”ఒక వ్యక్తి” వల్ల పరిష్కారం కాని కాశ్మీర్ సమస్య

స్వాతంత్య్రానంతరం దేశంలోని సంస్థానాల విలీనం సమస్యను సర్దార్ వల్లభాయ్ పటేల్ పరిష్కరించారని, కాని ”ఒక వ్యక్తి” మాత్రం కశ్మీరు సమస్యను పరిష్కరించలేకపోయారని అంటూ పరోక్షంగా తొలి ప్రధాని జవహర్‌లాల్ నెహ్రూపై విమర్శలు గుప్పించారు.

ఈ ఏడాది చివరిలో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న గుజరాత్‌లోని  భరూచ్‌‌   జిల్లాకు చెందిన వల్లభ్ విద్యానగర్‌లో సోమవారం ఒక బహిరంగ సభలో ప్రధాని  ప్రసంగిస్తూ దేశ తొలి హోం మంత్రి సర్దార్ పటేల్ అడుగుజాడల్లో నడుస్తున్న తాను దీర్ఘకాలికంగా అపరిష్కృతంగా ఉన్న కశ్మీరు సమస్యను పరిష్కరించి గలిగానని చెప్పారు.

సర్దార్ పటేల్ మానసిక పుత్రిక సర్దార్ సరోవర్ డ్యాం నిర్మాణాన్ని అడ్డుకోవడానికి ”అర్బన్ నక్సల్స్” ప్రయత్నించారని కూడా ఆయన ఆరోపించారు. భారతదేశంలో విలీనం కావాలంటూ అన్ని సంస్థానాలను సర్దార్ పటేల్ నచ్చచెప్పి ఒప్పించారని, కాని, కశ్మీరు సమస్యను మరో వ్యక్తి మాత్రం చక్కబెట్టలేకపోయారంటూ పరోక్షంగా నెహ్రూపై ప్రధాని విమర్శనాస్త్రాలు సంధించారు.

సర్దార్ పటేల్ అడుగుజాడల్లో నడిచే తాను మాత్రం ఆయన జన్మభూమికి చెందిన విలువలకు కట్టుబడి కశ్మీరు సమస్యను పరిష్కరించానని, ఇదే తాను సర్దార్ పటేల్‌కు ఇచ్చే నిజమైన నివాళులని మోదీ  చెప్పారు. గుజరాత్‌లో గతంలో అధికారంలో ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వాలను ప్రస్తావిస్తూ డ్యాంలు నిర్మించిన కాంగ్రెస్ ప్రభుత్వాలు నీటిని తరలించేందుకు కాల్వల వ్యవస్థను నిర్మించలేదని విమర్శించారు. 

దర్శనం కోసమే డ్యాంలు నిర్మించారా? అంటూ ఆయన ప్రశ్నించారు. కాల్వల నిర్మాణ పనులను తాను చేపట్టి 20 ఏళ్లలో పూర్తి చేశానని ఆయన చెప్పారు. దీని వల్ల రాష్ట్రంలోని మారుమూల ప్రాంతాలకు సైతం నీరు చేరుకున్నందున వ్యవసాయ ఉత్పత్తులలో రాష్ట్రం 9 నుంచి 10 శాతం ప్రగతిని సాధించిందని ఆయన చెప్పారు. 

గుజరాత్ లో అర్బన్ నక్సల్స్ ప్రవేశించే యత్నం 

అర్బన్‌‌ నక్సల్స్‌‌ తమ రూపాన్ని మార్చుకొని తిరిగి గుజరాత్‌‌లోకి ప్రవేశించేందుకు ప్రయత్నిస్తున్నారని ప్రధాని నరేంద్ర మోదీ హెచ్చరించారు. మన అమాయక యువతను తప్పుదోవ పట్టించేందుకు వారు కుట్ర చేస్తున్నారని ఆయన ఆరోపించారు.  

 ‘అర్బన్‌‌ నక్సల్స్‌‌ పైనుంచి మనపై కాలు మోపుతున్నారు. దేశాన్ని నాశనం చేస్తున్నారు. వారు వీదేశీ శక్తుల ఏజెంట్లు. మన యువతరాన్ని నాశనం చేయనివ్వబోం. మన పిల్లలను కాపాడుకోవాలె. ఎట్టి పరిస్థితుల్లోనూ గుజరాత్ వారికి తలవంచదు” అని ఆమ్‌‌ ఆద్మీ పార్టీ(ఆప్‌‌)పై పరోక్షంగా నిప్పులు చెరిగారు. 

సర్దార్ సరోవర్ డ్యాం నిర్మాణాన్ని అడ్డుకోవడానికి ”అర్బన్ నక్సల్స్” ప్రయత్నించారని ఆయన ఆరోపించారు. వారి వల్ల 40, 50 ఏళ్ల కాలం వృథా అయిందని, కోర్టుల చుట్టూ తిరిగి గుజరాత్ ప్రజల ధనం వృథా అయిందని ఆయన విమర్శించారు. కాగా, నేడు సర్దార్ పటేల్ కలల ప్రాజెక్టు సరోవర్ సరోవర్ డ్యాం నిర్మాణం పూర్తి చేసుకున్నామని ఆయన చెప్పారు. 

బెంగాల్, జార్ఖండ్‌‌, బీహార్‌‌‌‌, చత్తీస్‌‌గఢ్‌‌, మధ్యప్రదేశ్‌‌లోని కొన్ని ప్రాంతాలు, ఒడిశా, ఏపీ, తెలంగాణ, మహారాష్ట్రలోని గడ్చిరోలిలో నక్సలిజం ప్రారంభమైందని, ఆదివాసీ యువకుల జీవితాలను నక్సలైట్లు నాశనం చేస్తున్నారని ప్రధాని దయ్యబట్టారు. తాను గుజరాత్‌‌ సీఎంగా ఉన్నప్పుడు నక్సలిజం నిర్మూలన తనకు సవాల్‌‌గా ఉండేదని చెప్పారు. 

దేశంలోని అనేక చిన్న రాష్ట్రాలతో పోలిస్తే భరూచ్‌‌లో ఎక్కువ పరిశ్రమలు ఉన్నాయని, అక్కడ వచ్చిన ఉద్యోగాల సంఖ్య కూడా ఒక రికార్డు అని మోదీ పేర్కొన్నారు.  రూ. 8,000 కోట్ల విలువైన వివిధ అభివృద్ధి కార్యక్రమాలకు ఆయన శ్రీకారం చుట్టారు. కాంగ్రెస్ నాయకులు కనపడితే సర్దార్ పటేల్ గౌరవార్థం నిర్మించిన ప్రపంచంలోనే ఎత్తయిన ఐక్యతా మూర్తి విగ్రహాన్ని దర్శించారా? అని ప్రశ్నించండని ఆయన బిజెపి కార్యకర్తలనుద్దేశించి చెప్పారు.