సాంకేతికత, ప్రతిభ భారత్ అభివృద్ధి యాత్ర లో కీలక భూమిక

సాంకేతిక విజ్ఞానం, ప్రతిభ- ఈ రెండు అంశాలు భారతదేశపు అభివృద్ధి యాత్ర లో కీలక భూమిక ను పోషిస్తున్నాయని ప్రధాని నరేంద్ర మోదీ తెలిపారు. సాంకేతిక విజ్ఞానం తనతో పాటు పరివర్తనను వెంటబెట్టుకు వస్తుందని ప్రధాన మంత్రి పేర్కొంటూ జెఎఎమ్ (జన్ ధన్ ఖాతా, ఆధార్, మొబైల్) త్రయం 800 మిలియన్ ప్రజలకు సంక్షేమ ప్రయోజనాలు అంతరాయానికి తావు ఉండనటువంటి విధంగా అందించిందని చెప్పారు. 

హైదరాబాద్ లో జరుగుతున్న ఐక్యరాజ్యసమితి రెండో ప్రంపంచ జియోస్పేషియల్ ఇన్ఫర్మేషన్ కాంగ్రెస్ సదస్సులో వర్చువల్ గా పాల్గొన్న ప్రధాని ప్రపంచంలోకెల్లా అతి భారీ స్థాయిలో ప్రజలకు టీకామందు ను ఇప్పించే కార్యక్రమానికి ఊతంగా నిలచినటువంటి ఒక టెక్నికల్ ప్లాట్ ఫార్మ్ ను కూడా అందించిందని గుర్తు చేశారు.

‘‘భారతదేశంలో, సాంకేతిక విజ్ఞానం అనేది ఏ వర్గాన్నో వదిలివేయడానికి పనికొచ్చే ఒక సాధనంగా కాక అన్ని వర్గాలను కలుపుకుని పోయేటటువంటి ఒక సాధనం గా ఉంది’’ అని నరేంద్ర మోదీ తెలిపారు. సమాజం లో అన్ని వర్గాల ను ఉమ్మడిగా కలుపుకొని పోవడంతో పాటు ప్రగతిని సాధించడానికి జియో స్పేశల్ టెక్నాలజీ ఒక ముఖ్యమైన పాత్రలు పోషిస్తున్నదని ఆయన స్పష్టం చేశారు. 

స్వామిత్వ, గృహ నిర్మాణం వంటి పథకాలలో సాంకేతిక విజ్ఞానపు పాత్ర, ఇంకా సంపత్తి యాజమాన్యం, మహిళల స్వశక్తీకరణ వంటి విషయాలలో సిద్ధించిన ఫలితాలు ఐక్య రాజ్య సమితి నిర్దేశించిన సుస్థిర అభివృద్ధి లక్ష్యాలు (ఎస్ డిజి స్ ) అయిన  పేదరికం, మహిళలు- పురుషుల మధ్య సమానత్వంలపై ప్రత్యక్ష ప్రభావాన్ని ప్రసరింప జేశాయని ప్రధాన మంత్రి తెలిపారు. 

జియో స్పేశల్ టెక్నాలజీ ద్వారా పీఎమ్ గతిశక్తి మాస్టర్ ప్లానును బలోపేతం చేయడం జరుగుతోందని, అది డిజిటల్ ఓశన్ ప్లాట్ ఫార్మ్ కు సమానమైందని ఆయన చెప్పారు. భారతదేశానికి ఇరుగు పొరుగున ఉన్న ప్రాంతాల లో కమ్యూనికేశన్ సౌకర్యం కోసం దక్షిణ ఏశియా ఉపగ్రహాన్ని ఉదాహరణగా ప్రధాన మంత్రి పేర్కొంటూ, భారతదేశం ఇప్పటికే జియో స్పేశల్ టెక్నాలజీ  లాభాలు పంచుకొనే రంగంలో ఒక నిదర్శనాన్ని నెలకొల్పిందని చెప్పారు. 

భారతదేశం సాగిస్తున్న ప్రయాణంలో రెండో ప్రధానాంశంగా ఉన్నటువంటి ప్రతిభ భూమికను గురించి ప్రధాన మంత్రి వివరిస్తూ, ‘‘భారతదేశం ఒక యువ దేశంగా ఉంది, భారతదేశంలో నూతన ఆవిష్కరణల భావన ప్రబలంగా ఉంది’’ అని పేర్కొన్నారు. ప్రపంచంలో అగ్రగామి స్టార్ట్- అప్ హబ్స్ లో ఒకటి గా భారతదేశం ఉందని, భారతదేశం లో 2021వ తరువాతి నుంచి యూనికార్న్ హోదాను సాధించిన స్టార్ట్- అప్స్ సంఖ్య దాదాపు గా రెండింతలు అయిపోవడం భారతదేశపు యువత  ప్రతిభకు ప్రమాణంగా ఉందని కూడా ఆయన వివరించారు.

‘మనం కలిసి కట్టుగా మన భవిష్యత్తు ను నిర్మించుకొంటున్న క్రమంలో భారత దేశంలో ప్రజలు ఈ చారిత్రిక సందర్భం లో మీకు ఆతిథేయి గా ఉన్నందుకు సంతోషిస్తున్నారు’’ అని ప్రధాని తెలిపారు. ఈ నెల 10 న ప్రారంభమైన సదస్సు 14వ తేదీ వరకు జరుగనుంది. ఐక్యరాజ్య సమితితో పాటు కేంద్ర ప్రభుత్వం సంయుక్తంగా ఈ కార్యక్రమం నిర్వహిస్తోంది. సదస్సులో 120 దేశాల నుంచి దాదాపు 2వేల మంది ప్రతినిధులు పాల్గొన్నారు.