ఆంగ్ల భాషను దేశం నుండి మెల్లమెల్లగా వెళ్ళగొట్టాలి

ఆంగ్ల భాషను దేశం నుండి మెల్లమెల్లగా వెళ్ళగొట్టాలి
మన బానిసత్వంకు చిహ్నంగా మిగిలిన ఆంగ్ల భాషను దేశం నుండి మెల్లమెల్లగా వెళ్లగొట్టాలనే ప్రయత్నాలు దేశంలో ప్రారంభం అవుతున్నాయి. విద్యా సంస్థల్లో బోధన ఆంగ్ల భాషలో ఉండరాదని, ఇంగ్లీష్‌ భాష వాడుతున్న చోట క్రమంగా హిందీని ప్రవేశపెట్టాలని కేంద్ర హోంమంత్రి అమిత్‌ షా నేతృత్వంలోని పార్లమెంటరీ కమిటీ సిఫారసు చేసింది. 
 
అధికార భాషలపై ఏర్పాటైన పార్లమెంటరీ కమిటీ నివేదిక రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ముకు కొద్దిరోజుల క్రితం చేరుకుంది. ఆ కమిటీ మొత్తం 112 సిఫారసులతో 11వ నివేదికను రాష్ట్రపతి ద్రౌపది ముర్ముకు సమర్పించింది. ఆ నివేదికలో టెక్నికల్‌, నాన్‌ టెక్నికల్‌ విద్యాసంస్థలు, సెంట్రల్‌ యూనివర్సిటీల్లో హిందీ, స్థానిక భాష మాత్రమే వాడేలా చర్యలు తీసుకోవాలని సూచించింది.
 
‘భారతీయులకు ఇంగ్లిష్‌ను దూరం చేయాలి.. అసలు ఆ భాషను వాడకుండా చూడాలి.. విద్యార్థులకు హిందీ, స్థానిక భాషల్లోనే బోధన చేపట్టాలి.. ప్రభుత్వ కార్యాలయాల్లో ఇంగ్లిష్‌ అన్నదే కనిపించకూడదు.. కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులైతే హిందీ నేర్చుకోవాల్సిందే.. కాదూకూడదు అంటే వారికి శిక్ష కూడా విధించాలి.. ఉత్తర ప్రత్యుత్తరాలన్నీ హిందీలోనే ఉండాలి’.. ఇవీ టూకీగా ఈ కమిటీ సిఫార్సులు.
 
ఇంగ్లీష్‌ తప్ప మరో భాష అర్థం కాదని భావించిన చోటమాత్రమే, ఆంగ్ల భాషల్లో అధికారిక ఆదేశాలు, సూచనలు ఉండాలని నివేదికలో కమిటీ పేర్కొన్నది. అక్కడ కూడా మెల్లిమెల్లిగా ఇంగ్లిష్‌ స్థానంలో హిందీని భర్తీ చేయాలి. ఆంగ్ల భాషను వాడటం కేవలం ఆప్షనల్‌ (ఐచ్ఛికం)గా ఉండాలని చెప్పింది.
 
టెక్నికల్‌ సంస్థలు, కేంద్ర ప్రభుత్వ ఆధ్వర్యంలో నడిచే ఐఐటి, ఐఐఎం, ఎయిమ్స్‌, కేంద్రీయ విద్యాలయాలు, నవోదయ.. మొదలైన వాటిల్లో హిందీ మాధ్యమంలోనే బోధన ఉండాలని పేర్కొన్నది. ”శిక్షణా సంస్థల్లో హిందీని బోధనా మాధ్యమంగా మార్చాలి. రిక్రూట్‌మెంట్‌ పరీక్షల్లో ఆంగ్ల భాషా ప్రశాుపత్రాన్ని తొలగించాలి. నియామక పరీక్షల్లో ఆంగ్లానికి ప్రాధాన్యత ఇస్తున్నారు. దీనిని మార్చాలి. హిందీ ప్రశు పత్రాన్ని తప్పనిసరిగా చేర్చాలి” నివేదిక పేర్కొన్నది.
 
ప్రస్తుతం నియామకాలకు నిర్వహించే పరీక్షలో ఇంగ్లిష్‌ను తప్పనిసరి చేశారు. హిందీని చేర్చలేదు. దానివల్ల ఇంగ్లిష్‌కు ప్రాధాన్యం పెరుగుతూ పోతున్నది. కాబట్టి, ఇంగ్లిష్‌ పేపర్‌ను తప్పనిసరి చేయకూడదు. ఆ పేపర్‌ స్థానంలో హిందీ పేపర్‌ను కచ్చితం చేయాలి. ఎంపిక చేసే ఉద్యోగులకు హిందీపై అవగాహన ఉండేలా చర్యలు తీసుకోవాలి. 
 
 హిందీలో హైకోర్టులో తీర్పులు ఇచ్చే అవకాశం కల్పించాలి. సంబంధిత హైకోర్టు ఉత్తర్వులకు హిందీ అనువాదాన్ని తగిన విధంగా ఏర్పాటు చేయాలని, హైకోర్టు విచారణకు హిందీలో అవకాశం కల్పించాలని కూడా కమిటీ కోరింది.  హిందీ మాట్లాడే రాష్ర్టాల్లో ఆ భాష మాట్లాడని ప్రభుత్వ ఉద్యోగులను హెచ్చరించాలి. వారి నుంచి వివరణ కోరాలి. సరైన వివరణ రాకపోతే వారి వార్షిక పనితీరు నివేదిక (ఏపీఏఆర్‌)లో నమోదు చేయాలి. 
 
ఐక్యరాజ్యసమితి అధికారిక భాషల్లో హిందీని కూడా చేర్చాలి. కేంద్ర ప్రభుత్వ కార్యాలయాలు, మంత్రి త్వ శాఖలు, విభాగాల్లో జరిగే ఉత్తర ప్రత్యుత్తరాలు, ఫ్యాక్స్‌, ఈమెయిల్స్‌ కచ్చితంగా హిందీ లేదా స్థానిక భాషలో ఉండేలా చూడాలి.  కేంద్ర ప్రభుత్వ పరిధిలో నిర్వహించే అధికారిక కార్యక్రమాల్లో, ఆహ్వాన పత్రికల్లో, ఉపన్యాసాల్లో, ఇతర కార్యక్రమాల్లో హిందీ లేదా స్థానిక భాషను వాడాలి. అది కూడా వాడుక భాష అయ్యి ఉండాలి.