజ్‌వాది పార్టీ అధినేత ములాయం సింగ్ యాద‌వ్ పార్థివ‌దేహానికి నివాళుల‌ర్పించారు. ములాయం భౌతిక‌కాయంపై పుష్ప‌గుచ్ఛాన్నుంచి అంజ‌లి ఘ‌టించారు. అనంత‌రం ములాయం త‌న‌యుడు, యూపీ మ‌రో మాజీ ముఖ్య‌మంత్రి అఖిలేష్ యాద‌వ్‌ను ఓదార్చారు.

 ఆయన వెంట మంత్రి స్వతంత్ర దేవ్ సింగ్, యూపీ బీజేపీ అధ్యక్షుడు భూపేంద్ర సింగ్ చౌధరి తదితరులున్నారు. ములాయం పార్థివ‌దేహం ఆయ‌న స్వ‌గ్రామం సాయ్‌ఫాయ్‌కి చేరుకోక‌ముందే యోగీ ఆదిత్య‌నాథ్ అక్క‌డికి వెళ్లారు. పార్టీవ‌దేహం ఇంటికి చేర‌గానే పుష్పాంజ‌లి ఘ‌టించారు. అంత‌కుముందు ములాయం మ‌ర‌ణవార్త తెలియ‌గానే యోగీ ఆదిత్యానాథ్ తీవ్ర దిగ్భ్రాంతి వ్య‌క్తంచేశారు. ఆయ‌న అంత్య‌క్రియ‌ల‌ను పూర్తిగా రాష్ట్ర‌ ప్ర‌భుత్వ లాంఛ‌నాల‌తో నిర్వ‌హిస్తామ‌ని ప్ర‌క‌టించారు.

 ములాయం సింగ్ యాద‌వ్ భౌతికకాయం సోమ‌వారం సాయంత్రం త‌న స్వ‌గ్రామం సాయ్‌ఫాయ్‌కి చేరుకుంది. గురువారం ఉద‌యం గ‌రుగ్రామ్‌లోని మేదాంత ఆస్ప‌త్రిలో తుదిశ్వాస విడిచిన ఆయన భౌతికకాయాన్ని ఆస్ప‌త్రిలో ఫార్మాలిటీస్ అన్ని పూర్త‌యిన త‌ర్వాత అక్క‌డి నుంచి నేరుగా స్వ‌గ్రామానికి త‌ర‌లించారు.

మంగ‌ళ‌వారం ములాయం అంత్య‌క్రియ‌లు జ‌రుగ‌నున్న‌ట్లు ఆయ‌న కుటుంబ‌స‌భ్యులు తెలిపారు. కేంద్ర రాజ‌కీయాల్లో సుధీర్ఘ‌కాలం చ‌క్రం తిప్పిన ములాయం అంత్య‌క్రియ‌ల‌కు దేశ న‌లుమూల‌ల నుంచి నేత‌లు భారీగా త‌ర‌లి రానున్నారు. 

తెలంగాణ ముఖ్య‌మంత్రి కే చంద్ర‌శేఖ‌ర్‌రావు, యూపీ ముఖ్య‌మంత్రి యోగీ ఆదిత్య‌నాథ్ త‌దిత‌రులు ఇప్ప‌టికే తాము స్వ‌యంగా అంత్య‌క్రియ‌లకు హాజ‌రుకానున్న‌ట్లు వెల్ల‌డించారు. అంత్య‌క్రియ‌ల‌కు ప్ర‌జ‌లు, అభిమానులు కూడా భారీగా త‌ర‌లివ‌చ్చే అవ‌కాశం ఉండ‌టంతో అధికారులు తగిన ఏర్పాట్లు చేస్తున్నారు.