విద్యుత్ ఉద్యోగుల విభజనలో తెలంగాణ ప్రభుత్వంపై `సుప్రీం’ ఆగ్రహం 

తెలంగాణ రాష్ట్రాల మధ్య విద్యుత్ ఉద్యోగుల విభజనపై ధర్మాధికారి కమిటీ ఇచ్చిన నివేదికను అమలు చేయకుండా వ్యవహరిస్తున్న తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వంపై సుప్రీంకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. ఈ వ్యవహారంలో ధర్మాధికారి కమిటీ ఇచ్చిన నివేదిక, అందులోని సిఫార్సులే అంతిమమని, వాటిని అమలు చేసి తీరాల్సిందేనని స్పష్టం చేసింది. 
 
ఈ కమిటీ నివేదిక ప్రకారం తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం విధుల్లోకి తీసుకోవాల్సిన 84 మంది ఏపీ ఉద్యోగులు దాఖలు చేసిన కోర్టు ధిక్కరణ పిటిషన్‌పై జస్టిస్ ఎంఆర్ షా నేతృత్వంలోని సుప్రీంకోర్టు ధర్మాసనం మంగళవారం ఈ ఆదేశాలు జారీ చేసింది. నివేదికను తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఉద్దేశపూర్వకంగా అమలు చేయడం లేదని కోర్టు దృష్టికి తీసుకొచ్చారు.
ఈ క్రమంలో నివేదికను అమలు చేయకపోవడం కోర్టు ధిక్కరణగా పరిగణించాల్సి ఉంటుందని, ఆ నేరానికి అధికారులు జైలుకు వెళ్లాల్సి ఉంటుందని సుప్రీంకోర్టు ధర్మాసనం తీవ్రంగా స్పందించింది. చివరి అవకాశంగా 2 వారాలు గడువిస్తున్నామని, ఈలోగా మొత్తం 84 మంది ఏపీ ఉద్యోగులను విధుల్లోకి తీసుకుని జీతభత్యాలు చెల్లించాలని ఆదేశించింది. అక్టోబర్ 31న ఈ కేసును మళ్లీ సమీక్షిస్తామని ధర్మాసనం పేర్కొంది.
రెండున్నర సంవత్సరాలం క్రితం ఆంధ్రప్రదేశ్నుంచి 655 మంది ఉద్యోగులను తెలంగాణ విద్యుత్‌ సంస్థలకు కేటాయిస్తూ జస్టిస్‌ ధర్మాధికారి కమిటీ నివేదిక ఇచ్చింది. రెండు రాష్ట్రాల మధ్య ఉద్యోగుల విభజన కోసం ఆంధ్రప్రదేశ్ పునర్వ్యవస్థీకరణ చట్టం 2014 ప్రకారం ధర్మాధికారి కమిటీ ఏర్పాటు చేశారు.
ధర్మాధికారి కమిటీ సిఫార్సు చేసిన వారిలో 571 మందికి మాత్రమే పోస్టింగులు వచ్చాయి. మరో 84 మందికి పోస్టింగులు ఇచ్చేందుకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నిరాకరించింది. ఈ మేరకు తన వాదనలు కూడా వినిపించింది. అయితే ఉద్యోగుల విభజన విషయంలో ధర్మాధికారి కమిటీ సిఫార్సులే ఫైనల్ అంటూ సుప్రీంకోర్టు మంగళవారం తేల్చిచెప్పింది.