భారత్‌ రాష్ట్ర సమితితో ప్రయోజనాలు అంతంతే…

ఐ.వి.మురళీ కృష్ణ శర్మ,
పీపుల్స్‌పల్స్‌ రీసెర్చ్‌ సంస్థ
 
తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్‌ రావు ఏది తలపెట్టినా హంగూ ఆర్భాటం భారీ ఎత్తున ఉంటుంది. దసరా రోజున ఆయన తెలంగాణ రాష్ట్ర సమితి (టిఆర్‌ఎస్‌) స్థానంలో భారత్‌ రాష్ట్ర సమితి (బిఆర్‌ఎస్‌) ఏర్పాటు చేశారు. దీంతో ఆ పార్టీ శ్రేణులు రాష్ట్ర వ్యాప్తంగా సంబురాలలో మునిగారు. కేసీఆర్‌ దేశ రాజకీయాలలో క్రియాశీలక పాత్ర పోషించనున్నారని కొంతకాలంగా ప్రచారం అవుతున్నా అనేక వాయిదాల తర్వాత విజయ దశమి ముహూర్తాన ఇది సాధ్యమైంది. కేసీఆర్‌ తెలంగాణను విడిచి దేశ రాజకీయాలలో ఏమి చేస్తారన్నది సామాన్యులలో కలుగుతున్న సందేహం.
 
 ఇప్పుడు తెలంగాణలోనే కేసీఆర్‌ పరిస్థితి గతంలోలాగా నల్లేరు మీద నడకలా లేదు. కాంగ్రెఎస్‌, బిజెపి పార్టీలు రాష్ట్రంలో ఆయనకు పలు సవాళ్లు విసురుతున్నాయి. ముఖ్యంగా దుబ్బాక, హుజారాబాద్‌, గ్రేటర్‌ ఎన్నికల్లో బిజెపి టిఆర్‌ఎస్‌ను ధీటుగా ఎదుర్కొంది. ఇటువంటి పరిస్థితులలో ఆయన రాష్ట్రాని విడిచి దేశ రాజకీయాలోకి ప్రవేశించడం ఆ పార్టీ సామన్య కార్యక్తలకు కూడా అర్థం కావడం లేదు. 
 
అయితే కేసీఆర్‌ అనాలోచితంగా ఏదీ చేయరు, తనకు లాభం లేని పని కూడా ఏమి చేయరు అది పార్టీలోని కీలక నేతలు సామన్య కార్యకర్తలకు చెబుతున్నారు. కేసీఆర్‌ స్వప్రయోజనానికి ఏమైనా చేస్తారనే విషయం చరిత్రను చూస్తే అర్థమవుతుంది. గతంలో టిఆర్‌ఎస్‌ ఒక ఉద్యమ పార్టీ అని, ప్రత్యేక రాష్ట్రం ఏర్పడిన తర్వాత టిఆర్‌ఎస్‌ ఉనికిలో ఉండదని ఆయన అన్నారు. రాష్ట్రం ఏర్పడిన తర్వాత టిఆర్‌ఎస్‌ ఫక్తు రాజకీయపార్టీ అని ప్లేటు ఫిరాయించారు.
తొలి ముఖ్యమంత్రి దళితుడే అని ముందున్నా … రాష్ట్ర ప్రయోజనాల కోసం అందరి ఒత్తిడి మేరకు పగ్గాలు చేపడుతున్నట్లు ప్రకటించి ముఖ్యమంత్రి అయ్యారు. కాంగ్రేస్‌ కేసిఆర్‌ను వాడుకుందామనుకుంటే కేసీఆరే కాంగ్రేస్‌ను వాడుకొని వదిలేశారు. అధికారం చేపట్టాక కూడా తమ పార్టీకి భవిష్యత్తులో ఎవరూ పోటీ ఉండకూడదని రాష్ట్రంలో కాంగ్రెస్‌ను బలహీన పరిచారు.
బిజెపి అగ్రనేతలతో సఖ్యతగా ఉన్నారు. ప్రత్యేక రాష్ట్రంలో, రెండో సారి అసెంబ్లీ ఎన్నికల్లో చంద్రబాబు రూపంలో మళ్లీ సెంటిమెంట్‌ రగల్చి మరోసారి అందలమెక్కారు. బిజెపి కేంద్ర నాయకత్వంతో మంచి సంబంధాలు నెలకొల్పుకుంటే రాష్ట్ర బిజెపి నేతలను పట్టించుకోవలసిన అవసరం లేదనుకున్నారు. ఇక షరమామూలుగానే కాంగ్రెస్‌ను బలహీనపరుస్తూ వచ్చారు.
బిజెపి అమీతుమీకి సిద్ధం కావడంతోనే చిక్కు 
అయితే 2019 లోక్‌సభ ఎన్నికల్లో ఊహించని విధంగా రాష్ట్రంలో బిజెపికి 4 స్థానాలు రావడంతో ఆ పార్టీ పట్ల జాగ్రత్త వహించారు. దీనికి తోడు ఉప ఎన్నికల్లో, గ్రేటర్‌ ఎన్నికల్లో బిజెపి మరింత బలపడడంతో కాంగ్రెస్‌ను పక్కనపెట్టి బిజెపి లక్ష్యంగా రాజకీయాలను ప్రారంభించారు. కేంద్ర ప్రభుత్వంతో ఘర్షణ వైఖరి మొదలైంది. బిజెపి కూడ ఏమి తక్కువ తినలేదనట్లు టీఆర్‌ఎస్‌ ప్రభుత్వంతో అమీతుమీకి సిద్దమైంది.
రాష్ట్ర బిజెపిని అదుపుచేయాలంటే కేంద్రంలోని బిజెపిని చికాకు పెట్టాలనే ప్రధాన లక్ష్యంతో కేసిఆర్‌ జాతీయ రాజకీయాలవైపు దృష్టి మళ్లించారు.
రాష్ట్రంలోనే బిజెపితో ఇబ్బందిపడుతున్న కేసీఆర్‌ దేశ రాజకీయాలలో ఆ పార్టీని ఏ మేరకు ఎదుర్కొంటారో అనే సందేహం రావడం సహజం. పార్టీ ఏర్పాటుకు ముందు కేసిఆర్‌ పలు రాష్ట్రాల్లో పర్యటించి ప్రధానంగా బిజెపి, కాంగ్రెస్‌ యేతర ప్రధాన నేతలను కలుసుకున్నారు. వారితో కలిసి కూటమి ఏర్పాటు చేస్తారనే ప్రచారం అయ్యింది. 
 
అయితే కేసిఆర్‌ ఒకరితో కలిసి కాకుండా వ్యక్తిగతంగా తనకు ప్రత్యేక గుర్తింపు రావాలనే తలంపుతో ముందుకు సాగారు. పంజాబ్‌ రాష్ట్రంలో రైతులకు, బిహార్‌లో జవాన్లకు ఆర్థిక సహాయం చేశారు. ఢిల్లీకి వెళ్లి కేజ్రీవాల్‌ను కలిశారు. అడపాదడపా ఇతర రాష్ట్రాల నేతలను కలిశారు. జాతీయ రైతు సంఘాల నేతలను రాష్ట్రానికి ఆహ్వానించి రైతు సమస్యలపై చర్చించారు. బిజెపిపై విమర్శలు గుప్పించారు. 
 
ఈ పరిణామాలతో కేసిఆర్‌ ఆశించిన మేర జాతీయ స్థాయిలో ప్రాధాన్యత లభించలేదు. ఇతర రాష్ట్రాల నేతలు కలిసినా అవన్నీ తాత్కాలికంగానే ఉన్నాయి. రాష్ట్రపతి, ఉప రాష్ట్రపతి ఎన్నికల్లో మాత్రం ఎన్‌డిఎ అభ్యర్థులకు వ్యతిరేకంగా నిలబడిన ప్రతిపక్షాల అభ్యర్థులకు కేసీఆర్‌ మద్దతు ఇచ్చారు. ఈ విషయంలో కూడా ప్రతిపక్షాల మధ్య సమైక్యత కొరవడింది. 
 
లోగడ ఒక సందర్భంలో టెంటు లేదు ఫ్రంటు లేదన్న కేసిఆర్‌ బిజెపి యేతర ప్రతిపక్షాలతో లాభపడుదామనుకున్నా జాతీయ స్థాయిలో ఆశించిన మేరకు గుర్తింపు రాకపోవడంతో ఇప్పుడు నూతన జాతీయ పార్టీ అంకానికి తెరదీశారు. 
ఇక్కడ గమనించాల్సిన మరో ముఖ్యాంశం ప్రస్తుత దేశ రాజకీయాలను పరిశీలిస్తే బిజెపిని ఎదుర్కోవాలంటే ఎవరు ఏ పార్టీని ఏర్పాటు చేసిన జాతీయ స్థాయిలో ఒక కూటమి అత్యవసరం. అది కూడా కాంగ్రెస్‌ మద్దతు లేకుండా దుస్సాధ్యం. కాంగ్రెస్‌ గత అనుభవాల దృష్ట్యా కేసిఆర్‌ను విశ్వసించదు.
 ప్రత్యేక రాష్ట్రం ఏర్పడిన తర్వాత టిఆర్‌ఎస్‌ను కాంగ్రెస్‌లో కలుపుతానని చెప్పిన కేసిఆర్‌ తర్వాత రాష్ట్రంలో ఆ పార్టీని బలహీనపర్చడానికి చేసిన యత్నాలను కాంగ్రెస్‌ రాష్ట్ర, కేంద్ర నాయకత్వం అంత తొందరగా మర్చేపోదు.
ఇతర రాష్ట్రాల్లో ఒక్క సీట్ వస్తుందనే ఆశ లేదు 
రాష్ట్రంలోని 17 లోక్‌సభ స్థానాల్లో కేసిఆర్‌ ఆశించిన సీట్లు వచ్చినా దేశంలో బిజెపిని ఎదుర్కోలేరు. ప్రస్తుత స్థితిలో గరిష్టంగా బిఆర్‌ఎస్‌కు పది సీట్లు మించి వస్తాయనుకోవడం అత్యాశే అవుతుంది. ఇతర రాష్ట్రాలలో బిఆర్‌ఎస్‌కు ఒక్క సీటు కూడా వస్తుందనే ఆశలు లేవు. ఆంధ్రప్రదేశ్‌లో బిఆర్‌ఎస్‌ పోటీ చేసినా రాష్ట్ర ఉద్యమంలో కేసిఆర్‌ చేసిన తీవ్ర వ్యాఖ్యలను ఆ రాష్ట్ర ప్రజలు ఎప్పటికీ మరవలేరు.
అటువంటి బిఆర్‌ఎస్‌తో పొత్తు పెట్టుకునేందుకు వైఎస్‌ఆర్‌సిపి, టిడిపి పార్టీలు సాహసించవు. ఇక గతంలో హైదరాబాద్‌ రాష్ట్ర పరిధిలో ఉన్న కర్ణాటక, మహారాష్ట్ర ప్రాంతాలలో పోటీ చేయాలనుకున్నా కర్ణాటకలోని జేడిఎస్‌ మద్దుతు తీసుకుంటుందే కాని బిఆర్‌ఎస్‌కు సీట్లు వచ్చేలా తోడ్పడుతుందని చెప్పలేం. ఇక మహారాష్ట్రలో శివసేన చీలిపోయి ఉద్దవ్‌ ఠాక్రే బలహీనపడడం కేసీఆర్‌కు ఇబ్బందికరమే.
 ఉత్తరాది రాష్ట్రాలో తెలుగువారు అధికంగా ఉండే గుజరాత్‌ వంటి రాష్ట్రాల్లో బిఆర్‌ఎస్‌ పోటీ చేయాలని భావించినా అభ్యర్థులు దొరకడం కూడా కష్టమే. ఇటువంటి పరిస్థితుల్లో ఆయన దేశ రాజకీయాల్లో రాణించడం అంటే నేలవిడిచి సాము చేయడమే. రాబోయే ఎన్నికల్లో బిజెపికి ప్రత్యామ్నాయం బిఆర్‌ఎస్సే అని ఆ పార్టీ నాయకులు చేస్తున్న ప్రకటనలు ఒకింత హాస్యాస్పదమే.
తెలంగాణ మోడల్‌ను దేశ వ్యాప్తంగా అమలు చేస్తామని బిఆర్‌ఎస్‌ వర్గాలు చెబుతున్నాయి. ప్రధానంగా దళిత, రైతు ఎజెండాగా బిఆర్‌ఎస్‌ ముందుకెళ్తుందని కేసిఆర్‌ అంటున్నారు. దళితుల సంక్షేమ అంశాన్ని పరిశీలిస్తే రాష్ట్రంలో దళితుడిని ముఖ్యమంత్రిని చేస్తామనే వాగ్దానం మొదలుకొని దళిత బంధు వరకు టిఆర్‌ఎస్‌ ప్రభుత్వం ఎన్నో హామీలు గుప్పించింది. మొగ్గలోనే దళిత సీఎం అంశాన్ని కేసీఆర్‌ తుంచివేశారు. 
 
ఇక దళితులకు మూడెకరాల భూమి పంపిణీ పథకం ఆదిలోనే అటకెక్కింది. అందరికీ వర్తింపజేయలేక అవస్థ పడుతున్నారు. దళిత బంధు ఎప్పుడిస్తారని రాష్ట్ర వ్యాప్తంగా దళితులు ప్రశ్నిస్తున్న వార్తలు రోజూ చూస్తున్నాం. దళితులకు సంబంధించి తాను ఇచ్చిన హామీలను స్వరాష్ట్రంలోనే అమలు చేయలేని కేసీఆర్‌ దేశవ్యాప్తంగా ఎలా చేస్తారనే సందేహం వస్తుంది.
 
 ఇక మరో కీలకాంశమైన రైతు సంక్షేమానికి సంబంధించి రైతు బంధు పథకంతో టిఆర్‌ఎస్‌ ప్రభుత్వానికి గత అసెంబ్లీ ఎన్నికల్లో ప్రయోజనం చేకూరినా తెలంగాణలో రైతు ఆత్మహత్యలు నేటికీ కొనసాగుతూనే ఉన్నాయి. రైతు బీమా, రుణ మాఫీలు పూర్తిస్థాయిలో అమలు కాలేదు. ఒకసారి వరి వేయండని, మరోసారి ప్రత్యామ్నాయం వేయండని కేసిఆర్‌ ప్రకటనలతో రైతులు గందరగోళానికి గురవుతున్నారు. 
 
అకాల వర్షాలు, పెట్టుబడికి లాభం లేకపోవడం వంటి సమస్యలకు ఇక్కడి ప్రభుత్వం పరిష్కార మార్గం చూపించలేకపోయింది. మరి రైతుల ఎజెండాతో కేసిఆర్‌ జాతీయ స్థాయిలో ఎలా ముందుకు సాగుతారో వేచి చూడాల్సిందే. 
 
జాతీయ స్థాయిలో కనిపించని స్పందన 
 
బిఆర్‌ఎస్‌ ప్రకటనపై రాష్ట్రంలోని ఆ పార్టీ కార్యకర్తల హడావుడే తప్ప జాతీయ స్థాయిలో కేసిఆర్‌ ఆశించిన మేరకు స్పందన రాలేదు. ప్రధాన పార్టీలలో కర్నాటకకు చెందిన జెడిఎస్‌ మినహా ఇతర పార్టీల నుండి కేసిఆర్‌కు కనీసం అభినందనలు కూడా రాకపోవడం గమనార్హం. కేసిఆర్‌ గతంలో కలిసిన కేజ్రీవాల్‌, మమతా బెనర్జీ, స్టాలిన్‌, నితీష్‌కుమార్‌, తేజస్వీయాదవ్‌, అఖిలేష్‌ యాదవ్‌ వంటి వారెవరూ స్పందించలేదు. 
 
 ఒకటికి మించి రాష్ట్రాల్లో పార్టీ ఉనికిలో ఉంది కాబట్టి మాది జాతీయ పార్టీ అని ఆయా పార్టీలు భావిస్తుంటే, ఎన్నికల సంఘం ఆయా పార్టీలు పోటీ చేసిన ప్రాంతాల్లో వచ్చే స్థానాలు, ఓట్ల శాతాన్ని పరిగణలోకి తీసుకుంటుంది. అందుకే పలు పార్టీలు జాతీయ పార్టీ హోదా పొందడంలో ఇబ్బందులు ఎదుర్కొంటున్నాయి. ఒకటికి మించి రాష్ట్రాల్లో పోటీ చేసిన తృణముల్‌, ఆప్‌, బిఎస్‌పి, ఎస్‌పి, జెడియూ, టిడిపి, వైఆర్‌ఎస్‌పి వంటి పార్టీలు కూడా పూర్తి స్థాయిలో గుర్తింపు పొందలేకపోయాయి. 
 
ఇక బిఆర్‌ఎస్‌ను జాతీయ పార్టీగా గుర్తించాలని ఆ పార్టీ ఎన్నికల సంఘానికి దరఖాస్తు చేసుకోగా దేశ వ్యాప్తంగా ఇప్పటికే ‘బిఆర్‌ఎస్‌’ పేరుమీద మరో మూడు పార్టీలు ఉన్నాయని తేలడం ఆ పార్టీకి కొంత ఇబ్బందికరమే. 
 
వచ్చే ఆరు నెలల్లో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న హిమాచల్‌ ప్రదేశ్‌, గుజరాత్‌, రాజస్తాన్‌, మధ్యప్రదేశ్‌, కర్నాటక మొదలగు రాష్ట్రాల్లో తమది జాతీయ పార్టీ అన్ని చెపుకుంటున్న కేసిఆర్‌కు ఒక్క సీటు కూడా వచ్చే అవకాశం లేదు కాబట్టి అక్కడ పోటీ చేసే సాహసం చేయకపోవచ్చు. ఇది బిఆర్‌ఎస్‌కు సంకట పరిస్థితే. 
 
పోటీ చేస్తే ఉనికిలోనే ఉండరు. పోటీ చేయకపోతే ఇతర రాష్ట్రాల ఎన్నికల్లో పోటీపడనిదే జాతీయ పార్టీ ఎలా అవుతుందనే విమర్శలు ఎదుర్కోవాల్సి ఉంటుంది. కేసిఆర్‌ దేశ రాజకీయాల్లో రాణిస్తారని ఆ పార్టీ నేతలు ఢంకా బజాయిస్తున్నా అది ఆచరణ సాధ్యమయ్యే సూచనలు లేవు. పోనీ బిఆర్‌ఎస్‌ ఏర్పాటుతో రాష్ట్రంలో ఏమైనా ఉపయోగం ఉంటుందా అంటే అదీ ఉండదు. 
 
టిఆర్‌ఎస్‌ అయినా, బిఆర్‌ఎస్‌ అయినా రాష్ట్రంలో కేసిఆర్‌ పాచికలు పారితే మళ్లీ గెలుస్తారు, లేకపోతే ఓడిపోతారు. అంతేకాని బిఆర్‌ఎస్‌ ప్రభావంతో తెలంగాణలో ప్రత్యేకించి వచ్చే అదనపు ప్రయోజనం ఏమీ లేదు. ఇది రెంటికీ చెడ్డ రేవడిలా తయారయ్యే అస్కారం ఉంది. ఉద్యమ కాలంలో ఆ తర్వాత తెలంగాణ అంటే టిఆర్‌ఎస్‌, టిఆర్‌ఎస్‌ అంటే తెలంగాణ అనే విధంగా  ఆ పార్టీ ప్రజల్లో నాటుకుపోయింది. ఆ సెంటిమెంటే వారు నూతన రాష్ట్రంలో అధికారం చేపట్టడానికి దోహదపడింది.
తెలంగాణ పదాన్ని తొలగించడం సాహసమే 
ఈ సెంటిమెంట్‌ ఎక్కడిదాకా వెళ్లిందంటే ఉద్యమ కాలంలో కేసిఆర్‌ కానీ టిఆర్‌ఎస్‌ కానీ ఏమైనా పొరపాట్లు చేసినా, తీవ్ర వ్యాఖ్యలతో విమర్శించినా వాటిని తెలంగాణ సమాజం అంతటికీ ఆపాదించేవారు. రెండోసారి అధికారపీఠం లభించడంలోనూ సెంటిమెంట్‌ ఎంతో కొంత పనికొచ్చింది. అంతలా సెంటిమెంట్‌తో కూడిన తెలంగాణ పదాన్ని తొలగించి భారత్‌ రాష్ట్ర సమితి అని ఏర్పాటు చేయడం సాహసమే అవుతుంది.
ఇప్పటికే ఆ పార్టీలో అంతర్గతంగా ప్రచారంలో ఉన్నట్లు కేటిఆర్‌కు రాష్ట్ర అధికార పగ్గాలు అప్పచెప్పడానికి అనువుగా ఈ నిర్ణయం తీసుకొని ఉండవచ్చు. ఇకపై తాను దేశ రాజకీయాలపై, కేటిఆర్‌ రాష్ట్ర రాజకీయాలపై దృష్టి పెడతారని చెబుతూ రాష్ట్ర బాధ్యతలను కుమారుడికి ఇవ్వడానికి కూడా బిఆర్‌ఎస్‌ ఏర్పాటు తోడ్పడుతుంది. 
 
ప్రస్తుత పరిస్థితులను చూస్తుంటే భవిష్యత్తులో టిఆర్‌ఎస్‌ కీలక నేతలు, కేసిఆర్‌ కుటుంబసభ్యులు ఈడీ, సిబిఐ కేసులు ఎదుర్కోవాల్సి రావచ్చు. మేము దేశ రాజకీయాల్లోకి ప్రవేశిస్తున్నామని బిజెపి మాపై కక్ష కట్టిందని ఆ పార్టీ నేతలు ఆరోపించే అవకాశం ఉంటుంది. అయితే ఎప్పటి నుంచో ఈ కేసుల వార్తలు ప్రచారంలో  ఉండంతో ఈ వాదన ప్రజల్లోకి బలంగా వెళ్లే అవకాశాలు తక్కువగానే ఉంటాయి.
రాష్ట్రంలో కాంగ్రెస్‌ను బలహీనపరిస్తే తమ పార్టీకి ఎదురుండదని భావించిన కేసిఆర్‌కు ఇపుడు బిజెపి రూపంలో సవాలు ఎదురవుతోంది. దేశ రాజకీయాలలో కాంగ్రెస్‌ బలహీనపడిరదని, ఆ పార్టీని ఏదో రకంగా ఎదుర్కోవచ్చని కేసిఆర్‌ తలిచారు. అయితే బిజెపి నుండి ఎదురవతున్న సవాలును ఎదుర్కోవడం అంత తేలిక కాదని ఊహించిన కేసిఆర్‌ ముందు జాగ్రత్తగా బిజెపికి కేంద్ర స్థాయిలోనే సవాలు విసరాలనే భావనతో బిఆర్‌ఎస్‌ ఏర్పాటుకు పూనుకున్నారు. 
 
వచ్చే నెలలో జరిగే మునుగోడు ఎన్నికల్లో టిఆర్‌ఎస్‌ విజయం సాధిస్తే ఆయన బిజెపిని నిలువరించే అవకాశాలు మెండుగా ఉంటాయి. ఒకవేళ బిజెపి విజయం సాధిస్తే ఆ పార్టీని ఎదుర్కోవడం కేసిఆర్‌కు అంత సులభం కాకపోవచ్చు. చాలా శ్రమించాల్సి ఉంటుంది. ఆ సమయంలో ఆయన ఆశించినట్లు దేశ రాజకీయాలపై అంతగా దృష్టి పెట్టే అవకాశాలు ఉండవు. 
 
2023 రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో టిఆర్‌ఎస్‌ తిరిగి అధికారం చేపడితే బిజెపిని కేసిఆర్‌ దేశవ్యాప్తంగా ఇబ్బంది పెట్టే అవకాశాలుంటాయి. ఒకవేళ టిఆర్‌ఎస్‌ రాష్ట్రంలో అధికారం కోల్పోతే మాత్రం ఇక బిఆర్‌ఎస్‌ ఉనికికే ప్రమాదం ఏర్పడవచ్చు.