పాక్ లో పక్షం రోజుల్లో నలుగురు హిందూ బాలికల అపహరణ  

పాకిస్థాన్ లో పక్షం రోజుల్లో నలుగురు హిందూ బాలికలు అపహరణకు గురవడంతో మైనారిటీలు తీవ్ర ఆందోళనకు గురవుతున్నారు. హిందూ బాలికలకు రక్షణ లేని పరిస్థితి నెలకొంది. తాజాగా పాకిస్థాన్‌లోని సింధ్‌లో ఇంటికి తిరిగి వెళ్తున్న ఓ హిందూ బాలికను దుండగులు అపహరించుకుపోయారు. పోలీసులకు ఫిర్యాదు చేసినా ఆమె జాడ తెలియడం లేదు.
హిందువులు, ఇతర మైనారిటీలు పాకిస్థాన్ జనాభాలో కేవలం 3.5 శాతం మంది మాత్రమే ఉన్నారు. ఈ మైనారిటీలంతా మెజారిటీ ముస్లింల చేతుల్లో మత హింసకు గురవుతున్నారు. బలవంతపు మతమార్పిడులను నిరోధించేందుకు ఉద్దేశించిన బిల్లును గత ఏడాది అక్టోబరులో పార్లమెంటరీ ప్యానెల్ తిరస్కరించింది.
పాకిస్థాన్‌లోని సింధ్ ప్రావిన్స్, హైదరాబాద్ పట్టణంలో ఇటీవల ఓ హిందూ బాలిక చంద్ర మహరాజ్‌ను కొందరు దుండగులు అపహరించారు. బాధితురాలి తల్లిదండ్రులు చెప్తున్నదాని ప్రకారం, చంద్రను ఫతే చౌక్ ప్రాంతంలో కిడ్నాప్ చేశారు.
ఆమె ఇంటికి తిరిగి వెళ్తున్న సమయంలో ఈ దారుణం జరిగింది. పోలీసులకు ఫిర్యాదు చేసినప్పటికీ, ఆమె జాడ ఇంకా తెలియడం లేదు.  కొద్ది రోజుల క్రితం ముగ్గురు హిందూ మహిళలను కిడ్నాప్ చేసి, బలవంతంగా ఇస్లాంలోకి మార్చినట్లు వార్తలు వచ్చాయి. దీంతో మైనారిటీ హిందువులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
మిర్‌పుర్‌ఖాస్ పట్టణంలో హిందూ వ్యక్తి రవి కుర్మి మాట్లాడుతూ, తన భార్య రాఖీని ఇస్లామిక్ దుండగులు కిడ్నాప్ చేసి, ఇస్లాం మతంలోకి మార్చి, ఓ ముస్లిం యువకునితో ఆమెకు పెళ్లి చేశారని చెప్పారు. అయితే పోలీసులు మాత్రం రాఖీ తనంతట తానే మతం మారిందని, అహ్మద్ చందియోను పెళ్లి చేసుకుందని చెప్తున్నారు.
ఇటీవలి కాలంలో పాకిస్థాన్‌లో హిందువులపై అరాచకాలు, దురాగతాలు విపరీతంగా జరుగుతున్నాయి. ఈ ఏడాది జూన్‌లో కరీనా కుమారి అనే హిందూ బాలిక కోర్టులో మాట్లాడుతూ, తనను బలవంతంగా మతం మార్చి, ఓ ముస్లిం వ్యక్తితో పెళ్లి చేశారని చెప్పారు. అంతకుముందు సత్రాన్, కవిత, అనిత అనే ముగ్గురు హిందూ బాలికలకు కూడా ఇటువంటి దుస్థితి ఎదురైంది.
మార్చి 21న పూజ కుమారి అనే హిందూ బాలికను దారుణంగా కాల్చి చంపేశారు. ఆమెను పెళ్లి చేసుకుంటానని ఓ వ్యక్తి ఆమెకు చెప్పాడు. అందుకు ఆమె తిరస్కరించడంతో ఆమెను కాల్చి చంపేశారు.  బలవంతపు మత మార్పిడుల నిరోధక బిల్లును గత ఏడాది అక్టోబరులో పాకిస్థాన్ పార్లమెంటరీ కమిటీ తిరస్కరించింది.
అప్పటి మత వ్యవహారాల శాఖ మంత్రి నూరుల్ హక్ ఖాద్రి మాట్లాడుతూ, బలవంతపు మత మార్పిడుల నిరోధక చట్టం చేయడానికి ఇది అనుకూల సమయం కాదని పెక్రోన్నారు. ఇటువంటి చట్టాన్ని చేస్తే దేశంలో శాంతికి విఘాతం కలుగుతుందని తెలిపారు. మైనారిటీలు మరింత దెబ్బతింటారని చెప్పారు.