ప్రజల ఆకాంక్షలు నెరవేర్చడంలో టీఆర్ఎస్ ప్రభుత్వం విఫలం

తెలంగాణ ప్రజల ఆకాంక్షలు నెరవేర్చడంలో టీఆర్ఎస్ ప్రభుత్వం విఫలమైందని కేంద్ర మంత్రి భూపేంద్ర యాదవ్ ధ్వజమెత్తారు. రాష్ట్రం ఏర్పడితే ఒక కుటుంబం మాత్రమే బాగుపడిందని పేర్కొంటూ ధనిక రాష్ట్రాన్ని అవినీతిమయం చేశారని విమర్శించారు. 
 
మెదక్ జిల్లా నర్సాపూర్ లో నిర్వహించిన బీజేపీ బహిరంగ సభలో మాట్లాడుతూ  తెలంగాణలో ప్రజలు మార్పు కోరుకుంటున్నారని చెప్పారు. టీఆర్ఎస్ ప్రజలు ఆ పార్టీకి విఆర్ఎస్ పలకడం ఖాయం అని స్పష్టం చేశారు. ప్రతి పల్లెలో అభివృద్ధి పనులు, అర్హులందరికి సంక్షేమ పథకాలు వర్తింపజేసేందుకు బీజేపీ కట్టుబడి ఉందని భరోసా ఇచ్చారు. 
 
 ఈ సందర్భంగా నర్సాపూర్ మున్సిపల్ చైర్మన్ మురళీ యాదవ్ సహా పలువురు టీఆర్ఎస్ నాయకులు  టీఆర్ఎస్ లో చేరారు.  కేంద్రం నుంచి సంక్షేమ పథకాల కోసం నిధులు వచ్చినా ఇక్కడ ఆగిపోతున్నాయని  భూపేందర్ యాదవ్ ఆరోపించారు .రాష్ట్రంలో పేదలకు పథకాలు అందకుండా పోతున్నాయన్నారు. వచ్చే ఎన్నికల్లో టీఆర్ఎస్ ఓడిపోవడం ఖాయమని తెలిపారు. 

రాష్ట్రంలో అవినీతి, కుటుంబ పాలన నడుస్తోందని పేర్కొంటూ ప్రజాస్వామ్యంలో కుటుంబ పాలనకు చోటు లేదని స్పష్టం చేశారు. రాజస్థాన్ లో ఇద్దరు పార్టీ నేతలను ఏకం చేయలేని వారు భారత్ ను ఏకం చేస్తారా? అని రాహుల్ జోడో యాత్రపై భూపేంద్ర యాదవ్ సెటైర్ విసిరారు.

సీఎం కేసీఆర్ రాష్ట్రానికి అమ్రీష్ పురిలా తయారయ్యాడని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ ఆరోపించారు.  బీఆర్ఎస్ పార్టీ పేరుతో కేసీఆర్ కొత్త నాటకానికి తెర లేపారన్న సంజయ్ రాష్ట్రానికి ఏం చేయలేనోడు దేశానికి చేస్తాడా అని నిలదీశారు. రైతు బంధు ఇచ్చి  రైతులకు ఇవ్వాల్సిన సబ్సిడీలను కట్ చేశారని ఫైర్ అయ్యారు. రాష్ట్ర రైతులను ఆదుకోని కేసీఆర్ పంజాబ్ రైతులకు మూడు లక్షలు ఇవ్వడం ఏంటని ప్రశ్నించారు. 
 
కేసీఆర్ జిల్లాగా పేరొందిన మెదక్ లో భవిష్యత్తులో టీఆర్ఎస్ గల్లంతవడం ఖాయమని చెబుతూ కేసీఆర్ సొంత జిల్లా అయిన మెదక్ జిల్లాలో బిజెపి జెండా ఎగురవేస్తామని ఎమ్యెల్యే, బిజెపి జాతీయ కార్యవర్గ సభ్యుడు ఈటెల రాజేందర్ ధీమా వ్యక్తం చేశారు. . కేసీఆర్.. కేసీఆర్ కొడుకు.. అల్లుడు స్వయంగా ముగ్గురు నాయకత్వం వహించిన గడ్డ మీద రఘునందన్ ను గెలిపించి చెంప ఛెల్లుమనిపించిన ఘనత మెదక్ ప్రజలదని గుర్తు చేశారు. 
 
మద్యం అమ్మకాలు ద్వారా దేశంలో అత్యధిక ఆదాయం పొందుతున్న రాష్ట్రం తెలంగాణ మాత్రమే. బీజేపీ అధికారంలోకి వస్తే కౌలు రైతులకు రైతు బంధు ఇస్తామని ప్రకటించారు. 
 
మునుగొడులో రాజగోపాల్ రెడ్డి గెలుపు ఖాయం అంటూ మునుగోడు తర్వాత వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లోనూ బీజేపీ విజయం సాధించి అధికారంలోకి వస్తుందని స్పష్టం చేశారు. డబ్బు సంచులతో కేసీఆర్ ఎన్ని అడ్డంకులు సృష్టించినా తెలంగాణలో బీజేపీ బలోపేతాన్ని ఆపలేరని పేర్కొన్నారు.
 ‘‘కేసీఆర్ దమ్ముంటే కొట్లాడు.. వక్రమార్గాల ద్వారా డబ్బు సంచుల ద్వారా ఇతర పార్టీలను నిలువరించాలని భావిస్తే  నీ జేజమ్మ వల్ల కూడా కాదు’’ అని ఈటెల సవాల్ చేశారు.  ‘‘హుజూరాబాద్ ప్రజలు కేసీఆర్ కు కర్రు కాల్చి వాత పెట్టారు. మునుగోడులో కూడా అదే జరగబోతోంది. అక్కడి ప్రజలు బీజేపీ వైపే ఉంటారు’’ అని స్పష్టం చేశారు. ‘‘ సీఎం కేసీఆర్ ఫామ్ హౌజ్ కు పోయినా కలవడు.. ప్రగతి భవన్ లోనూ కలవడు.. అలాంటి వ్యక్తిని ఓడించాలనే కసితో తెలంగాణ ప్రజలు ఉన్నారు’’ అని ఈటల చెప్పారు.
 
బీఆర్ఎస్ అంటున్న కేసీఆర్ కు సీఆర్ఎస్ (కంపల్సరీ రిటైర్మెంట్ స్కీమ్) ఇవ్వాలని బీజేపీ ఎమ్మెల్యే రఘునందన్ రావు విమర్శించారు.  నర్సాపూర్, జిన్నారం, పటాన్ చెరు ప్రాంతాల్లో ఏర్పాటు చేసిన కంపెనీల్లో స్థానికులకు 80 శాతం ఉద్యోగాలు ఇస్తామని కేసీఆర్ చెప్పారన్న రఘునందన్.. ఇప్పటికీ ఒక్కరికి కూడా ఉద్యోగం ఇవ్వలేదని తెలిపారు. వచ్చే ఎన్నికల్లో కేసీఆర్ కు కర్రు కాల్చి వాత పెట్టాలని రఘునందన్ రావు కోరారు.